పేదరికమే పెట్టుబడిగా అండ దానం వ్యాపారం
హైదరాబాద్ లో వైద్య రంగానికి మరో మచ్చ. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ అండ దానం రాకెట్ రట్టుయింది. నిబంధనలకు విరుద్ధంగా అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని సాగిస్తున్న ఈ దందా పోలీసుల దాడులతో బట్టబయలైంది. గతంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్’ ఉదంతం మరవకముందే, మళ్లీ అటువంటి ఘటనే పునరావృతం కావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన విస్తృత సోదాలలో ఈ భారీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రకాశ్‌నగర్, బేగంపేట్, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాల్పురం తదితర ప్రాంతాలలో ప్రైవేట్ హాస్టళ్ల ముసుగులో ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న దాదాపు 23 ఐవీఎఫ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన అమిత్ శర్మతో పాటు నిఖత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మేఘవత్ శ్రీనివాస్, జె. ప్రదీప్, ఎస్.కె. పర్వీన్, విజయ్ భగవాన్ రావు సలుంకేలతో పాటు మొత్తం 8 మంది ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో గత ఏడాది వెలుగు చూసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసి కేసులో నిందితుడిగా ఉన్న పంకజ్ సోని (సృష్టి సంస్థ మేనేజర్) పాత్ర కూడా ఉండటం గమనార్హం.
పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద మహిళలను టార్గెట్ చేసి ఈ ముఠా రంగంలోకి దిగింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి వారిని హైదరాబాద్ రప్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య వసతి ఏర్పాట్లు చేసి, అండాలు సేకరించేందుకు వారిని ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించేవారు. ఒక్కో మహిళకు కేవలం రూ. 20,000 నుంచి రూ. 30,000 మాత్రమే చెల్లించేవారు. వాళ్లు మాత్రం లక్షలు వసూలు చేశేవారు.
పోలీసులు జరిపిన తనిఖీలలో హుమోగ్ హెచ్‌పి ఇంజెక్షన్లు, ప్రిమోలుట్, మెప్రేట్ వంటి ప్రమాదకరమైన హార్మోన్ మందుల వయల్స్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణ, ఎలాంటి నిబంధనలు పాటించకుండా పదే పదే హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఆ మహిళల ప్రాణాలకే తీవ్ర ముప్పు వాటిల్లుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు ఇప్పటికే పలుమార్లు అండాలను దానం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ అక్రమ నెట్‌వర్క్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఐవీఎఫ్ కేంద్రాల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఏజెంట్ల ద్వారా మహిళలను సేకరిస్తున్న విషయం ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలుసా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. వైద్య రంగంలో పవిత్రతను కాపాడటానికి, ఇలాంటి అక్రమ ముఠాల ఆటకట్టించడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీసులు సంయుక్తంగా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








