హ్యాకర్లకే చుక్కలు చూపిస్తున్న AI.. వాళ్ల వీక్ పాయింట్ పై దెబ్బకొట్టేసి రివర్స్ గేమ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఇతరుల కంప్యూటర్లలోకి చొరబడి డేటాను దొంగిలించడం ఒక ఎత్తు.. ఆ డేటాను తిరిగి ఇవ్వాలంటే కోట్ల రూపాయలు చెల్లించాలని బెదిరించడం మరో ఎత్తు! ఇంతకాలం సైబర్ నేరగాళ్లు ఇదే ఫార్ములాతో కంపెనీలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ల ఆటకు అడ్డుకట్ట వేసే కొత్త వ్యూహం తెరపైకి వచ్చింది. హ్యాకర్లను ఎదుర్కోవడానికి మరో హ్యాకింగ్ టెక్నిక్ అవసరం లేదు.. వాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే చాలని నిరూపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అలా ఎలా చేయగలుగుతోంది. దాని వలన ఉపయోగం ఏమిటి?
హ్యాకర్లతో బేరసారాలకు ఏఐ సాయం!
రీసెంట్ గా కెనడాకు చెందిన ఓ రిటైల్ సంస్థ కంప్యూటర్ నెట్‌వర్క్‌ను హ్యాకర్లు దెబ్బతీశారు. దీంతో ఆ సంస్థ యాజమాన్యం తమ తరఫున సైబర్ నేరగాళ్లతో చర్చలు జరిపేందుకు Surefire Cyber Inc. అనే సంస్థను ఆశ్రయించింది. ఈ చర్చల్లో 41 ఏళ్ల జో టరాఫ్ నెగోషియేటర్‌గా వ్యవహరించారు. హ్యాకర్లతో బేరసారాలు జరపడంలో ఆయనకు గత అనుభవం ఉంది. ముఖ్యంగా రష్యన్ భాష మాట్లాడే హ్యాకర్లు తక్కువ మొత్తంతో బేరం మొదలుపెడితే తీవ్రంగా స్పందిస్తారని, సమాధానం కోసం ఎక్కువసేపు వేచి ఉంచినా అసహనానికి గురవుతారని ఆయనకు తెలుసు.
అంతేకాదు.. హ్యాకర్లు ఒకసారి బేరసారాల్లో ‘సగం సగం చేసుకుందాం’ అని ప్రతిపాదించినంత మాత్రాన అదే వారి చివరి మాట కాదని కూడా ఆయనకు అనుభవం నేర్పింది. అంటే వాళ్లు ఒక మొత్తానికి అంగీకరించినట్లు కనిపించినా, ఇంకా బేరం చేసే అవకాశం ఉంటుందన్నమాట.
వందల చర్చలను విశ్లేషిస్తున్న ఏఐ!
ఇప్పుడు ఇలాంటి అనుభవాలన్నింటినీ ఒకచోట చేర్చి విశ్లేషించే బాధ్యతను ఏఐ తీసుకుంటోంది. ఎందుకంటే హ్యాకర్లకూ కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. ఒకే రకమైన సైబర్ నేరాలకు పాల్పడే గ్రూపులు బేరసారాల్లోనూ ఒకే తరహా వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన వందలాది చర్చలను ఏఐ విశ్లేషించి, ఆయా హ్యాకర్ గ్రూపుల ప్రవర్తనా తీరును గుర్తించగలదు.
ఈ ఏడాది ప్రారంభంలో Surefire Cyber ప్రత్యేకంగా ఇలాంటి ఏఐ టూల్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం సంస్థ తన సిబ్బందికి సహాయపడేందుకు దీన్ని ఉపయోగిస్తోంది. గతంలో వివిధ సైబర్ నేరగాళ్లతో జరిగిన చర్చల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా, ఇప్పుడు ఎలాంటి బేరసారాల వ్యూహాన్ని అనుసరించాలో సూచిస్తోంది.
ఇక హ్యాకర్లకు పాత ఆటలు సాగవా?
ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లతో బేరసారాలు జరిపే నిపుణులు తమ అనుభవం, అంచనాలపై ఆధారపడేవారు. కానీ ఏఐ రాకతో గత చర్చల్లోని సమాచారాన్ని విశ్లేషించి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఏర్పడుతోంది. హ్యాకర్లు అడిగిన మొత్తానికి వెంటనే అంగీకరించాలా? మరికొంత సమయం తీసుకోవాలా? వారి ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు? వంటి అంశాలను అంచనా వేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.
ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఇతరులను భయపెట్టే హ్యాకర్లకు ఇప్పుడు అదే టెక్నాలజీ ఎదురుగా నిలుస్తోంది. వాళ్లు గతంలో ఆడిన ఆటలే ఇప్పుడు వాళ్ల బలహీనతలను బయటపెడుతున్నాయి. అయితే ఏఐతో బేరసారాలు మెరుగుపడుతున్నాయే తప్ప, హ్యాకర్లు పూర్తిగా లొంగిపోతున్నారని చెప్పలేం. సైబర్ నేరాల ప్రపంచంలో ఇప్పుడు పోరాటం కేవలం కంప్యూటర్ల మధ్యే కాదు.. ఒకరి వ్యూహాన్ని మరొకరు ముందుగానే పసిగట్టే తెలివితేటల మధ్య కూడా సాగుతోంది.








