Flipkart లో రూ.150 కోట్ల కిక్‌బ్యాక్ స్కామ్? ఉద్యోగులపై సంచలన విచారణ!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆన్లైన్లో ఏ వస్తువు కొనాలన్నా చాలామందికి గుర్తొచ్చే పేరు ఫ్లిప్‌కార్ట్. అక్కడ వస్తువులు కొనుగోళ్లు, అమ్మకాలు చాలా నిజాయితీగా ఉంటాయని జనం నమ్ముతూంటారు. అందుకే ఈ సంస్ద కోట్లలో లాభాలు సాధిస్తోంది. అయితే డబ్బు ఉన్నచోటే రకరకాల తలనొప్పులు వస్తాయి. తాజాగా ఈ సంస్థలో కొందరు ఉద్యోగులు కంపెనీకు దెబ్బకొడుతూ తమ సొంత వ్యాపారం నడిపారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం అక్షరాలా రూ.150 కోట్లకు పైమాటే. విషయం బయటకు రావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా కలిగిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ రంగంలోకి దిగింది. ఉద్యోగులపై అంతర్గత విచారణ ప్రారంభించింది.అసలింతకీ ఈ స్కామ్ ఏమిటి,ఎలా జరిగింది
రూ.150 కోట్లకు పైగా కిక్‌బ్యాక్‌లు.. అసలు ఏం జరిగింది?
Moneycontrol కథనం ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లోని స్మార్ట్ఫోన్లు, లగేజ్ అండ్ ట్రావెల్ యాక్సెసరీస్ (LTA) విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విజిల్బ్లోయర్లు ఇచ్చిన సమాచారంతో వాల్‌మార్ట్ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది.
ఆరోపణల ప్రకారం.. కొందరు ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌కు వస్తువులు సరఫరా చేసే వెండర్ల నుంచి కమీషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిఫలంగా ఆయా వెండర్ల ఉత్పత్తులకు ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల ఆ విక్రేతల వస్తువులకు ఎక్కువ మంది కస్టమర్ల దృష్టి వెళ్లి, అమ్మకాలు పెరిగే అవకాశం ఏర్పడింది.
అంటే ఒక ఉత్పత్తి నాణ్యత, ధర, కస్టమర్ల ఆదరణ కంటే.. లోపల ఎవరికి ఎంత ముట్టిందన్నదే దాని ప్రమోషన్‌ను ప్రభావితం చేసిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
బిజినెస్ టు బిజినెస్ ఛానెల్నే అడ్డాగా మార్చుకున్నారా?
ఈ ఆరోపణల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఉద్యోగులు ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ టు బిజినెస్ (B2B) ఛానెల్‌ను ఉపయోగించుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో మనం వ్యక్తిగతంగా వస్తువులు కొనుగోలు చేస్తుంటాం. కానీ B2B వ్యాపారంలో కిరాణా దుకాణాలు, రిటైలర్లు, చిన్న వ్యాపారులకు పెద్ద మొత్తంలో ఉత్పత్తులు సరఫరా చేస్తారు. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, మార్కెట్‌ప్లేస్ విక్రేతల కోసం నిర్వహించే B2B సేల్స్ కార్యక్రమాలు ఇందులో భాగం.
ఈ వ్యవస్థలో వస్తువులు ఒక వ్యాపారి నుంచి మరో వ్యాపారికి వెళ్లే సమయంలో కొందరు ఉద్యోగులు వెండర్ల నుంచి వాటాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో ఏయే లావాదేవీలు జరిగాయి? ఎంతమంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు? ఎంత మొత్తం చేతులు మారింది? అనే వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.
మూడేళ్లలో మూడోసారి విచారణ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏం జరుగుతోంది?
ఈ వ్యవహారం వాల్‌మార్ట్‌కు కొత్త కాదు. గత మూడేళ్లలో ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న అంతర్గత అక్రమాలపై వాల్‌మార్ట్ విచారణ చేపట్టడం ఇది మూడోసారి అని Moneycontrol వెల్లడించింది.
– రెండున్నరేళ్ల క్రితం: లగేజ్ అండ్ ట్రావెల్ యాక్సెసరీస్ విభాగంలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో కనీసం ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.
– ఆరు నెలల క్రితం: స్మార్ట్ఫోన్ల విభాగంలో అక్రమాలపై మరోసారి విచారణ చేపట్టారు. ఒక ఉద్యోగి తప్పు చేసినట్లు తేలడంతో, తొలగింపునకు ముందే రాజీనామా చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం: స్మార్ట్ఫోన్లు, LTA విభాగాల్లో రూ.150 కోట్లకు పైగా కిక్‌బ్యాక్‌లు తీసుకున్నారనే ఆరోపణలపై మళ్లీ దర్యాప్తు జరుగుతోంది.
విచారణ ఇంకా కొనసాగుతోందని, అక్రమాల స్వరూపం, కిక్‌బ్యాక్‌ల మొత్తం ఎంత అన్నది రాబోయే వారాల్లో స్పష్టమవుతుందని Moneycontrolకు ఓ వ్యక్తి వెల్లడించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్ వర్గాలు తెలిపాయి.
రూ.1.46 లక్షల కోట్ల వ్యాపారంలో రూ.150 కోట్ల ఆరోపణలు.. అయినా ఎందుకింత సీరియస్?
ఫ్లిప్‌కార్ట్ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.1.46 లక్షల కోట్లకు పైగా ఆదాయం సాధించినట్లు నివేదిక పేర్కొంది. ఈ స్థాయి వ్యాపారంతో పోలిస్తే రూ.150 కోట్ల ఆరోపణలు చిన్న మొత్తంగానే కనిపించవచ్చు. కానీ అసలు సమస్య డబ్బు విలువ మాత్రమే కాదు.
ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఏ ఉత్పత్తికి ఎక్కువ విజిబిలిటీ ఇవ్వాలి? ఏ విక్రేతకు ప్రాధాన్యత కల్పించాలి? అన్నది వినియోగదారుల నమ్మకంతో ముడిపడి ఉంటుంది. ఉద్యోగులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలను ప్రభావితం చేస్తే, నష్టపోయేది కేవలం కంపెనీ మాత్రమే కాదు. మంచి ఉత్పత్తులు అమ్మే ఇతర విక్రేతలు, సరైన ధరకు వస్తువు కొనాలనుకునే కస్టమర్లు కూడా నష్టపోతారు.
అంతేకాదు, అమెరికాలో లిస్టయిన వాల్‌మార్ట్‌కు ఆర్థిక నియంత్రణలు, అంతర్గత ఆడిటింగ్ విషయంలో ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అందుకే ఈ ఆరోపణలను సంస్థ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌కు కష్టకాలం.. ఇప్పుడు మరో తలనొప్పి!
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. సంస్థలో కీలకమైన వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సహా గత ఏడాది కాలంలో కనీసం 14 మంది ఉన్నతాధికారులు కంపెనీని వీడినట్లు సమాచారం.
మరోవైపు కంపెనీ ఎప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతుంది? ఐపీఓ ఎప్పుడు వస్తుంది? అనే అనిశ్చితి కొనసాగుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ESOPs) విషయంలోనూ అసంతృప్తి పెరుగుతోంది.
ఇటీవల 1,000 మందికి పైగా మాజీ ఉద్యోగులు వాల్‌మార్ట్ బోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుత ఉద్యోగులతో సమానంగా తమకూ స్టాక్ బైబ్యాక్ అవకాశం కల్పించాలని కోరారు.








