కెనడాలో ‘జైలర్ 2’ షోలు ఎందుకు ఆగిపోయాయి?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న సమయంలో.. కెనడాలో మాత్రం ఈ సినిమా ప్రదర్శనలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.541 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇంతటి విజయాన్ని అందుకుంటున్న సినిమాకు కెనడాలో షోలు ఆగిపోవడానికి కారణం ఏమిటి? థియేటర్ యాజమాన్యం చెబుతున్నది ఒకటైతే.. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన మరోలా ఉంది.
డిజిటల్ కీలు అందలేదని థియేటర్ ప్రకటన
కెనడాకు చెందిన యార్క్ సినిమాస్ అక్టోబర్ 21 నుంచి ‘జైలర్ 2’ ప్రదర్శనలను నిలిపివేసింది. సినిమా ప్రదర్శనకు అవసరమైన డిజిటల్ కీలు (KDMs) అందకపోవడంతో షోలు నిర్వహించలేకపోతున్నామని థియేటర్ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
సినిమా పంపిణీకి సంబంధించిన అన్ని ఆర్థిక బాధ్యతలను తాము పూర్తి చేశామని యార్క్ సినిమాస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఉత్తర అమెరికా డిస్ట్రిబ్యూటర్లైన శ్లోకా ఎంటర్టైన్మెంట్స్, ప్రత్యంగిరా సినిమాస్ నుంచి అవసరమైన డిజిటల్ కీలు అందలేదని ఆరోపించింది. ఈ ప్రక్రియకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి అవసరమైన అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని పేర్కొంది.
డిజిటల్ కీలు అంటే ఏమిటి? సినిమా ఫైల్ థియేటర్‌కు చేరినంత మాత్రాన దాన్ని ప్రదర్శించలేరు. నిర్దిష్ట థియేటర్లో, నిర్ణీత సమయంలో సినిమాను ప్లే చేయడానికి డిజిటల్ ప్రొజెక్షన్ వ్యవస్థకు అవసరమైన అనుమతిని ఈ కీలు అందిస్తాయి. అవి లేకపోతే సినిమా ప్రదర్శన సాంకేతికంగా సాధ్యం కాదు. అందుకే కీలు అందే వరకు షోలు కొనసాగించలేమని యార్క్ సినిమాస్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
అసలు కారణం ఆర్థిక వివాదమా?
అయితే, ఈ వ్యవహారంపై మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. ట్రేడ్ ట్రాకర్ వెంకీ బాక్సాఫీస్ తన ఎక్స్ పోస్టులో, డిస్ట్రిబ్యూటర్లకు, యార్క్ సినిమాస్ స్థానిక థియేటర్ చైన్‌కు మధ్య ఉన్న ఆర్థిక సమస్యలే ప్రదర్శనలు నిలిచిపోవడానికి కారణమని పేర్కొన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది.
దీంతో ఈ వ్యవహారం కేవలం సాంకేతిక సమస్యకే పరిమితమైందా? లేక పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం మధ్య చెల్లింపులు లేదా ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించిన వివాదం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఆర్థిక వివాదమే అసలు కారణమని నిర్ధారించే అధికారిక సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.
రూ.541 కోట్ల వసూళ్ల మధ్య కెనడాలో బ్రేక్!
మరోవైపు ‘జైలర్ 2’ బాక్సాఫీస్ ప్రయాణం మాత్రం బలంగా సాగుతోంది. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా, విడుదలైన ఆరో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.541 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
అదే విదేశీ మార్కెట్ల నుంచి సుమారు రూ.204 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. భారతదేశంలో నెట్ వసూళ్లు రూ.287.80 కోట్లుగా నమోదయ్యాయి. దసరా సెలవులు కూడా సినిమా వసూళ్లకు దోహదపడ్డాయి.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా, మోహన్‌లాల్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో కనిపించారు.
మళ్లీ ఎప్పుడు మొదలవుతాయి?
ప్రస్తుతానికి కెనడాలో యార్క్ సినిమాస్ వద్ద ‘జైలర్ 2’ ప్రదర్శనలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేదు. అవసరమైన డిజిటల్ కీలు అందితే షోలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, దాని కోసం సంబంధిత సంస్థల మధ్య సమస్య పరిష్కారం కావాలి. ఏదైమైనా ఈ సమస్యకు సాంకేతిక కారణాలే ప్రధానమా, లేక దాని వెనుక పంపిణీ వ్యవహారాలకు సంబంధించిన వివాదం ఉందా అన్న విషయం సంబంధిత సంస్థల స్పందనతోనే స్పష్టమవుతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








