నమ్మలేని నిజం: దుబాయ్ కంటే భారత్‌లోనే పెట్రోల్, డీజిల్ చౌక.. !
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సాధారణంగా మనమంతా …గల్ఫ్ దేశాలకు వెళ్తే పెట్రోల్, డీజిల్ నీళ్ల కంటే చౌకగా దొరుకుతాయని, మన దగ్గరే కొనాలంటే జేబులు ఖాళీ అయిపోతాయని అనుకుంటూ ఉంటాం. చమురు బావులు ఉన్న ఆ దేశాల్లో ఇంధనం కంబలిలో నెయ్యిలాగా పారాలే కానీ, మనకంటే ఎక్కువ ధర ఉండటం ఏంటని అందరూ భావించడం సహజమే.
అయితే, మన ఊహులు అన్నింటినీ తలకిందులు చేస్తూ తాజా గణాంకాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే, దుబాయ్‌లోనే ధరలు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా డీజిల్ విషయంలోనైతే లీటర్‌కు దాదాపు 28 రూపాయల వరకు భారీ తేడా కనిపిస్తోంది.
పెట్రోల్ రేట్లలో ఢిల్లీకి దుబాయ్ కంటే భారీ ఊరట
దుబాయ్‌లో అక్టోబర్ నెలలో ఇంధన ధరలను పెంచడంతో ఈ వ్యత్యాసం స్పష్టంగా బయటపడింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.12 కాగా, నోయిడాలో ₹101.96గా ఉంది. అదే సమయంలో దుబాయ్‌లో స్పెషల్ 95 గ్రేడ్ పెట్రోల్ లీటరుకు 4.28 దిర్హామ్‌లుగా నడుస్తోంది. మన భారతీయ కరెన్సీలోకి మార్చి చూస్తే అది దాదాపు ₹110.04 అవుతుంది. అంటే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ దుబాయ్ కంటే ₹7.92 చొప్పున దాదాపు 7.2 శాతం తక్కువకే లభిస్తోందనమాట.
పన్నుల భారం ఎక్కువగా ఉండే ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రం దుబాయ్ కంటే పెట్రోల్ రేటు కాస్త ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా దుబాయ్‌లో అమ్మే పెట్రోల్ ఆక్టేన్ క్వాలిటీకి, మన దగ్గర వాడే పెట్రోల్ గ్రేడ్లకు మధ్య వ్యత్యాసం ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
డీజిల్ రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
పెట్రోల్ కథ పక్కన పెడితే, అసలు సిసలైన తేడా కనిపిస్తోంది మాత్రం డీజిల్ విషయంలోనే. దుబాయ్‌లో లీటర్ డీజిల్ ధర 4.80 దిర్హామ్‌లు కాగా, మన రూపాయిల్లో చెప్పుకోవాలంటే అది అక్షరాలా ₹123.41 అవుతుంది. కానీ మన ఢిల్లీలో డీజిల్ లీటరు ₹95.20, నోయిడాలో ₹95.44 మాత్రమే ఉంది. అంటే దుబాయ్‌తో పోలిస్తే ఢిల్లీవాసులు లీటర్ డీజిల్‌పై ఏకంగా ₹28.21, అంటే దాదాపు 23 శాతం తక్కువ చెల్లిస్తున్నారనమాట.
దుబాయ్‌లో ధరలు ఎందుకు మండుతున్నాయి?
గల్ఫ్ లో హఠాత్తుగా రేట్లు పెరిగిపోవటానికి ప్రధాన కారణం, యూఏఈ ప్రభుత్వం అక్టోబర్ నెల నుంచి రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయమే. గ్యాసోలిన్ అండ్ డీజిల్ ప్రైసెస్ కమిటీ ఆమోదంతో అక్టోబర్ 1 నుంచి అక్కడ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
సెప్టెంబర్‌తో పోలిస్తే స్పెషల్ 95 పెట్రోల్ 3.69 దిర్హామ్‌ల నుంచి 4.28 దిర్హామ్‌లకు, డీజిల్ ధర 4.30 నుంచి 4.80 దిర్హామ్‌లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాపై వస్తున్న ఆందోళనలు, మధ్యప్రాచ్యంలో మళ్లీ రాజుకున్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంతోనే అక్కడ ఇంధన ధరలను పెంచాల్సి వచ్చింది.
మన దగ్గర పెట్రోల్ రేట్లను ఎలా నిర్ణయిస్తారు?
మన దేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలే రోజువారీగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ఖరారు చేస్తుంటాయి. 2017 నుంచి అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ధరలను సమీక్షించే విధానం అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ పన్నులు, డీలర్ కమీషన్ల ఆధారంగా అంతిమంగా లీటర్ రేటు తేలుతుంది. రాష్ట్రానికీ రాష్ట్రానికీ పన్నుల విధానం మారడం వల్లే ఢిల్లీకి, హైదరాబాద్‌కు మధ్య లీటరుపై దాదాపు పది పదిహేను రూపాయల వ్యత్యాసం కనిపిస్తుంది.
మొత్తానికి, చమురు సమృద్ధిగా లభించే దుబాయ్ లాంటి దేశాల్లో కంటే మన దగ్గరే డీజిల్ దాదాపు ₹28, పెట్రోల్ ₹8 వరకు తక్కువకు లభించడం ప్రస్తుతానికైతే మన వాహనదారులకు ఆనందమనే అని చెప్పుకోవాలి.








