గంభీర్ సెలెక్షన్ వ్యూహంపై గవాస్కర్ తీవ్ర విమర్శలు..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) అవలంబిస్తున్న జట్టు ఎంపిక తీరుపై టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలలు ఉండాలనే గంభీర్ ఆలోచనతో బ్యాటింగ్ లైన్అప్ను 8వ స్థానం వరకు పొడిగించడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింటోందని ఆయన విమర్శించారు. భారత్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ టి20 సిరీస్ ముగిసిన అనంతరం గవాస్కర్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌ను అనవసరంగా పొడిగించడం వల్ల బౌలింగ్ విభాగం బలహీనపడుతుందని, గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా చేజార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణం అవుతుందని స్పష్టం చేశారు.
టీమిండియా విజయవంతం కావాలంటే కనీసం నలుగురు పూర్తిస్థాయి రెగ్యులర్ బౌలర్లతో బరిలోకి దిగాలని గవాస్కర్ గంభీర్ మేనేజ్మెంట్కు సూచించారు. ఐదో, ఆరో బౌలర్లుగా ఆల్ రౌండర్లను ఉపయోగించుకోవాలే తప్ప.. బ్యాటింగ్ కోసం బౌలింగ్ నాణ్యతను బలిపెట్టకూడదని చెప్పారు. అలాగే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని వెతికే క్రమంలో మేనేజ్మెంట్ అతిగా ఆలోచిస్తోందని, హార్దిక్ లాంటి ఆటగాడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డారు.
హార్దిక్ అందుబాటులో లేనప్పుడు అక్షర్ పటేల్, లేదా బ్యాటింగ్‌తో పాటు రెండు మూడు ఓవర్లు వేయగల నమన్ ధీర్ లాంటి భిన్నమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే చర్చలో పాల్గొన్న మాజీ టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా భారత స్పిన్ విభాగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టి20 లాంటి పొట్టి ఫార్మాట్లలో స్పిన్నర్లు సులభంగా ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే మేనేజ్మెంట్ వారికి సరైన స్పష్టతనిస్తూ వెన్నుదన్నుగా నిలవాలని సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఎవరిని జట్టులో కొనసాగించాలనే దానిపై స్పష్టమైన ప్రణాళికతో ఉండాలని, ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పించి వారిలో భరోసా నింపడం కోచ్‌గా గంభీర్ బాధ్యత అని పుజారా పేర్కొన్నారు.








