AI సృష్టించిన యువతిని పెళ్లి చేసుకోవాలని.. 2,000 కిలోమీటర్లు వెళ్లి షాకయ్యాడు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రేమలో పడితే మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అవతలి వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. తన దగ్గరున్నదంతా ఇచ్చేయడానికి కూడా వెనకాడడు. కానీ, తీరా వెళ్లాక ప్రేమించిన వ్యక్తి అసలు ఈ ప్రపంచంలోనే లేడని తెలిస్తే? తాను చూసిన ముఖం నిజమైన మనిషిది కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఓ కల్పిత పాత్ర అని తెలిస్తే?
బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల ఎడిమార్ రోచా మార్టిన్స్‌కు ఎదురైన అనుభవం ఇలాంటిదే. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలన్న ఆశతో ఉన్న ఆయనకు, చివరకు కన్నీళ్లు మిగిలాయి.
సోషల్ మీడియాలో చూసి ప్రేమలో పడ్డాడు!
బ్రెజిల్‌లోని మారన్యావో రాష్ట్రానికి చెందిన ఎడిమార్ రోచా మార్టిన్స్ ఇటుకల పని చేసుకుంటూ జీవించేవాడు. ఆయన వయసు 49 ఏళ్లు. విడాకులు తీసుకున్న ఆయనకు జీవితంలో ఓ తోడు కావాలనిపించింది. అలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పరిచయమైంది. జెస్సికా ఒలివెరా, జెస్సికా ఫజెండెయిరా అనే పేర్లతో కనిపించిన ఆ యువతి వీడియోలు ఆయనను బాగా ఆకర్షించాయి.
అందమైన ముఖం, అందంగా మాట్లాడే తీరు.. పైగా తనకు ఓ పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉందని, అక్కడికి వచ్చే వ్యక్తిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఆమె చెప్పేది. తన దగ్గరకు వస్తే ఇక జీవితంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా ఉండదని హామీ ఇచ్చేది. ఓ వీడియోలో అయితే, “నా దగ్గరకు రా.. జీవితాంతం నిన్ను చూసుకుంటాను” అన్నట్టుగా మాట్లాడింది.
ఈ మాటలు మార్టిన్స్ మనసులో ఆశలు రేకెత్తించాయి. ఆ అమ్మాయి నిజంగానే తనకు తోడుగా నిలుస్తుందని, ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించవచ్చని నమ్మాడు. ఆ ఖాతాకు మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటంతో ఆమె నిజమైన వ్యక్తి కాదేమోనన్న అనుమానం కూడా ఆయనకు రాలేదు. అంతేకాదు, ఆమెతో ప్రైవేటుగా మాట్లాడానని, తన ప్రయాణ ఖర్చులకు సహాయం చేస్తానని కూడా చెప్పిందని మార్టిన్స్ వెల్లడించాడు.
ఉన్నవన్నీ అమ్మేసి.. 2,000 కిలోమీటర్ల ప్రయాణం!
ఆ అమ్మాయిని కలుసుకోవాలన్న కోరిక చివరకు ఆయన జీవితాన్నే మార్చేసింది. తన దగ్గరున్న వ్యక్తిగత వస్తువులన్నీ అమ్మేసి ప్రయాణానికి డబ్బు సమకూర్చుకున్నాడు. అక్టోబర్ 9న బ్రెజిల్‌లోని ఇంపెరాట్రిజ్ నుంచి బస్సులో బయలుదేరాడు. గమ్యం బెలో హొరిజోంటే నగరం. దాదాపు 2,000 నుంచి 2,100 కిలోమీటర్ల దూరం.. 36 గంటలకు పైగా ప్రయాణం. అయినా, మనసులో ఉన్న ఆశ ముందు ఈ కష్టాలేవీ పెద్దగా అనిపించలేదు.
అక్టోబర్ 11న ఆ నగరానికి చేరుకున్నాడు. ఇక తనను ప్రేమిస్తున్న అమ్మాయిని కలుసుకోవచ్చని, ఆమెతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టవచ్చని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లాకే అసలు సమస్య మొదలైంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆమె ఇంటి చిరునామా లేదు. తనను కలుసుకోవడానికి ఎక్కడికి రావాలో కూడా స్పష్టత లేదు.
ఇంతదూరం వచ్చేశాడు కాబట్టి ఎలాగైనా ఆమెను వెతికి పట్టుకోవాలనుకున్నాడు. ఆమె ఫొటోలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. కనిపించినవారందరినీ ఆమె గురించి అడిగాడు. కానీ, ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. చివరకు ఓ స్థానిక రేడియో స్టేషన్‌కు వెళ్లి కూడా సహాయం కోరాడు. అక్కడ కూడా ఆమె నిజమైన వ్యక్తి కాదని తెలిసినప్పుడు, ఇన్నాళ్లూ తాను నమ్మిన ప్రేమ వెనుక అసలు మనిషే లేడన్న నిజం ఆయనను కుంగదీసింది.
ప్రేమ కోసం వచ్చిన వ్యక్తికి చివరకు మిగిలింది నిరాశే!
తన దగ్గరున్న డబ్బంతా అయిపోవడంతో మార్టిన్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉండటానికి చోటు లేదు.. తిరిగి వెళ్లడానికి డబ్బు లేదు. ప్రేమను వెతుక్కుంటూ వచ్చిన ఆయనకు ఇప్పుడు స్వస్థలానికి ఎలా చేరుకోవాలన్నదే పెద్ద సమస్యగా మారింది. చివరకు నగరంలోని సామాజిక సేవల విభాగాన్ని ఆశ్రయించాడు.
అధికారులు ఆయనకు ఆహారం, ఆశ్రయానికి సంబంధించిన సహాయం అందించడంతో పాటు, తిరిగి వెళ్లేందుకు బస్సు టికెట్ కూడా సమకూర్చారు. దీంతో బ్రెజిల్‌లోని టోకాంటిన్స్ రాష్ట్రంలో ఉన్న అగస్టినోపోలిస్కు తిరుగు ప్రయాణమయ్యాడు.
తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ మార్టిన్స్ చెప్పిన మాటలు బాధ కలిగిస్తాయి. “నేను నా వస్తువులన్నీ అమ్మేశాను. నా దగ్గర ఉన్నవన్నీ వదులుకున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత చేసిన తర్వాత కూడా తనకు దక్కింది నిరాశేనని, ఈ అనుభవం తనను బాధకు, కుంగుబాటుకు గురిచేసిందని తెలిపాడు.
అయితే, జీవితంలో తోడు కావాలన్న ఆశను మాత్రం పూర్తిగా వదులుకోలేదు. మరోసారి ప్రేమను వెతుక్కునే అవకాశం ఉందని కూడా చెప్పాడు. అంటే, ఒక తప్పుడు అనుభవం ఎదురైనా నిజమైన ప్రేమ దొరుకుతుందన్న ఆశ మాత్రం ఆయనలో ఇంకా మిగిలే ఉంది.
చివరకు బయటపడిన అసలు నిజం.. ఆ అమ్మాయి AI సృష్టే!
మార్టిన్స్ వెతుకుతున్న అమ్మాయి నిజంగా ఉందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఆ తర్వాత బయటపడింది. ఆ సోషల్ మీడియా ఖాతా వెనుక ఉన్న వ్యక్తి ఓ వీడియో విడుదల చేశాడు. అందులో కనిపించే మహిళ నిజమైన వ్యక్తి కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించిన పాత్ర అని స్పష్టం చేశాడు.
ఆ వీడియోలో కనిపించిన AI మహిళ కూడా తాను కృత్రిమ మేధస్సుతో రూపొందించబడిన వ్యక్తినని చెప్పింది. మార్టిన్స్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, అతడిని బెలో హొరిజోంటేకు రమ్మని ఆహ్వానించలేదని ఖాతా నిర్వహించిన వ్యక్తి పేర్కొన్నాడు. ఆ పాత్రను సృష్టించడం వెనుక ఉద్దేశం సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెంచుకుని, ఆ ఖాతాను అమ్ముకోవడమేనని వివరించాడు. ఆ తర్వాత ఆ ఖాతా కూడా తొలగించబడింది.
తెరపై కనిపించేది ప్రేమే కావచ్చు.. కానీ అవతల ఉన్నది మనిషేనా?
ఈ ఘటనలో ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. మార్టిన్స్ మోసపోయింది కేవలం ఓ అందమైన ముఖాన్ని చూసి కాదు. తనకు జీవితంలో తోడు దొరుకుతుందన్న ఆశతో, తనను ఆర్థికంగా చూసుకుంటానన్న మాటలను నమ్మి ఇంతటి సాహసానికి సిద్ధపడ్డాడు. ఒంటరితనం మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ అనుభవం చెబుతోంది.
ఇప్పుడు AI సాయంతో మనుషుల్లా కనిపించే ముఖాలు, సహజంగా మాట్లాడుతున్నట్టుండే వీడియోలు, నమ్మదగినట్టుగా అనిపించే వ్యక్తిత్వాలు సృష్టించడం సాధ్యమవుతోంది. వాటిని చూసినప్పుడు నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్నామనే భావన కలగొచ్చు. వేలాది మంది ఫాలోవర్లు ఉండటం కూడా ఆ ఖాతా నిజమైనదనే నమ్మకాన్ని కలిగించవచ్చు. కానీ ఇవేవీ అవతలి వ్యక్తి నిజమైన మనిషేనని నిరూపించవు.
ఒకప్పుడు ప్రేమలో మోసం జరిగితే కనీసం అవతల ఓ మనిషి అయినా ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మనసులో ఆశలు రేకెత్తించేది ఓ ముఖం.. ప్రేమగా మాట్లాడేది ఓ స్వరం.. కానీ వాటి వెనుక అసలు మనిషే లేకపోవచ్చు. మరి మనం ప్రేమిస్తున్నది ఓ వ్యక్తినా, లేక మనకు కావాల్సిన ప్రేమను నమ్మించేలా సృష్టించిన ఓ డిజిటల్ భ్రమనా?








