న్యూజిలాండ్ టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై షమీ సంచలనం..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్టర్లు ఈ వారం న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించిన భారత టీ20 జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సీనియర్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneswar Kumar) సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, గతంలో భారత్ సాధించిన అనేక అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీని మాత్రం సెలెక్టర్లు పూర్తిగా పక్కనపెట్టేశారు. 2025 మార్చిలో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన షమీ, గాయం నుండి కోలుకుని డొమెస్టిక్ క్రికెట్ లో బెంగాల్ తరఫున తన ఫిట్నెస్ను కూడా చాటుకున్నాడు.
అయినా కూడా తనకు అవకాశం దక్కకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించాడు. జట్టు సెలెక్షన్ అనంతరం ఒక ఇంటర్వ్యూలో భువనేశ్వర్ కుమార్ పునరాగమనం మరియు తనను ఎంపిక చేయకపోవడంపై షమీని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానమిచ్చాడు. “భువనేశ్వర్ కుమార్‌కు భారత జట్టులో మళ్లీ అవకాశం రావడం మంచి విషయమే, అతని ఎంపికను నేను స్వాగతిస్తున్నాను. కానీ అతని ఎంపికతో నాకేం సంబంధం లేదు. నాకు ఎక్కడ అవకాశం వచ్చినా నా వంద శాతం అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాను. ప్రస్తుతం నా దృష్టంతా రేపటి నుండి ప్రారంభం కాబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లపైనే ఉంది” అని స్పష్టం చేశాడు.
సెలెక్టర్ల వ్యవహారశైలిపై షమీ మరింత ముందుకు వెళ్తూ.. “గత రెండు, మూడేళ్లుగా నా విషయంలో ఇదే జరుగుతోంది. నేను నిరంతరం అద్భుతంగా రాణిస్తూనే ఉన్నాను, బెంగాల్ తరఫున నా పూర్తి ఫిట్నెస్ను కూడా రికార్డుల్లో నిరూపించాను. ఒకవేళ వీటన్నింటినీ దాటి నాకు మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం రాకపోయినా, అది నా నష్టమైతే కాదు” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. షమీని వరుసగా పక్కనపెట్టడంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాబోయే ప్రపంచకప్ ముంగిట జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని, కొత్త ప్రయోగాల పేరుతో క్వాలిటీ ఉన్న సీనియర్లను దూరం చేయడం టీమిండియా మేనేజ్మెంట్ చేస్తున్న పెద్ద తప్పు అని ఆయన విమర్శించాడు.








