ఫేస్బుక్లో మైండ్ బ్లాకింగ్ చేంజ్.. యాప్ ఓపెన్ చేస్తే ఇక కనిపించేది అవేనా?
ఫేస్బుక్ అంటే ఫ్రెండ్స్ ఫొటోలు, స్టేటస్ అప్డేట్లు, ఫ్యామిలీ ఫంక్షన్ల ఫొటోలు, ఫన్నీ మీమ్స్. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ తరహా షార్ట్ వీడియోలు. ఇన్నాళ్లూ మనం వీటిని ఎంజాయ్ చేసాయి. అదే సమయంలో ఇవన్నీ మన డిజిటల్ జీవితాన్ని ఆక్రమించాయి. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది.మనం ఏం చూడాలో అనేదాని కన్నా , మనకు ఏం చూపాలో అనేదాని మీద దృష్టి పెట్టింది. ఆ దిశగా పావులు కదిపింది.
ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయగానే కొంతమంది యూజర్లకు నేరుగా ఫుల్‌స్క్రీన్ రీల్స్ కనిపించేలా మార్పులు చేస్తోంది. అంటే ఇన్నాళ్లూ ఫ్రెండ్స్ పోస్టులు, పేజీల అప్డేట్లతో మొదలయ్యే ఫేస్బుక్ ఎక్సపీరియన్స్ .. ఇక వీడియోతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పై నుంచి చూస్తే ఇది చాలా చిన్న డిజైన్ మార్పులా కనిపించొచ్చు. కానీ దీని వెనుక సోషల్ మీడియా వ్యాపారానికి సంబంధించిన పెద్ద లెక్కలున్నాయి. మరి మెటా ఈ ప్రయోగాన్ని ఎందుకు చేస్తోంది? అమెరికా కంటే ముందుగా భారత్‌లో ఎందుకు పరీక్షిస్తోంది? దీని వల్ల ఏం మారవచ్చు?
ఫ్రెండ్స్ పోస్టుల నుంచి ఫుల్‌స్క్రీన్ రీల్స్ వరకు.. ఇదీ కొత్త ట్విస్ట్!
కొత్త ప్రయోగంలో భాగంగా ఎంపికైన కొంతమంది ఫేస్బుక్ యూజర్లు యాప్ తెరవగానే నేరుగా రీల్స్ ఫీడ్‌లోకి వెళ్తారు. వీడియోలు ఫుల్‌స్క్రీన్‌లో కనిపిస్తాయి. పాత తరహా ఫీడ్‌ను పూర్తిగా తొలగించడం లేదు. దాని కోసం ప్రత్యేక ట్యాబ్ ఉంటుంది. ప్రయోగంలో ఉన్న యూజర్లు కావాలంటే మళ్లీ పాత Feed-first అనుభవానికి మారవచ్చు.
కానీ అసలు మార్పు ఎక్కడుందంటే.. యూజర్ యాప్‌లోకి అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే ఏ కంటెంట్ కనిపించాలనే విషయంలో.
ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లోకి వస్తే ముందు ఫ్రెండ్స్ పోస్టులు, గ్రూప్ అప్డేట్లు, పేజీల కంటెంట్ కనిపించేవి. కొత్త ప్రయోగంలో మాత్రం వీడియోలకు మొదటి అవకాశం దక్కుతుంది. యూజర్ ఏదైనా వెతకకముందే కంటెంట్‌ను అతని ముందుకు తీసుకురావడం ఈ అనుభవంలోని కీలకమైన మార్పు.
సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ఫేస్‌బుక్‌లోకి వెళ్లి రీల్స్ వెతకాల్సిన అవసరం లేకుండా, ఫేస్‌బుక్‌నే మిమ్మల్ని నేరుగా రీల్స్‌లోకి తీసుకెళ్లే ప్రయోగం ఇది.
మెటా మాస్టర్ ప్లాన్.. రీల్స్‌ను ఒక ఫీచర్‌గా కాకుండా అలవాటుగా మార్చడమేనా?
మెటా వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా సంస్థలకు యూజర్ల సంఖ్య మాత్రమే కాదు, వారు ఏ కంటెంట్‌ను ఎంతగా చూస్తున్నారు అనేదీ కీలకం. వీడియోలు చూడటం, వాటిని షేర్ చేయటం, వాటిపై స్పందించటం.. ఇవన్నీ ప్లాట్ఫామ్లో జరిగే కార్యకలాపాల్లో భాగం.
ఇన్నాళ్లూ రీల్స్‌ను ప్రత్యేకంగా వెతికి చూసే ఫీచర్‌గా ఉంచారు. ఇప్పుడు వ్యూహం మార్చారు. యాప్ తెరిచిన వెంటనే రీల్స్ కనిపించేలా చేయడం కొత్త వ్యూహం.ఈ విధానంలో వీడియో కంటెంట్ యూజర్ అనుభవంలో మొదటి స్థానానికి వస్తుంది.
ఫేస్ బుక్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?
1. వీడియోలే మొదటి ఆకర్షణ కావాలి
యాప్ ఓపెన్ చేసిన వెంటనే వీడియో కనిపిస్తే, యూజర్‌కు కంటెంట్ చూడటం ప్రారంభించడానికి అదనపు అడుగు అవసరం ఉండదు. వీడియో నుంచి మరో వీడియోకు వెళ్ళిపోతాడు. అయితే ఈ డిజైన్ వల్ల ప్రతి యూజర్ ఎక్కువసేపు ఫేస్ బుక్ లో ఉంటాడని ఇప్పుడే నిర్ధారించలేం. మెటా పరీక్షించాలనుకుంటున్న అంశాల్లో ఈ డిజైన్ ఎలా పనిచేస్తుందన్నది కీలకం.
2. ఫేస్‌బుక్‌ను పాత సోషల్ నెట్‌వర్క్‌గానే వదిలేయకూడదు
ఫేస్‌బుక్‌కు ఇప్పటికే పెద్ద యూజర్ బేస్ ఉంది. కొత్త వీడియో యాప్‌ను మొదటి నుంచి నిర్మించాల్సిన అవసరం లేకుండానే, అదే యూజర్లకు వీడియోలపై ఎక్కువ ప్రాధాన్యం ఉన్న అనుభవాన్ని అందించవచ్చు. ఫేస్‌బుక్‌ను కేవలం పరిచయస్తుల అప్డేట్లు చూసే వేదికగా కాకుండా, వీడియోలు చూస్తూ, క్రియేటర్లను ఫాలో అయ్యే, కొత్త ట్రెండ్స్ తెలుసుకునే ప్లాట్‌ఫామ్‌గా మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ వ్యూహం.
3. వీడియోల చుట్టూ ప్రకటనలు, వ్యాపార అవకాశాలు
రీల్స్‌లో క్రియేటర్లు, బ్రాండ్లు, ఉత్పత్తులు, ట్రెండ్స్ ఒకే ఫీడ్‌లో కనిపించవచ్చు. దీంతో వినోదం నుంచి ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం వరకు ఒకేసారి జరిగే అవకాశం ఉంటుంది. వీడియోల ద్వారా కస్టమర్లను చేరుకోవాలనుకునే వ్యాపారాలకు ఇది ముఖ్యమైన వేదికగా మారవచ్చు.
ఇదే మెటా వ్యూహంలోని అసలు బిజినెస్ కోణం. వీడియోలను ముందుకు తేవడం అంటే కేవలం యూజర్ ఇంటర్ఫేస్ మార్చడం కాదు; కంటెంట్‌ను ప్రజలకు అందించే విధానాన్ని, క్రియేటర్లకు లభించే అవకాశాలను, బ్రాండ్లు ప్రేక్షకులను చేరుకునే మార్గాలను కూడా ప్రభావితం చేయడం.
అమెరికా కాదు.. భారత్‌నే ఎందుకు ఎంచుకుంది?
మెటా ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్లలో పనిచేస్తున్నప్పటికీ, ఈ ప్రయోగం భారత్‌లో ప్రారంభం కావడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది.. యూజర్ల సంఖ్య. మెటా ప్రకటనల సాధనాల్లో కనిపించే అంచనాల ప్రకారం, భారత్‌లో ఫేస్బుక్ ప్రేక్షకుల సంఖ్య 40 కోట్లకు పైగా ఉంది. అంటే కొత్త అనుభవాన్ని పరీక్షించడానికి ఇది చాలా పెద్ద మార్కెట్. అయితే ఈ సంఖ్యను యాక్టివ్ యూజర్ల ఖచ్చితమైన లెక్కగా చూడలేం.
రెండోది.. వీడియోలపై పెరుగుతున్న ఆసక్తి. మెటా 2026 జూన్‌లో విడుదల చేసిన, తన సంస్థ తరఫున నిర్వహించిన పరిశోధనల ప్రకారం, సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో కనీసం 97 శాతం మంది తన ప్లాట్‌ఫామ్‌లలో రోజూ వీడియోలు చూస్తున్నట్లు చెప్పారు. అదే పరిశోధనలో జెన్‌జీకి చెందిన 89 శాతం మంది ప్రతిరోజూ రీల్స్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.
మూడోది.. భారత్‌లో ఇలాంటి ప్రయోగాలకు ఉన్న ప్రాధాన్యం. 2020లో ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక రీల్స్ ట్యాబ్‌ను భారత్‌లో పరీక్షించింది. 2025లోనూ భారత్, దక్షిణ కొరియాలో కొంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్లకు రీల్స్-సెంట్రిక్ ఎక్సపీరియన్స్ ని పరీక్షించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి ప్రయోగం చేపట్టడం, వీడియో వినియోగంపై భారత్‌లో మెటా దృష్టిని సూచిస్తోంది.
అందుకే భారత్‌ను కేవలం మరో మార్కెట్‌గా కాకుండా, వీడియో-ఫస్ట్ ఎక్సపీరియన్స్ గా ఎలా పనిచేస్తుందో పరీక్షించగల కీలక వేదికగా మెటా చూస్తోందని విశ్లేషించవచ్చు.
జెన్‌జీ నే టార్గెట్టా?
ఇప్పటి జెన్‌జీకి సోషల్ మీడియా అంటే కేవలం ఫ్రెండ్స్ అప్డేట్లు కాదు. మీమ్స్, గేమింగ్ క్లిప్స్, సినిమా అప్డేట్లు, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్, క్రికెట్, షార్ట్ వీడియోలు.. ఇలా ఎన్నో విషయాలను ఒకే స్క్రోలింగ్‌లో తెలుసుకోవడం.
రీల్స్‌ను మొదటి స్క్రీన్‌గా తీసుకురావడం ఈ అలవాటుకు సరిపోవచ్చు. కొత్త క్రియేటర్లను కనుగొనడం సులభం కావచ్చు. ట్రెండింగ్ వీడియోలు ముందుగా కనిపించవచ్చు.
ఉదాహరణకు, ఒక ఫ్రెండ్ పెట్టిన ఫొటో చూడటానికి లేదా ఒక గ్రూప్‌లో అప్డేట్ తెలుసుకోవడానికి ఫేస్బుక్ తెరిచినప్పుడు రీల్స్ ముందుగా కనిపిస్తే, మీ అసలు ఉద్దేశానికి చేరుకోవడానికి మరో ట్యాబ్‌ను ఎంచుకోవాల్సి రావచ్చు. లేదా తెలియకుండానే వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసేయచ్చు.
అందుకే ఈ మార్పును పూర్తిగా మంచిదని లేదా చెడ్డదని తేల్చేయలేం. ఇది మీకు నచ్చే వీడియోలను త్వరగా అందించవచ్చు. అదే సమయంలో, మీరు చూడాలనుకున్న ఇతర కంటెంట్‌కు ఇచ్చే ప్రాధాన్యం మారవచ్చు.
ఫేస్‌బుక్‌ను ఇన్స్టాగ్రామ్లా మార్చే ప్రయత్నమా?
ఒకప్పుడు ఫేస్బుక్ అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్టేటస్ అప్డేట్లు. ఇన్స్టాగ్రామ్ అంటే ఫొటోలు, క్రియేటర్లు, ట్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు యాప్‌ల మధ్య ఉన్న తేడాలు కొంతవరకు తగ్గుతున్నాయి. రెండింటిలోనూ రీల్స్, సిఫారసు చేసే వీడియోలు, క్రియేటర్ కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. Gen Z ఇప్పటికే షార్ట్ వీడియోలకు అలవాటుపడిన ప్రేక్షక వర్గం. అలాంటి వారికి ఫేస్‌బుక్‌లోనూ పరిచయమైన వీడియో అనుభవాన్ని అందించడం ద్వారా యువతతో సంబంధాన్ని బలోపేతం చేయాలని మెటా చూస్తోందా? ఇదే పరిశీలించదగిన అసలు ప్రశ్న.
క్రియేటర్లు, చిన్న వ్యాపారాలకు కొత్త ఛాన్స్నా.. కొత్త ఛాలెంజ్నా?
రీల్స్‌కు మరింత ప్రాధాన్యం లభిస్తే, వీడియోలు రూపొందించే క్రియేటర్లకు కొత్త అవకాశాలు రావచ్చు. తమ ఉత్పత్తులు, సేవలు, ఆలోచనలను చిన్న వీడియోల రూపంలో చూపించే వ్యాపారాలకు కూడా ఇది ఉపయోగపడవచ్చు.
కానీ ఫేస్బుక్ పేజీలో సాధారణ పోస్టులు పెట్టే చిన్న వ్యాపారాలు, వార్తా పేజీలు, స్థానిక క్రియేటర్లకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. వారి పోస్టులు వీడియోలతో పోటీపడాల్సి వస్తుందా? రీల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఫీడ్‌లో సాధారణ టెక్స్ట్, ఫొటో పోస్టులు ఎంతమందికి చేరతాయి?
ఇప్పుడే వాటి రీచ్ తగ్గిపోతుందని చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రయోగం వల్ల పోస్టుల ప్రదర్శనలో ఎంత మార్పు వస్తుంది, ఏ కంటెంట్‌కు ఎంత ప్రాధాన్యం లభిస్తుంది అనే ఫలితాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అయితే క్రియేటర్లు, వ్యాపారాలు గమనించాల్సిన విషయం మాత్రం స్పష్టమే: ఫేస్బుక్లో వీడియో కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే తమ ప్రేక్షకులకు ఏ ఫార్మాట్ బాగా పనిచేస్తుందో పరీక్షించడం, సాధారణ పోస్టులతో పాటు అవసరమైనప్పుడు ఉపయోగకరమైన వీడియోలను కూడా రూపొందించడం మంచి వ్యూహం కావచ్చు.
ఫేస్బుక్ భవిష్యత్తు ఇదేనా?
ఇదంతా చూస్తూంటే.. మెటా దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఫేస్బుక్లో వీడియోలను ఒక ప్రత్యేక విభాగంలో ఉంచడం నుంచి, యాప్‌లోకి వచ్చిన వెంటనే వీడియోలను చూపించే అనుభవం వైపు అడుగులు వేస్తోంది.వీడియోలకే ప్రయారిటీ ఇస్తోంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








