షార్లెట్‌లో అట్టహాసంగా నాట్స్ తెలుగు సంబరాలు.. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, సైన్స్ ఫెస్ట్
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో తెలుగు సంబరాలు కన్నులపండువగా జరిగాయి. స్థానిక ప్రవాస తెలుగు వారిని ఒకే వేదికపైకి చేరుస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో తానా, జీటీఈ, ఏపీటీఈ వంటి ప్రముఖ తెలుగు సంఘాల ప్రతినిధులు సైతం భాగస్వాములయ్యారు. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు…
ఈ సంబరాల్లో చిన్నారులతో పాటు పెద్దలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. శాస్త్రీయ సంగీతాలాపనలు, సంప్రదాయ క్లాసికల్ నృత్యాలు, హుషారైన ఫ్రీస్టైల్ డ్యాన్సులు సభికులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో నిర్వహించిన డ్రై ఐస్ ప్రయోగాలు, ప్లాస్మా బాల్ ప్రదర్శనల్లో పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొని విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందారు.
ముందుండి నడిపించి…
ఈ వేడుకల విజయవంతం వెనుక నాట్స్ షార్లెట్ చాప్టర్ నాయకులు, వాలంటీర్లు విశేషంగా శ్రమించారు. అడ్వైజరీ మెంబర్ మూర్తి గులివిందల, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట దగ్గుపాటి, నాట్స్ పూర్వ చైర్మన్ మధు కొర్రపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పొనకాల, ఇండియా లైజన్ అరుణ్ శ్రీరామినేని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అలాగే చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపరాజు, జాయింట్ కోఆర్డినేటర్ పల్లవి అప్పని, ఈవెంట్స్ విభాగం నుంచి వినీల దొప్పలపూడి, మహిళా సాధికారత విభాగం నుంచి ప్రవీణ పాకలపాటి, కోశాధికారి లక్ష్మి బిజ్జల, క్రీడా విభాగం నుంచి సిద్ధార్థ చాగంటి, సోషల్ మీడియా బాధ్యతలు చూసిన సుమ జుజ్జూరు, కోచైర్ రూప మర్రి తదితరులు సమష్టిగా కృషి చేసి ఈ సంబరాలను విజయవంతం చేశారు.








