మైక్రోసాఫ్ట్ నే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేసారు? అసలు కథేంటి? !
అమెరికాలో ఉన్నత విద్య చదివి, మంచి ఉద్యోగం సంపాదించి, అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కనే ప్రతి విదేశీ నిపుణుడికి “గ్రీన్ కార్డ్” ఒక పెద్ద మైలురాయి అన్న సంగతి తెలిసిందే. అయితే, అమెరికా ప్రభుత్వం అకస్మాత్తుగా PERM ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం టెక్ ప్రపంచంలో పెద్ద భూకంపమే సృష్టిస్తోంది. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారతీయ ఐటీ కంపెనీల మార్గానికి ఇది ఊహించని ఆటంకంగా మారింది. అమెరికన్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం వెనుక అనేక ఆసక్తికరమైన రాజకీయ, ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయనేది నిజం. అవేమిటి…?
వేతనాల తగ్గింపు ఆరోపణలు.. అసలు లెక్కలు వేరే ఉన్నాయా?
విదేశీ ఉద్యోగులను తక్కువ జీతాలకు నియమించుకుంటూ, అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారనేది ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దీనికి బలం చేకూర్చేలా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొన్ని లెక్కలను,అంకెలను ముందుకు తెచ్చారు. మైక్రోసాఫ్ట్ గత ఏడాది సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తీసేసి, అదే సమయంలో వేలాది H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లు పొందిందని ఆయన విమర్శించారు.
అయితే, ఏ విభాగాల్లో ఉద్యోగాలు పోయాయి, ఏ నైపుణ్యాల కోసం విదేశీ ఉద్యోగులను తీసుకున్నారనే వివరణలు లేకపోవడం వల్ల, ఈ లెక్కలను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఓటర్లలో అసంతృప్తిని తగ్గించడానికి ఇది ఒక మంచి అస్త్రంగా ఉపయోగపడుతోందనేది ఓ వర్గం వాదన.
కంపెనీల స్వేచ్ఛకు చెక్.. గ్రీన్ కార్డే అసలు ఆయుధమా?
ఒక విదేశీ నిపుణుడు H-1B వీసాపై అమెరికా వచ్చాక, ఆ ఉద్యోగిని తమ దగ్గరే సుదీర్ఘకాలం ఉంచుకోవడానికి కంపెనీలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ఒక బలమైన సాధనం. ఇప్పుడు PERM ప్రక్రియను నిలిపివేయడం ద్వారా కంపెనీలు విదేశీ మానవ వనరులపై ఎంతకాలం, ఎలా ఆధారపడాలో ప్రభుత్వం నేరుగా నియంత్రించే అవకాశం లభిస్తుంది.
ఉద్యోగులు కంపెనీల విధానాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం అంటున్నప్పటికీ, ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో పడిపోయిందనేది పచ్చి నిజం.
ఇవి కూడా చదవండి
భారతీయ ఐటీ సంస్థలే ఎందుకు టార్గెట్ అయ్యాయి?
ఈ ఆంక్షల జాబితాలో భారతీయ ఐటీ కంపెనీలు ప్రముఖంగా కనిపిస్తుండటం యాదృచ్ఛికమేమీ కాదు. తక్కువ వ్యయంతో గ్లోబల్ ప్రాజెక్టులను పూర్తి చేసే ఈ సంస్థల వ్యాపార నమూనా అమెరికన్ల జీతాలపై ప్రభావం చూపుతోందనేది వైట్ హౌస్ అభిప్రాయం.
ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్టును అమెరికన్ ఉద్యోగులతో పూర్తి చేయడానికి అయ్యే ఖర్చుకు, ఔట్సోర్సింగ్ మోడల్లో చేసే ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఈ వివాదానికి మూలం.
అయితే కొన్ని సంస్థలపై ఉన్న ఆరోపణలను సాకుగా చూపి మొత్తం భారతీయ ఐటీ రంగాన్నే సందేహించడం సరైంది కాకపోయినా, రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు తమ నియామక వ్యూహాలను, ప్రాజెక్ట్ కేటాయింపులను పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎన్నికల రాజకీయం.. టెక్ దిగ్గజాలకు హెచ్చరిక!
రాబోయే మధ్యంతర ఎన్నికలకు కొద్ది వారాల ముందే ఈ నిర్ణయం రావడం గమనార్హం. “మేము అమెరికన్ కార్మికుల వైపే ఉన్నాం” అని ఓటర్లకు గట్టిగా చెప్పడానికి మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పేరున్న కంపెనీని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయంగా చాలా ఉపయోగపడుతుంది.
దీనితో పాటు, దేశంలో ఎంతటి పెద్ద కంపెనీ అయినా సరే ప్రభుత్వ కార్మిక విధానాలకు కట్టుబడి ఉండాల్సిందేననే స్పష్టమైన హెచ్చరికను కూడా ట్రంప్ ప్రభుత్వం పంపింది.
విచిత్రమేమిటంటే, ఒకవైపు మైక్రోసాఫ్ట్ నియామక విధానాలపై వైట్ హౌస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగానే, మరోవైపు అదే కంపెనీ సీఈఓ సత్య నాదెళ్లకు ట్రంప్ ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ పురస్కారాన్ని అందించారు. ఇది టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, విదేశీ ఉద్యోగుల చేరికను అడ్డుకోవాలనుకునే ప్రభుత్వ విరుద్ధ విధానాలకు అద్దం పడుతోంది.
ముగింపు
అమెరికన్ ఉద్యోగాలను రక్షించడం అధికారిక కారణమైనప్పటికీ, కంపెనీల నియామకాలపై పట్టు సాధించడం, ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాలు పొందడం ఈ నిర్ణయం వెనుక స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కేంద్రంగా నిలవాలంటే గ్లోబల్ టాలెంట్ అవసరం; అదే సమయంలో స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలూ ముఖ్యమే. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








