నిజమైన ఫొటోనా? AI ఫొటోనా? ఈ చిన్న టెక్నిక్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీకు Instagramలో ఓ ఫొటో కనిపించింది. చూస్తే అసలు రియల్లానే ఉంది. పక్కనే ఉన్న ఫ్రెండ్‌ను అడిగితే.. “ఇది AIతో చేసిందిరా!” అన్నాడు. ఏది నిజమో..అబద్దమూ అర్దం కాలేదు. అలాగే మరో వీడియో చూస్తే నిజంగా ఆ సెలబ్రిటీ నిజంగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ అది కూడా AI కావచ్చు. ఇప్పుడు మనం చూసే ప్రతి ఫొటో, ప్రతి వీడియో, ప్రతి వాయిస్‌ను వెంటనే నమ్మే రోజులు పోయాయి. “ఇది నిజంగా జరిగిందా? లేక AI తో మనల్ని మోసం చేస్తున్నారా?” అనే డౌట్ కామన్ అయిపోయింది.
ఇలాంటి టైమ్‌లో Google ఓ ఇంట్రస్టింగ్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేరు SynthID Detector. ఇంతకుముందు ఇది జర్నలిస్టులు, రీసెర్చర్లు, మీడియా ప్రొఫెషనల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఫొటో అయినా, వీడియో అయినా, ఆడియో అయినా అప్లోడ్ చేసి.. అందులో Google, OpenAI వంటి కంపెనీల AI వాటర్‌మార్క్ ఉందా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అసలు ఈ SynthID అంటే ఏంటి?
పేరు కొంచెం టెక్నికల్‌గా అనిపించినా.. కాన్సెప్ట్ చాలా సింపుల్. AIతో ఒక ఫొటో లేదా వీడియో తయారైనప్పుడు దానిలో మన కంటికి కనిపించని ఓ చిన్న గుర్తును దాచిపెడతారు. అదే SynthID. మనం ఫొటో చూస్తున్నప్పుడు ఆ గుర్తు కనిపించదు. కానీ ప్రత్యేకంగా దాన్ని వెతికే టెక్నాలజీకి మాత్రం అది కనిపిస్తుంది.
ఫొటోలో ఈ గుర్తు పిక్సెల్స్‌లో ఉంటుంది. వీడియోలో కూడా విజువల్స్లోనే ఉంటుంది. ఆడియో అయితే సౌండ్ వేవ్‌లో దాన్ని దాచిపెడతారు. అంటే ఫైల్‌కు బయట కనిపించే చిన్న వివరాలను మార్చేసినా.. అసలు AI గుర్తు లోపలే ఉండేలా చేయడమే ఐడియా. ఇప్పుడు Google ఆ టెక్నాలజీని సాధారణ యూజర్ల చేతుల్లోకి కూడా ఇస్తోంది.
మరి మనం ఏం చేయాలి?
చాలా ఈజీ. మీకు అనుమానం వచ్చిన ఫొటో, వీడియో లేదా ఆడియో ఫైల్‌ను SynthID Detectorలో అప్లోడ్ చేస్తే చాలు. అంటే synthid.comలోకి వెళ్లి ఫొటో, వీడియో లేదా ఆడియో ఫైల్‌ను అప్లోడ్ చేస్తే, ఆ కంటెంట్‌లో SynthID వాటర్‌మార్క్ కనిపిస్తే టూల్ దాన్ని గుర్తిస్తుంది.ప్రస్తుతం ఈ సేవ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది.
అంటే Instagramలో ఏదైనా ఫొటో చూసి.. “అబ్బా, ఇది నిజమేనా?” అనిపించింది అనుకోండి. వెంటనే టూల్లో చెక్ చేయొచ్చు. ఏదైనా సెలబ్రిటీ వాయిస్ చాలా రియల్‌గా అనిపించినా, లేక WhatsAppలో ఎవరో పంపిన వీడియో చూసి కన్ఫ్యూజ్ అయినా ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చు.
అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
“Not Detected” అంటే అది నిజమే అని కాదు! ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. SynthID Detectorలో వాటర్‌మార్క్ కనిపించలేదంటే.. “అయితే ఈ ఫొటో 100 శాతం ఒరిజినల్” అని ఫిక్స్ అయిపోవద్దు.
ఎందుకంటే SynthID అనేది ప్రపంచంలోని ప్రతి AI మోడల్లో ఉండదు. SynthID ఉపయోగించని మరో AI టూల్‌తో తయారైన ఫొటో అయితే ఈ Detectorకు దొరకకపోవచ్చు. అలాగే AI ఫొటోను చాలా ఎక్కువగా ఎడిట్ చేస్తే వాటర్‌మార్క్ బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది.
అంటే ఈ టూల్ మీకు ఒక క్లూ ఇస్తుంది. కానీ అది “ఇదే ఫైనల్ సత్యం” అని చెప్పే డిటెక్టర్ కాదు.
ChatGPT ఫొటోలను కూడా గుర్తించగలదా?
ఇదే ఇప్పుడు ఎక్కువమందికి ఆసక్తి కలిగించే విషయం. Google చెబుతున్న దాని ప్రకారం SynthID Detector ఇప్పుడు Google AI మాత్రమే కాకుండా OpenAI, NVIDIA, Kakao వంటి కంపెనీల SynthID వాటర్‌మార్క్‌లను కూడా గుర్తించగలదు. Appleకు కూడా త్వరలో సపోర్ట్ తీసుకొస్తామని Google చెబుతోంది.
అంటే AI కంపెనీలు తయారు చేస్తున్న కంటెంట్‌కు ఒక కనిపించని “డిజిటల్ సంతకం” లాంటిది ఉండాలనే ఆలోచన నెమ్మదిగా పెద్దదవుతోంది.
రేపు ఎవరో ఓ ఫొటో పంపి “ఇది నిజంగా జరిగింది” అంటే.. మనం వెంటనే నమ్మకుండా, “ఒక్క నిమిషం.. చెక్ చేద్దాం” అనే స్థాయికి టెక్నాలజీ వెళ్తోంది.
కానీ AI ఫొటోను పూర్తిగా పట్టేస్తుందా?
లేదు. Google కూడా SynthIDను “General AI Detector” కాదని స్పష్టంగా చెబుతోంది. అంటే ప్రపంచంలో ఏ AIతో తయారైన కంటెంట్‌నైనా ఇది గుర్తించదు. SynthID వ్యవస్థను ఉపయోగించే కంపెనీల కంటెంట్‌ను గుర్తించడం దీని ప్రధాన పని.
మరో విషయం ఏంటంటే.. ఒక ఫొటో పూర్తిగా AIతో తయారైందా, లేక నిజమైన ఫొటో తీసుకుని AIతో కేవలం ముఖం మార్చారా, బ్యాక్‌గ్రౌండ్ మార్చారా, కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే జోడించారా అనే విషయాన్ని కూడా ఇది పూర్తిగా చెప్పలేదు.
అంటే ఇది “AI చేసిందా లేదా?” అనే ప్రశ్నకు మ్యాజిక్ ఆన్సర్ కాదు. దాని కంటే.. “ఈ కంటెంట్‌లో AI వాటర్మార్క్కు సంబంధించిన ఆధారం ఉందా?” అని చెక్ చేసే టూల్.
అసలు ఈ టెక్నాలజీ ఎందుకు అవసరం వచ్చింది?
ఎందుకంటే AI ఇప్పుడు కేవలం ఫొటోలు అందంగా మార్చే స్థాయిలో లేదు. మనం నమ్మేంత రియల్‌గా కనిపించే ఫొటోలు, వీడియోలు, వాయిస్‌లు తయారు చేయగల స్థాయికి వచ్చింది.
ఒక వ్యక్తి అసలు మాట్లాడని మాటలను అతని గొంతుతోనే చెప్పించొచ్చు. ఎప్పుడూ జరగని సంఘటనను నిజంగా జరిగినట్టుగా చూపించొచ్చు. సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయితే అది నిజమా కాదా తెలుసుకునేలోపే వేల మందికి వెళ్లిపోవచ్చు.
ఇక్కడే SynthID లాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. AI తయారు చేసిన కంటెంట్‌కు ఒక కనిపించని గుర్తు ఉంటే.. భవిష్యత్తులో దాన్ని గుర్తించడం కొంత సులభం అవుతుంది.
AIతో పాటు “నిజమా?” అనే ప్రశ్న కూడా పెరుగుతోంది
Google చెబుతున్న ప్రకారం SynthID ఇప్పటికే 180 బిలియన్లకు పైగా ఫొటోలు, వీడియోలకు వాటర్‌మార్క్ వేసింది. ఆడియో విషయంలో కూడా భారీ స్థాయిలో కంటెంట్‌ను వాటర్‌మార్క్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.
అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. అన్ని AI కంపెనీలు ఒకే టెక్నాలజీని ఉపయోగించడం లేదు. Meta తనకంటూ వేరే విధానాన్ని ఉపయోగిస్తోంది. అందుకే భవిష్యత్తులో AI కంటెంట్‌ను గుర్తించాలంటే కంపెనీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం మరింత పెరగొచ్చు.
ఎందుకంటే AI తయారు చేసే ప్రపంచం ఎంత వేగంగా పెరుగుతుందో.. AI ఏది తయారు చేసిందో గుర్తించే ప్రపంచం కూడా అంతే వేగంగా పెరగాల్సి ఉంటుంది.
ఫైనల్ గా..
ఒకప్పుడు “ఫొటోలో కనిపిస్తే నిజమే” అనుకునేవాళ్లం. ఇప్పుడు ఆ ఫొటోను చూసి “ఇది నిజంగా తీసిందా? లేక AI తయారు చేసిందా?” అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో “వైరల్” కంటెంట్ చూడగానే మనం చెయ్యాల్సిన పని ఒక్కటే కావచ్చు:
“ఒక్క నిమిషం.. ఇది నిజమేనా? చెక్ చేద్దాం”








