ధనుష్ కొత్త రాజకీయ పార్టీ? పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం?!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
తమిళనాడును సినిమా వాళ్లు ఏలడం కొత్తేమీ కాదు. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు.. కరుణానిధి నుంచి విజయకాంత్ వరకు.. కమల్ హాసన్ నుంచి విజయ్ వరకు వెండితెరపై అభిమానులను సంపాదించుకున్న పలువురు నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.కుంటున్నారు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.. మరికొందరు పార్టీలు పెట్టారు.. ఇంకొందరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు 2026లో విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరుకున్న తర్వాత తమిళ సినీ పరిశ్రమలో మరోసారి అదే ఉత్సాహం కనిపిస్తోంది.కొత్త ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చే నెక్ట్స్ స్టార్ ఎవరు?
ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ధనుష్. తమిళ హీరో ధనుష్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన పార్టీకి ‘తమిళగ ఎళుచి కళగం’ అనే పేరు ఖరారైందని, ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేశారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ధనుష్ ప్రతినిధులు ఖండిస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ.. పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలు, ఇతర వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఎంజీఆర్ చూపించిన దారిలో.. జయలలిత, విజయకాంత్, విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సినిమా ప్రభావానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంజీఆర్ సినిమాల్లో స్టార్‌గా ఎదిగి, అభిమానుల బలాన్ని రాజకీయ శక్తిగా మార్చుకున్నారు. 1972లో AIADMKను ఏర్పాటు చేసి, 1977లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత ఆయనతో కలిసి సినిమాల్లో నటించిన జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
సినీ రచయితగా, డీఎంకే సిద్ధాంతాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎం. కరుణానిధి కూడా తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచారు. తమిళనాడులో సినిమా, రాజకీయాల మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఈ చరిత్రే చెబుతుంది.
ఆ తర్వాత విజయకాంత్ కూడా అదే దారిలో అడుగుపెట్టారు. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రయాణం తర్వాత 2005లో దేసీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (DMDK) ను స్థాపించారు. 2011లో ఆయన పార్టీ 29 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని, విజయకాంత్ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అంటే సినిమా స్టార్‌డమ్‌ను రాజకీయ వ్యవస్థగా మార్చిన మరో ముఖ్యమైన వ్యక్తి విజయకాంత్.
కమల్ హాసన్ వచ్చారు.. రజనీకాంత్ మాత్రం వెనక్కి తగ్గారు
తర్వాతి తరం స్టార్లలో కమల్ హాసన్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీని ప్రారంభించారు. 2019 లోక్‌సభ, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది.
అదే సమయంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల పాటు అతిపెద్ద చర్చగా నిలిచింది. 2017లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీ.. 2020లో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కానీ 2020 డిసెంబర్లో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన రాజకీయ ప్రవేశ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ అధ్యాయం ప్రారంభం కాకుండానే ముగిసిపోయింది.
ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమా నుంచి రాజకీయాల్లోకే..
ఇక ఉదయనిధి స్టాలిన్ విషయంలో మాత్రం ప్రయాణం మరోలా సాగింది. నిర్మాతగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2021లో ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత తన రాజకీయ బాధ్యతలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2023లో నటనకు వీడ్కోలు పలికారు.
అంటే తమిళనాడులో సినిమా, రాజకీయాల మధ్య సంబంధం కేవలం హీరోలకే పరిమితం కాలేదు. సినీ రచయితలు, నటులు, నిర్మాతలు, స్టార్ హీరోలు.. ఇలా వివిధ స్థాయిల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి.
ఇంకా చాలామంది ఉన్నారు..
తమిళ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి జాబితా ఇంతటితో ఆగిపోదు. శివాజీ గణేశన్ స్వయంగా పార్టీ పెట్టారు. ఆర్. శరత్‌కుమార్ రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తర్వాత బీజేపీలో విలీనం అయింది. నెపోలియన్ డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఖుష్బూ సుందర్, రాధికా శరత్‌కుమార్, కరుణాస్, గౌతమి వంటి సినీ ప్రముఖులు కూడా వివిధ దశల్లో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు.
దర్శకుడు సీమాన్ కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో ముఖ్యమైన పేరు. 2009లో ఆయన నామ్ తమిళర్ కచ్చి (NTK) ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను కొనసాగిస్తున్నారు.
అలాగని ప్రతి సినీ స్టార్‌కు రాజకీయాల్లో ఒకే రకమైన రిజల్ట్ రాలేదు. సినిమాలో ఉన్న స్టార్డమ్ వేరు..దాన్ని ఓట్లుగా మార్చడం వేరు.. ఒక రాజకీయ సంస్థను నిర్మించడం వేరు అనే విషయం తమిళనాడు రాజకీయ చరిత్రలోనే కనిపిస్తుంది. శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి ఉదాహరణలు దీనికి భిన్నమైన అధ్యాయాలను చూపిస్తాయి.
ఇప్పుడు విజయ్ తర్వాత ధనుష్?
ఇక ప్రస్తుతానికి వస్తే.. విజయ్ రాజకీయ ప్రవేశం ఈ చర్చకు మరో కొత్త మలుపు ఇచ్చింది. సినిమాల్లో స్టార్‌గా ఉన్న విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, 2026లో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడంతో, ఇతర హీరోల రాజకీయ అవకాశాలపై కూడా ఆసక్తి పెరిగింది.
అలాంటి సమయంలో ధనుష్ అభిమాన సంఘాల కార్యకలాపాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశాలు రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అభిమానుల ఐక్యతను ప్రజా సేవకు ఉపయోగించాలని ఆయన మాట్లాడటం కూడా రాజకీయ ఊహాగానాలకు కారణమైంది.
ఏదైమైనా…
ధనుష్ రాజకీయ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తే.. అది కేవలం మరో హీరో రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాదు. తమిళనాడులో ‘సినిమా నుంచి సీఎం’ అనే రాజకీయ కథలో మరో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉంటుంది.








