ట్రంప్ నగ్న విగ్రహం.. పార్లమెంట్లో రచ్చ రచ్చ! ఇంతకీ ఎక్కడో తెలుసా?
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ పట్టణంలో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ ప్రాంగణం ఇప్పుడు ఒక విచిత్రమైన విగ్రహంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నగ్నంగా చిత్రీకరిస్తూ రూపొందించిన ఓ వ్యంగ్య విగ్రహాన్ని అక్కడ ప్రదర్శనకు ఉంచడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు జెన్స్ గాల్సియోట్ 2.5 మీటర్ల ఎత్తుతో ఈ విగ్రహాన్ని చెక్కగా, దీనికి “ఆరెంజ్ ప్లేగ్” (Orange Plague) అని పేరు పెట్టారు. కళాకారుడు చెప్పినదాని ప్రకారం.. ఈ విగ్రహానికి ఏకంగా 23 క్యారెట్ల బంగారు పూత కూడా పూశారు. అంతటితో ఆగకుండా దీనికి “అన్యాయానికి రాజు” (King of Injustice) అని మరో పేరు కూడా పెట్టడం విశేషం.
విగ్రహం రూపకల్పన వెనుక ఉన్న అసలు ఉద్దేశం
ఈ విగ్రహాన్ని గమనిస్తే ట్రంప్ నగ్నంగా, చేతిలో ఒక పొడవైన బంగారు దండం పట్టుకుని ఉంటారు. ఆయన తనకంటే చాలా చిన్నగా ఉన్న ఒక సామాన్య వ్యక్తి భుజాలపై కూర్చున్నట్లుగా, ఆ ట్రంప్ బరువు తాళలేక ఆ చిన్న వ్యక్తి కిందకు కూలిపోతున్నట్లుగా దీనిని తీర్చిదిద్దారు. విగ్రహం పక్కనే ఒక విచిత్రమైన బోర్డును కూడా ఏర్పాటు చేశారు.
అందులో, “ఈ అన్యాయపు రాజు ఒక సామాన్యుడి వీపుపై హాయిగా కూర్చున్నాడు.. ఆ భారంతో ఆ వ్యక్తి మునిగిపోతున్నాడు. అతనికి సహాయం చేయడానికి నేను ఏదైనా చేస్తాను కానీ, ఆయన వీపు మీద నుంచి మాత్రం కిందకు దిగను” అని రాసి ఉన్న వ్యంగ్య వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంటోంది.
కళాకారుడి పదునైన విమర్శలు
వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు ట్రంప్ పెద్ద అడ్డంకిగా మారారని, ఆ నిరసనను వ్యక్తం చేయడానికే ఈ విగ్రహాన్ని రూపొందించానని కళాకారుడు తెలిపారు.
నిజానికి ఈ విగ్రహం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు; గతంలోనే పలు యూరోపియన్ నగరాలతో పాటు బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (COP30)లో కూడా దీనిని ప్రదర్శించారు. ఇప్పుడు వామపక్ష డానిష్ ఎంఈపీ పెర్ క్లాసెన్ ఆహ్వానం మేరకు దీనిని యూరోపియన్ పార్లమెంట్‌కు తీసుకువచ్చారు.
రాజకీయ ప్రకంపనలు – ప్రతిస్పందనలు
యూరోపియన్ పార్లమెంట్‌లోని రెండు ప్రధాన భవనాలను కలిపే రాకపోకల మార్గంలో ఈ విగ్రహాన్ని ఉంచారు. ఇది గురువారం వరకు ప్రదర్శనలోనే ఉండనుంది. అయితే ఈ వివాదాస్పద విగ్రహంపై ట్రంప్ వర్గం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
కాగా, ఈ ప్రదర్శనపై ట్రంప్ ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారేమోనన్న భయం ఉందా అని ఎంఈపీ పెర్ క్లాసెన్‌ను ప్రశ్నించగా, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. “చిన్నపాటి విమర్శనాత్మక విగ్రహాన్ని కూడా తట్టుకోలేని మనస్తత్వం ఉన్న వ్యక్తికి ప్రపంచ రాజకీయ వేదికపై అసలు స్థానమే లేదు” అని తేల్చి చెప్పారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








