నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మోనా సిన్హాకు అరుదైన గౌరవం
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికగా పేరుగాంచిన నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రముఖ భారతీయ-అమెరికన్ సామాజిక కార్యకర్త , ఫిలాంత్రపిస్ట్ శర్మిళా మోనా సిన్హా చోటు దక్కించుకున్నారు. అమెరికాలో మహిళల హక్కుల ఉద్యమానికి పుట్టినిల్లుగా పరిగణించే న్యూయార్క్‌లోని సెనేకా ఫాల్స్‌లో ఈ చారిత్రక హాల్ ఆఫ్ ఫేమ్ ఉంది. ఇక్కడ స్థానం సంపాదించుకున్న రెండో భారతీయ సంతతి మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయికి మాత్రమే ఈ అరుదైన గుర్తింపు దక్కడం విశేషం.
ప్రస్థానం..
కోల్‌కతాలో జన్మించి అక్కడే పెరిగిన మోనా సిన్హా, మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత స్మిత్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్, ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టాను అందుకున్నారు. చదువు పూర్తయిన వెంటనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ద్వారా వాల్‌స్ట్రీట్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనతికాలంలోనే ప్రొక్టర్ అండ్ గాంబిల్, యూనిలీవర్, ఎలిజెబెత్ ఆర్డెన్ వంటి పలు అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించి సత్తా చాటారు.
ఇవి కూడా చదవండి
సామాజిక సేవ..
కార్పొరేట్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ఆమె, ఆ తర్వాత పూర్తిగా మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగే సామాజిక కార్యక్రమాల వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం ‘ఈక్వాలిటీ నౌ’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థకు సీఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించేలా పోరాడుతున్నారు. ‘ఉమెన్ మూవింగ్ మిలియన్స్’ అనే గ్లోబల్ వేదిక ద్వారా మహిళలు , బాలికల అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు సుమారు రూ.8,300 కోట్ల భారీ నిధులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. ‘రైజింగ్ చేంజ్’ అనే సంస్థకు కో-ఫౌండర్‌గా సేవలందిస్తూ, లాభాపేక్ష లేని సామాజిక సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తోడ్పడుతున్నారు.
అదనపు బాధ్యతలు ..
“అధికారం అనేది ఇతరులతో పంచుకున్నప్పుడే మరింత పెరుగుతుంది” అనే నమ్మకంతో ముందుకు సాగే మోనా సిన్హా, పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. వాషింగ్టన్ మాల్లో రానున్న ‘స్మిత్సోనియన్ అమెరికన్ ఉమెన్స్ హిస్టరీ మ్యూజియం’ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్‌గా సేవలందిస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన టేమర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎంటర్ప్రైజ్ అడ్వైజరీ బోర్డులోనూ, టేమర్ వెంచర్ ఫండ్ బోర్డులోనూ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.








