UAEకి వెళ్తున్నారా..! బ్యాగులో ఇవి ఉంటే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేస్తారు
భారత్ నుంచి దుబాయ్ లేదా UAEలోని ఇతర నగరాలకు ప్రయాణ ప్లాన్ చేసుకుంటున్నారా? టికెట్, పాస్‌పోర్ట్, వీసాలు సరిగ్గా సరిచూసుకుంటే సరిపోతుందని అనుకుంటే పొరపాటే! విమానంలో మీతో పాటు వచ్చే లగేజీ బ్యాగ్‌లో ఏం పెడుతున్నారనేది కూడా అత్యంత ముఖ్యం.
ముఖ్యంగా మన భారతీయులు ఇంటి నుంచి ఎంతో ఇష్టంగా తీసుకెళ్లే పిండి వంటలు, ఊరగాయలు, మసాలాలు, నెయ్యి, రోజూ వాడే మందులపై యూఏఈ (UAE) భద్రతా విభాగాలు అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
వేసవి సెలవుల తర్వాత ఉద్యోగాల కోసం తిరిగి వెళ్లేవారైనా, సరదాగా టూర్ కోసం వెళ్లేవారైనా మీ బ్యాగ్ సర్దేటప్పుడు ఏ వస్తువులు క్యాబిన్ బ్యాగ్‌లో ఉండాలి, ఏవి చెక్-ఇన్ బ్యాగేజీలో పెట్టాలి, అసలు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడని వస్తువులు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం.
వంటగది పదార్థాలు… ఏవి ఓకే? ఏవి నాట్ ఓకే?
మన వాళ్లు విమానమెక్కేటప్పుడు ఇంటి వంటకాల ప్రాధాన్యం వేరుగా ఉంటుంది. కానీ, ఆహార పదార్థాల విషయంలో యూఏఈ విమానయాన సంస్థలు స్పష్టమైన నిబంధనలు పెట్టాయి.
– ఎండు కొబ్బరి (Copra) – నిషేధం
– ఎండు కొబ్బరి ముక్కలు/పొడి కొబ్బరి – నిషేధం
– మిరపకాయలు సహా అన్ని రకాల పొడి మసాలాలు – క్యాబిన్ బ్యాగేజీలో అనుమతి లేదు; చెక్-ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లవచ్చు
– కొబ్బరి – క్యాబిన్లో అనుమతి లేదు; చెక్-ఇన్ బ్యాగేజీలో అనుమతి ఉంది
– పచ్చ కొబ్బరి ముక్కలు (Green tissue) – క్యాబిన్, చెక్-ఇన్ రెండింటిలోనూ అనుమతి
– నెయ్యి/వంట నూనె – రెండింటిలోనూ కొన్ని పరిమితులతో అనుమతి. క్యాబిన్లో ద్రవ పదార్థాల (LAG) నిబంధనలు వర్తిస్తాయి. చెక్-ఇన్ బ్యాగేజీలో ఒక్క ప్రయాణికుడికి గరిష్ఠంగా 5 కిలోలు/లీటర్లు వరకు పరిమితి ఉంటుంది.
– పచ్చడి – క్యాబిన్, చెక్-ఇన్ రెండింటిలోనూ అనుమతి ఉంది. అయితే మిరపకాయ పచ్చడిని చెక్-ఇన్ బ్యాగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి.
అయితే UAEలోకి ప్రవేశించే సమయంలో కూడా కొన్ని ఆహార పదార్థాలపై ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు పాన్, వండిన ఆహార పదార్థాలు తీసుకురావడంపై పరిమితులు ఉన్నాయి.
ఈ వస్తువులు కూడా మీ బ్యాగ్‌లో ఉండకూడదు. ఆహార పదార్థాలతో పాటు మరికొన్ని వస్తువులపైనా విమాన ప్రయాణంలో ఆంక్షలు ఉన్నాయి.
ఇవి బ్యాగ్‌లో ఉంటే ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేస్తారు!
– గసగసాలు (Poppy seeds)
– దురియన్, చాంపెడెక్, పెడలై, మరాంగ్, పనస వంటి తీవ్రమైన వాసన వచ్చే ఆహార పదార్థాలు
– క్రికెట్ బ్యాట్లు
– స్కేట్‌బోర్డులు
– ఫిషింగ్ రాడ్లు
– మెజరింగ్ టేప్ – క్యాబిన్ బ్యాగేజీలో నిషేధం
– బొమ్మ తుపాకులు, నకిలీ ఆయుధాలు
– విల్లు, బాణాలు
– ఆయుధాలు, ఆయుధాల ప్రతిరూపాలు
– 6 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ బ్లేడ్ ఉన్న కత్తులు
– పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి
– బాణసంచా, టపాసులు
మందుల విషయంలో మరింత జాగ్రత్త
భారత్ నుంచి UAEకి వెళ్లేటప్పుడు మందుల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ముఖ్యంగా Controlled Medicines తీసుకెళ్తున్న ప్రయాణికులు ముందుగానే UAE Ministry of Health and Prevention (MoHAP) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఉపయోగించే మందు Controlled Medicine కిందకు వస్తుందా లేదా అనే విషయాన్ని ముందుగా వైద్యుడితో నిర్ధారించుకోవడం మంచిది.
అలాంటి మందులను తీసుకెళ్తే:
– సంబంధిత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వెంట ఉంచుకోవాలి.
– మీరు తీసుకెళ్తున్న మందుల పరిమాణం ప్రిస్క్రిప్షన్‌తో సరిపోవాలి.
– అవసరమైన సందర్భాల్లో ప్రయాణానికి ముందే MoHAP అనుమతి తీసుకోవాలి.
అయితే సాధారణంగా ఉపయోగించే, Controlled categoryలో లేని prescription medicines మరియు over-the-counter medicinesకు ముందస్తు MoHAP అనుమతి అవసరం ఉండదు.
ఏ మందు విషయంలోనైనా అనుమానం ఉంటే ప్రయాణానికి ముందు UAE embassy/consulate లేదా సంబంధిత అధికారులను సంప్రదించడం సురక్షితం.
డ్రగ్స్ విషయంలో UAEలో నిబంధనలు చాలా కఠినం
Narcotic drugs, illegal substances విషయంలో UAEలో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి.
హెరాయిన్, కొకైన్, హషీష్, ఇతర మాదకద్రవ్యాలు, అక్రమ పదార్థాలను UAEలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధం. కొన్ని మందుల్లో ఉండే controlled या psychotropic ingredients విషయంలో కూడా ముందస్తు అనుమతి అవసరం కావచ్చు.
అందుకే ఇతర దేశాల్లో సాధారణంగా లభించే మందు అయినా UAEలో దాని పదార్థాలపై ప్రత్యేక నిబంధనలు ఉండే అవకాశం ఉంది.
ఒక్క చిన్న పొరపాటు.. ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సమస్య
భారత్ నుంచి UAEకి ప్రయాణించే ముందు క్యాబిన్ బ్యాగ్, చెక్-ఇన్ బ్యాగ్ రెండింటినీ ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ఒక బ్యాగేజీలో అనుమతించే వస్తువు మరో బ్యాగేజీలో అనుమతించకపోవచ్చు.
అందుకే ప్రయాణానికి ముందు మీ ఎయిర్‌లైన్ తాజా బ్యాగేజీ నిబంధనలు, UAE అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి. ముఖ్యంగా మందులు, నెయ్యి/నూనె, పచ్చళ్లు, మసాలాలు, బ్యాటరీలు, పవర్‌బ్యాంకులు, డ్రోన్లు వంటి వస్తువుల విషయంలో చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








