Netflixకు JioHotstar భయం మొదలైందా? ఎందుకిలా చేస్తోంది?
భారత ఓటీటీ ప్రపంచంలో కొద్దికాలం క్రితం వరకూ నెట్‌ఫ్లిక్స్ అంటే అదో లగ్జరీ, ఒక ప్రీమియం బ్రాండ్. టీవీలకు, రోటీన్ సీరియళ్లకు, మాస్ రియాలిటీ షోలకు తాము చాలా దూరమని చాలా గర్వంగా చాటుకునేది. ‘సాక్రెడ్ గేమ్స్’, ‘ఢిల్లీ క్రైమ్’ లాంటి ప్రయోగాత్మక, రఫ్ అండ్ టఫ్ బోల్డ్ కంటెంట్‌తో ఓ కొత్త మార్గాన్ని వేసుకుంది. తనకంటూ ఆడియన్స్ ని మెల్లిగా ఏర్పాటు చేసుకుంది.
కానీ, రోజులు మారాయి. ఇప్పుడు అదే నెట్‌ఫ్లిక్స్ హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తే ‘MTV రోడీస్’, ‘MTV హసల్’, ‘కపిల్ శర్మ షో’, ‘సిఐడి’ లాంటి పక్కా మాస్, టీవీ మార్కెట్ ఫార్మాట్లు దర్శనమిస్తున్నాయి. అసలు ఇన్నాళ్లూ తమ ప్రత్యేకతను ప్రాణంగా భావించిన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హఠాత్తుగా వస్తున్న మార్పు ఏంటి? జియోహాట్‌స్టార్‌ను చూసి నిజంగానే భయపడుతోందా? లేక భారతీయ ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడానికి వ్యూహాన్ని మార్చిందా?
డీల్స్ వెనుక అసలు కథ
నేటి కాలంలో నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అందరికీ ఒక్కటే సందేహం వస్తోంది. రీసెంట్గా జియోహాట్‌స్టార్‌తో చేతులు కలిపి ‘MTV రోడీస్’ కొత్త సీజన్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు 18 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఆగస్టులోనే ‘MTV హసల్ 5’ కోసం మరో 13 కోట్ల దాకా పెట్టి జియోహాట్‌స్టార్‌తో కలిసి స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం చేసుకుంది.
కోట్ల బిజినెస్ చేసే నెట్‌ఫ్లిక్స్‌కు ఈ 30 కోట్లు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ అసలు విషయం డబ్బు కాదు… వాళ్లు ఎంచుకున్న కంటెంట్! ఇన్నాళ్లూ మాస్, టీవీ కంటెంట్‌ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని సంస్థ, ఇప్పుడు వరుసగా జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్న పాపులర్ రోడీస్, హసల్ వంటి షోల కోసం క్యూ కట్టడమే అసలైన విషయం.
‘క్లాస్’ నుంచి ‘మాస్’ వైపు ప్రయాణం
ఇండియాలోకి అడుగుపెట్టిన కొత్తలో నెట్‌ఫ్లిక్స్ లక్ష్యం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కావడం. అర్బన్ మైండ్‌సెట్ ఉన్నవారు, ఇంగ్లీష్ షోలు చూసేవారు, డిఫరెంట్ సినిమా ఎక్సపీరియన్స్ ని కోరుకునేవారే వాళ్ల టార్గెట్. కానీ భారత్ లాంటి విస్తారమైన మార్కెట్లో కేవలం ‘సాక్రెడ్ గేమ్స్’ చూసే క్లాస్ ఆడియెన్స్‌తో మాత్రమే బండి ముందుకు సాగదని వాళ్లకు ఇన్నాళ్లకు అర్థమైపోయింది.
ఒక ఇంట్లో ప్రతీ ఒక్కరూ తమ ప్లాట్‌ఫామ్‌ను చూడాలి. కపిల్ శర్మ కామెడీ కావాలనుకునే తండ్రి, రోడీస్ చూడాలనుకునే కుర్రాడు, సీఐడీ క్రైమ్ డ్రామాలు చూసే పాత తరం… ఇలా ఇంట్లో ప్రతీ ఒక్కరినీ కవర్ చేయాలంటే కంటెంట్ లైబ్రరీని విశాలం చేయక తప్పదు. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు తన బౌండరీలను చెరిపేసి అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
జియోహాట్‌స్టార్ మాస్ పవర్
మన దేశంలో జియోహాట్స్టార్ది చాలా వేరే లెవల్ స్ట్రాటజీ. క్రికెట్ మ్యాచ్‌లు, డైలీ సీరియళ్లు, రియాలిటీ షోలు, బిగ్ బాస్, భారీ బడ్జెట్ సినిమాలతో ప్రతి పల్లెకీ, ప్రతి గడపకూ చేరువైంది. జియోహాట్‌స్టార్ దగ్గర ఉన్నంత భారీ రీచ్ ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్‌కు లేదు.
అందుకే ఇప్పుడు ఓటీటీ యుద్ధం కేవలం “ఎవరి దగ్గర క్వాలిటీ సినిమాలు ఉన్నాయి?” అనేదాని నుంచి “ఎవరు ఎక్కువ మంది భారతీయులను తమ ప్లాట్‌ఫామ్‌పై గంటల తరబడి కూర్చోబెట్టగలరు?” అనే పాయింట్‌కి మారింది. జియోహాట్‌స్టార్ దగ్గరున్న ఆ మాస్ కనెక్టివిటీని, ఆడియెన్స్ పల్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేకపోతోంది.
ఇవి కూడా చదవండి
నెట్‌ఫ్లిక్స్ తన ‘డిఎన్ఏ’నే మార్చుకుందా?
ఒకప్పుడు టీవీ కల్చర్‌కు ప్రత్యామ్నాయంగా ఓటీటీని ప్రమోట్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు అదే టీవీ పునాదుల నుంచి పుట్టిన షోలను నెత్తిన పెట్టుకోవడం నిజంగా పెద్ద మార్పే. దేశంలో మారుతున్న సెన్సార్షిప్ నిబంధనలు, ఓటీటీలపై పెరుగుతున్న ఒత్తిళ్లు ఒక కారణమైతే… బిజినెస్ సీక్రెట్ మరో ప్రధాన కారణం.
ఎక్కువ మంది జనం ప్లాట్ఫామ్లోకి వస్తే సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయి, ఎంత ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తే అంత వాల్యూ పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు “మేము మీకు ఏది గొప్పగా చూపించాలనుకుంటున్నామో అదే చూడండి” అని గంభీరంగా చెప్పిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు రూట్ మార్చి “అసలు మీకేం కావాలి? మీరేం చూడాలనుకుంటున్నారు?” అని భారతీయ ప్రేక్షకులను అడిగి మరీ కంటెంట్ వడ్డిస్తోంది.
భయమా? వ్యూహమా? – భారతీయ ప్రేక్షకుల గెలుపా?
దీనిని జియోహాట్‌స్టార్‌ను చూసి నెట్‌ఫ్లిక్స్ పారిపోతోందని చెప్పలేం కానీ, జియోహాట్‌స్టార్ సృష్టించిన ఆ మాస్ వేవ్‌ను కాదనలేక తలవంచక తప్పలేదని మాత్రం చెప్పవచ్చు. ఒకప్పుడు రెండు వేర్వేరు ధృవాలుగా ఉన్న ఓటీటీ మోడల్స్ ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నాయి. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ మధ్య ఉండే ఆ గీతలు మెల్లమెల్లగా చెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఓడిపోయిందా లేక జియోహాట్‌స్టార్ గెలిచిందా అన్నదానికంటే… అంతిమంగా భారతీయ ప్రేక్షకుల ఇష్టాయిష్టాలే నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రపంచ దిగ్గజాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకున్నాయని చెప్పడమే కరెక్ట్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








