AI మైండ్ రీడింగ్: Search Engine పోయి Thought Engine రాబోతోందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి 11:47 అవుతోంది.
ఆ చిన్న గదిలో గాఢమైన చీకటి అలముకుంది. గది మూలన ఉన్న ఒక కుర్చీలో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అతని తలకు కొన్ని వైర్లు, ఒక బ్రెయిన్-స్కానింగ్ పరికరం తగిలించి ఉన్నాయి. అతని ముందర ఒక కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే వెలుగుతోంది. అతను ఏమీ మాట్లాడటం లేదు, కనీసం కీబోర్డ్ మీద వేళ్ళు కూడా పెట్టడం లేదు, చేతిలో ఫోన్ కూడా లేదు.
ఆ స్క్రీన్‌పై కొన్ని ఫొటోలు స్పీడుగా మారుతున్నాయి. అదే సమయంలో, అతని మనసులో ఒక ఎరుపు రంగు స్పోర్ట్స్ కారు మెరిసింది. ఆ కారు గురించి అతను ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పలేదు, కనీసం గూగుల్‌లో వెతకలేదు, యూట్యూబ్‌లో వీడియో చూడలేదు లేదా ఏ షాపింగ్ సైట్లోనూ క్లిక్ చేయలేదు.
కానీ, కొద్ది సెకన్లలోనే అతని ముందున్న స్క్రీన్‌పై ఏఐ ఒక చిత్రాన్ని గీయడం ప్రారంభించింది. మొదట కొన్ని రంగుల చారలు, తర్వాత ఒక స్పష్టమైన ఆకారం, చివరకు ఒక స్పోర్ట్స్ కారు రూపుదిద్దుకుంది. ఆ ఏఐ తయారు చేసిన చిత్రం వంద శాతం పర్ఫెక్ట్గా లేకపోయినా, ఆ క్షణంలో అతని మెదడు ఊహించిన దృశ్యానికి అది విస్తుపోయేలా చాలా దగ్గరగా ఉంది.
ఇదంతా చదివి ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్ అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుతం న్యూరోసైన్స్ ప్రయోగశాలల్లో నిజంగా జరుగుతున్న పరిశోధన. అసలు ఏఐ మనిషి మెదడును చదవడం మొదలుపెట్టిందా? ఇప్పుడే దీనిని పూర్తిస్థాయి “మైండ్ రీడింగ్” అని చెప్పలేం కానీ, రేపు ఈ టెక్నాలజీ మనం చూసేదాన్నే కాకుండా మనం ఊహించేదాన్ని కూడా బయటకు తీస్తే ఏమవుతుంది? అనే యాంగిల్ చుట్టూ తిరుగుతోంది. అంటే ఓ రకంగా సెర్చ్ ఇంజిన్ల కాలం చెల్లిపోయి, భవిష్యత్తులో “థాట్ ఇంజిన్లు” వస్తాయని అంచనాకు రావాల్సిన సమయం వచ్చేసింది.
ఏఐకి మన కళ్ళతో పనిలేకపోతే?
ఇజ్రాయెల్‌లోని వైజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ మిచల్ ఇరానీ, ఆమె టీమ్ అభివృద్ధి చేసిన కొత్త ఏఐ వ్యవస్థ ఈ ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం చూపిస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా చిత్రాన్ని చూస్తున్నప్పుడు, అతని మెదడులోని వివిధ ప్రాంతాల్లో రక్తప్రవాహం ఎలా మారుతుందో ఎఫ్ఎమ్ఆర్ఐ (fMRI) స్కానర్ ద్వారా నమోదు చేస్తారు. ఆ మెదడు సంకేతాల (Brain Activity) పాటర్న్స్ను విశ్లేషించి, ఆ వ్యక్తి ఏ చిత్రాన్ని చూశాడో ఏఐ తిరిగి నిర్మించడానికి (Reconstruct) ప్రయత్నిస్తుంది. ఇది ఫోటో తీసినట్లుగా యాజటీజ్ గా ఉండకపోయినా, మెదడు ఇచ్చిన సంకేతాలను బట్టి “ఈ వ్యక్తి బహుశా ఈ చిత్రాన్నే చూస్తూ ఉండిఉంటాడు” అని ఏఐ చాలా ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది.
గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురయ్యేది. మనిషి మెదడులోని సంకేతాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎఫ్ఎమ్ఆర్ఐ స్కానర్‌లో ఒక చిన్న భాగం (Voxel) లోనే దాదాపు 16,000 నరాల కణాలు (Neurons) ఉంటాయి. దాంతో ఏఐకి అందే సమాచారం అంత స్పష్టంగా ఉండేది కాదు. కానీ, ఇరానీ టీమ్ అత్యంత సూక్ష్మమైన బ్రెయిన్-స్కాన్ డేటాను ఉపయోగిస్తూ, ఎనిమిది మంది వ్యక్తులకు దాదాపు 9,000 చిత్రాలు చూపించినప్పుడు వచ్చిన మెదడు సంకేతాలతో మొదటి ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చారు.
ఒక ఏఐ.. మరో ఏఐకి మెదడు సంకేతాలను నేర్పిన వేళ
ఈ పరిశోధనలో అతిపెద్ద అడ్డంకి డేటా కొరత. ఏఐకి సరిగ్గా శిక్షణ ఇవ్వాలంటే భారీగా డేటా కావాలి, కానీ ప్రతి కొత్త వ్యక్తిని గంటల తరబడి ఎఫ్ఎమ్ఆర్ఐ మెషిన్లో పడుకోబెట్టి వేలాది చిత్రాలు చూపించడం చాలా ఖరీదైన, కష్టమైన పని. అందుకే పరిశోధకులు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక ఏఐ మోడల్ మరో ఏఐ మోడల్‌కు నేర్పించేలా డిజైన్ చేశారు.
వారు మొదట ‘ఎన్కోడర్’ అనే ఒక మోడల్‌ను తయారు చేశారు. ఇది ఏదైనా ఒక చిత్రాన్ని చూడగానే, “ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మనిషి మెదడు స్పందన ఎలా ఉండవచ్చు?” అని అంచనా వేస్తుంది. మరోవైపు ‘డికోడర్’ అనే మోడల్, “ఈ మెదడు సంకేతాలను బట్టి చూస్తే, ఆ వ్యక్తి ఏ చిత్రాన్ని చూసి ఉంటాడు?” అని తిరుగి అంచనా వేస్తుంది.
ఈ రెండు మోడళ్లను కలిపి పదేపదే ట్రైన్ చేయడం వల్ల ఒక అద్భుతమైన షార్ట్‌కట్ దొరికింది. ఏఐ శిక్షణ కోసం ఉపయోగించిన డేటాలో దాదాపు 70% చిత్రాలను అసలు మనుషులకు చూపించనేలేదు! అంటే ఏఐ కేవలం పాత ఉదాహరణలను గుర్తుపెట్టుకోవడం లేదు, మెదడు సంకేతాలకు మరియు దృశ్యాలకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్వయంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంది.
40 గంటల నరకం నుంచి కేవలం ఒకే ఒక్క గంటకు!
ఈ కొత్త పద్ధతి వల్ల మరొక పెద్ద విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇంతకుముందు ఒక కొత్త వ్యక్తి మెదడు సంకేతాలను ఏఐ అర్థం చేసుకోవడానికి (Calibration) దాదాపు 40 గంటల పాటు ఎఫ్ఎమ్ఆర్ఐ డేటా అవసరమయ్యేది. చాలా పెద్ద పనిగా ఉండేది. ఓరకంగా టీమ్ నరకం అనుభవిస్తున్నంత మానసిక ఒత్తిడి ఉండేదని చెప్తున్నారు. కానీ ఇరానీ బృందం అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థకు కేవలం ఒకే ఒక్క గంట డేటా సరిపోతుందని తేలింది.
న్యూరోసైంటిస్ట్ టామీ స్ప్రాగ్ ప్రకారం, ఒక గంట ఎఫ్ఎమ్ఆర్ఐ స్కాన్ చేయడానికి దాదాపు $600 నుండి $1,000 (సుమారు ₹50,000 నుండి ₹85,000) వరకు ఖర్చవుతుంది. అటువంటిది 40 గంటల సమయాన్ని ఒక్క గంటకు తగ్గించడం అంటే ఖర్చు, శ్రమ రెండూ భారీగా తగ్గినట్లే. ప్రయోగశాలలకే పరిమితమైన ఈ టెక్నాలజీ, మైండ్-డీకోడింగ్‌ను పరిశోధనారంగంలో మరింత ప్రాక్టికల్‌గా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
అసలు మెలిక: ఏఐ మన ఆలోచనలను, ఉద్దేశాలను చదవగలదా?
ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల్లో వ్యక్తి కళ్ళముందు నిజంగా ఒక చిత్రం ఉంది, కాబట్టి ఏఐకి ఒక ఆధారముంది. కానీ, మనిషి ఏ దృశ్యమూ లేనప్పుడు కేవలం తన మనసులోనే ఒక చిత్రాన్ని ఊహించుకుంటే ఏమవుతుంది? ఉదాహరణకు, మీరు కళ్ళు మూసుకుని ఒక మంచు పర్వతాన్నో, చిన్ననాటి మీ ఇంటినో లేదా రేపు కొనాలనుకుంటున్న కారునో ఊహించుకోండి. ఆ బొమ్మ బయటి ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం మీ మెదడు పొరల్లో మాత్రమే ఉనికిలో ఉంది.
శాస్త్రవేత్తల తదుపరి లక్ష్యం సరిగ్గా ఇదే! మనిషి ఏ దృశ్యాన్ని ఊహిస్తున్నాడో, తన మనస్సులో ఎలాంటి ఆలోచనను నిర్మిస్తున్నాడో ఏఐ ద్వారా డికోడ్ చేయడం. ఇది ఇంకా పూర్తిగా సాధ్యం కాకపోయినా, పరిశోధనలు వెళ్తున్న దిశ మాత్రం ఖచ్చితంగా ఆ వైపే ఉంది.
సెర్చ్ ఇంజిన్ల ముగింపు.. థాట్ ఇంజిన్ల ఆరంభం?
గత పాతికేళ్లుగా ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం ఒకే ఒక సూత్రం ఆధారంగా నడుస్తోంది— “యూజర్ గూగుల్‌లో లేదా ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నాడు?” మీరు గూగుల్‌లో ఒక ఫోన్ గురించి సెర్చ్ చేసినా, అమెజాన్‌లో ల్యాప్‌టాప్ చూసినా, లేదా యూట్యూబ్‌లో ఒక వీడియో చూసినా, మీ డిజిటల్ ప్రవర్తన ఆధారంగా టెక్ కంపెనీలు మీ ఇష్టాలను, అవసరాలను అంచనా వేస్తున్నాయి.
కానీ భవిష్యత్తులో బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు మరింత అభివృద్ధి చెంది, మనిషి మెదడులోని ఉద్దేశాలను (Intentions) నేరుగా డికోడ్ చేయగలిగితే, అసలు మనం టైప్ చేసి సెర్చ్ చేయాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. మీరు ఒక కొత్త ఫోన్ కొనాలని మనసులో అనుకోగానే, ఏఐకి ఆ విషయం అర్థమైపోతుంది. సెర్చ్ ఇంజిన్ అనేది మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే, ‘థాట్ ఇంజిన్’ మనం అసలు ప్రశ్నే అడగకముందే మన ఆలోచనను పసిగడుతుంది.
ప్రకటనల ప్రపంచంలో మైండ్ గేమ్స్!
యాడ్స్ ప్రపంచం ఎప్పటికప్పుడు వినియోగదారుడి మనసును చదవడానికే ప్రయత్నిస్తోంది. మొదట మన వయసు, ఊరు ఆధారంగా యాడ్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత మనం బ్రౌజ్ చేసిన హిస్టరీ, సోషల్ మీడియా లైక్‌లు, వేరబుల్ వాచ్‌లలో మన ఆరోగ్య డేటా… ఇలా ప్రతిదీ ప్రకటనలకు వాడుకున్నారు.
రేపు ఈ న్యూరోసైన్స్ డేటా కూడా వారి చేతికి చిక్కితే, మార్కెటింగ్ తీరే మారిపోతుంది. మీరు మార్కెట్‌కు వెళ్ళి ఏ వస్తువు కొంటారో అంచనా వేయడం కాకుండా, అసలు మీ మెదడులో ఒక వస్తువు కొనాలనే ఆలోచన ఎప్పుడు మొదలైందో కూడా బ్రాండ్లు గుర్తించగలుగుతాయి. ఇది సాంకేతికంగా వింతగా అనిపించినా, ప్రైవసీ పరంగా తీవ్రమైన భయాన్ని కలిగిస్తోంది.
మీ సెర్చ్ హిస్టరీ కంటే మీ మెదడు డేటా ప్రమాదకరమా?
ఇప్పటివరకు మన ప్రైవసీ అంటే మన లొకేషన్, ఫోటోలు, మెసేజ్‌లు, లేదా బ్రౌజింగ్ హిస్టరీ మాత్రమే అనుకున్నాం. కానీ అవన్నీ మనం బయటి ప్రపంచంలో చేసిన పనులకు సంబంధించిన డేటా. మెదడు డేటా అలా కాదు. అది మీరు బయటకు చెప్పని మాటలు, మీరు టైప్ చేయని సెర్చ్‌లు, మీరు ఎవరికీ చెప్పని రహస్య ఊహలు!
అందుకే న్యూరో-ఈథిక్స్ పరిశోధకులు ఈ ‘మెంటల్ ప్రైవసీ’ గురించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మనిషి అనుమతి లేకుండా అతని మెదడులోని ఆలోచనలను సేకరించే పరిస్థితి వస్తే, సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేదే ఉండదు. ప్రస్తుతం వాడుతున్న భారీ ఎఫ్ఎమ్ఆర్ఐ మెషిన్ల స్థానంలో, భవిష్యత్తులో మనం తలకు ధరించే హెడ్సెట్లు లేదా స్మార్ట్ వేరబుల్స్ (EEG devices) ద్వారా బ్రెయిన్ డేటా సేకరించడం మొదలైతే, మీ ప్రైవసీ గోడలు పూర్తిగా కూలిపోయినట్లే!
నిజంగానే ఏఐ మనస్సు చదివేస్తుందా?
అయితే, ప్రస్తుతానికి సమాధానం— ‘ఇంకా లేదు’. ఈ విషయంలో స్పష్టత చాలా అవసరం. ఇప్పటి ఏఐ మీ ప్రతి ఆలోచనను చదవలేదు, మీ మనసులోని రహస్యాలను దొంగిలించలేదు, లేదా దూరంగా కూర్చుని మీ మెదడును స్క్యాన్ చేయలేదు.
ప్రస్తుతం ప్రయోగశాలల్లో జరుగుతున్నది కేవలం నియంత్రిత వాతావరణంలో, మనుషులు చూస్తున్న చిత్రాలను బ్రెయిన్ సిగ్నల్స్ ద్వారా తిరిగి తయారు చేయడం మాత్రమే. ఇందులో కూడా ఏఐ కొన్నిసార్లు తప్పులు చేస్తోంది— ఒక కేక్ చిత్రాన్ని శాండ్‌విచ్‌గా, లేదా బాత్‌టబ్‌లో ఉన్న కుక్కను మేకగా మార్చి చూపించింది. అంటే ఇది ఇంకా పర్ఫెక్ట్ ‘మైండ్ రీడింగ్ మెషిన్’ కాలేదు. కానీ, భవిష్యత్తులో రాబోయే ఆ టెక్నాలజీకి ఇది మొదటి పునాది రాయి అనడంలో సందేహం లేదు.
భవిష్యత్తులో మిగిలేది ఏమిటి?
ఇంటర్నెట్ మన మాటలను డేటాగా మార్చింది. స్మార్ట్ఫోన్లు మన కదలికలను డేటాగా మార్చాయి. సోషల్ మీడియా మన ఇష్టాయిష్టాలను డేటాగా మార్చింది. ఇప్పుడు న్యూరోసైన్స్ మన మెదడును, ఆలోచనలను కూడా డేటాగా మార్చే తలుపులను తెరుస్తోంది.
ఈ రోజు ఏఐకి మీరు కళ్ళతో చూస్తున్న కారు కనిపిస్తోంది, రేపు మీరు మనసులో ఊహించుకుంటున్న కారు కనిపించవచ్చు, ఆ తర్వాత మీకు ఏం కావాలో మీరు అనుకోకముందే అది అంచనా వేయవచ్చు. ఆ రోజు వచ్చినప్పుడు, సెర్చ్ ఇంజిన్లు కేవలం పాతకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, థాట్ ఇంజిన్లు మన ప్రమేయం లేకుండానే మన మనస్సుల్లోకి తొంగిచూస్తుంటాయి.








