గువాహటి వన్డేలో వెస్టిండీస్ క్రేజీ రికార్డ్..!
భారత్ వర్సెస్ వెస్టిండీస్(Ind vs Wi) జట్ల మధ్య గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో ఊచకోత కోశారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లను క్లూలెస్ చేస్తూ విండీస్ జట్టుకు చెందిన ముగ్గురు కీలక బ్యాటర్లు శతకాలతో చెలరేగడం ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేక విశేషంగా నిలిచింది.
విండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌పై అత్యంత వేగంగా వన్డే శతకం బాదిన వెస్టిండీస్ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. అతనితో పాటు కెప్టెన్ షై హోప్ (94 బంతుల్లో 104 పరుగులు), అమీర్ జంగూ (77 బంతుల్లో 114 పరుగులు) కూడా సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల కారణంగా విండీస్ జట్టు 49.2 ఓవర్లలోనే 400 పరుగుల మార్కును దాటి, భారత్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
మరోవైపు విండీస్ ఇన్నింగ్స్ జోరు సాగుతున్నా.. టీమిండియా చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వన్డే కెరీర్లో 200 వికెట్ల అద్భుత మైలురాయిని మైలురాయిని అందుకున్నాడు. కీమో పాల్‌ను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో 200వ వికెట్ సాధించిన కుల్దీప్, ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఇప్పుడు 406 పరుగుల చారిత్రాత్మక లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.








