సిలికానాంధ్ర రజతోత్సవాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హ్యాట్రిక్ ప్రయత్నాలు
SiliconAndhra : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ అరెనా వేదికగా ఆగస్టు 1, 2026 న జరగనున్న ‘సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్’ వేడుకల్లో భాగంగా అపూర్వమైన ఘనతను సాధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకల్లో ఒకేరోజు ఏకంగా 3 అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించేలా ‘హ్యాట్రిక్’ ప్రయత్నం చేపట్టనున్నారు.
ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా గిన్నిస్ రికార్డు లక్ష్యంగా క్రింది మూడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
సంగీతామృతవర్షిణి: సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసేలా గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు.
లయామృతవర్షిణి: లయ విన్యాసాలతో ఉత్సాహాన్ని నింపుతూ మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారిక ప్రదర్శన నిర్వహించనున్నారు.
శతక సంఖారావం: తరాలను ఉత్సాహపరిచే కాలాతీత పద్యాల ప్రదర్శనతో మూడో గిన్నిస్ రికార్డు సాధనకు సన్నాహాలు చేశారు.
తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేసే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హ్యాట్రిక్ వేడుకల్లో సంగీత, సాంస్కృతిక అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.








