పాకిస్తాన్ జట్టుపై ‘వరస్ట్ టీమ్’ విమర్శలు..!
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్(Pakistan) క్రికెట్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శల పాలవుతోంది. హెడింగ్లే, లార్డ్స్ మైదానాల్లో జరిగిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్న పాక్ టీంపై మాజీలు, విశ్లేషకులు ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. దశాబ్ద కాలంలోనే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత ‘వరస్ట్ టీమ్’ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, మూడో టెస్ట్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కు ఈ అంశంపై ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
కనీసం పోటీ కూడా ఇవ్వని ఇలాంటి జట్టుతో ఆడటం ఎలా ఉందన్న ప్రశ్నకు రూట్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పాకిస్తాన్ జట్టును ‘పోరాట పటిమ లేని జట్టు’గా అభివర్ణించడం తీవ్ర గౌరవహీనమైన చర్య అని జో రూట్ స్పష్టం చేశారు. ప్రత్యర్థి జట్టును అంత తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, ఇది పాకిస్తాన్ జట్టుతో పాటు తమ ఇంగ్లాండ్ టీమ్‌ను కూడా అవమానించడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మేము మొదటి రెండు మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేశాం.
అక్కడి పిచ్‌లను, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని ఆడటం వల్లే భారీ విజయాలు సాధించాం అంతేకానీ, ఒక జట్టు అత్యుత్తమంగా ఆడినప్పుడు.. అవతలి జట్టు పూర్తిగా బలహీనమైనది అనడం కరెక్ట్ కాదు” అని రూట్ వివరించారు. ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేమని, పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని రూట్ గుర్తు చేశారు. కాగా, ఈ టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది.
రెండో టెస్ట్ ముగిసిన వెంటనే ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించి వేయడంతో పాటు, టెస్ట్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు వేసింది. అతని స్థానంలో వైట్-బాల్ కోచ్ మైక్ హెసన్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. సిరీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలనే పట్టుదలతో పాక్ జట్టు కొత్త ఆటగాళ్లతో బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడబోతోంది.








