20 ఏళ్లు ఆగిన కథ.. ఇప్పుడు తెరకెక్కి సెన్సేషన్,ఎందుకంటే?
కొన్ని కథలు పుట్టిన తర్వాత చాలా కాలం తెరకెక్కవు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఆ కాలం అనేది మహా అయితే నాలుగైదేళ్లు పడతాయి. కానీ ఓ సినిమా ఇరవై ఏళ్లు పట్టింది. కథ రాసిన తర్వాత తెరకెక్కటానికి. అలాగని ఆ దర్శకుడు సామాన్యుడు కాదు. అంతేకాదు ఇన్నాళ్ళు అయినా ఆ కథ పాతపడలేదు. జనాలు ఇది పాత కథ, బోర్ అని ప్రక్కన పెట్టేయటం లేదు. ఆ సినిమాని హాట్ టాపిక్ గా సినిమా ప్రేమికులు మాట్లాడుతున్నారు.
ఆ సినిమా పేరు ‘Arrested Memory’. ఈ కథ తెరకెక్కటానికి దాదాపు 20 ఏళ్లు ఎదురుచూసి, నాలుగు దేశాల్లో నిర్మాణ ప్రయత్నాలు విఫలమైన తర్వాత చివరకు మరో దేశంలో సినిమాగా తెరకెక్కింది.
ఏముంది అందులో…
జపాన్ ఇండీ సినిమాకు తనదైన శైలిని అందించిన ప్రముఖ దర్శకుడు సాబు ఈ కథను 2007లో రాశారు. జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాన్లలో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతిసారీ ప్రాజెక్టు ఆగిపోయింది. చివరకు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కథ తైవాన్ చేరింది. అక్కడ కొత్త టీమ్, కొత్త నటులతో చైనీస్ భాషా యాక్షన్ కామెడీగా రూపుదిద్దుకుంది.
సాబు మాటల్లో చెప్పాలంటే, గతంలో జరిగిన విఫల ప్రయత్నాలన్నీ కూడా ఈ కథ చివరకు సరైన చోటుకు చేరడానికి జరిగిన ప్రయాణంలో భాగమే.
అసలు ‘Arrested Memory’ కథ ఏమిటి?
ఈ సినిమా హీరో లీ. అతను ఒక స్ట్రిక్ట్ మనిషి. అలాగే ధైర్యవంతమైన పోలీస్ డిటెక్టివ్. కొత్త పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యే సమయంలోనే అతడికి ఊహించని వార్త తెలుస్తుంది. తనకు డిమెన్షియా ప్రారంభమైందని.అంటే జ్ఞాపకశక్తి మెల్లిగా తగ్గిపోతోందని.
ఆ విషయం కొత్త కొలీగ్స్ తెలియకముందే అతడికి ఒక భారీ కిడ్నాప్ కేసు అప్పగిస్తారు. ఓ జపనీస్ వ్యాపారవేత్త కుమారుడిని అపహరిస్తారు. కిడ్నాపర్లు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు.
ఆపరేషన్లో భాగంగా లీ వ్యాపారవేత్త స్థానంలో వెళ్లాలి. అతడు ఆ డబ్బుతో నిండిన బ్రీఫ్కేస్ తీసుకుని బయలుదేరుతాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది.
డిమెన్షియా ప్రభావంతో లీకి ఒక్కసారిగా జ్ఞాపకశక్తి మసకబారిపోతుంది. తాను ఎవరో గుర్తుండదు. ఎందుకు ఆ డబ్బు తన దగ్గర ఉందో తెలియదు. తన మిషన్ ఏమిటో కూడా మర్చిపోతాడు. అలా కోట్ల విలువైన నగదుతో తైపీ నగరంలోకి వెళ్లిపోయిన లీ ప్రయాణంతో అసలు గందరగోళం మొదలవుతుంది.
పొరపాట్లు, క్రిమినల్స్ ఎదురుపడటం, అనూహ్యమైన సంఘటనలు, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, కామెడీ—అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి. సాబు సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన కోఇన్సిడెన్స్ గేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది . ప్రతిదీ తప్పు దిశలో వెళ్తున్నట్టే కనిపించినా, ఆ గందరగోళమే చివరకు కథను ముందుకు నడిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈ కథ ఆలోచన ఎలా వచ్చింది?
సాబు ఈ కథను 2007లో రాసినప్పుడు జపాన్ సినిమాల్లో స్ట్రిక్ట్ పోలీసు అధికారుల కథలు బాగా నడుస్తున్నాయి. అదే సమయంలో అల్జీమర్స్, డిమెన్షియా సమస్యలపై చర్చ పెరుగుతోంది. ఈ రెండు విభిన్న అంశాలను కలపాలనే ఆలోచన ఆయనకు వచ్చింది.
బాగా స్ట్రిక్ట్ పోలీసు అధికారి తన జ్ఞాపకాలను కోల్పోతే ఏమవుతుంది? అతడి వ్యక్తిత్వం మారుతుందా? అతను తన గతం నుంచి బయిటకు రాగలడా? ఈ ప్రశ్నల చుట్టూనే ‘Arrested Memory’ నిర్మితమైంది.
సాబు దృష్టిలో జ్ఞాపకశక్తిని కోల్పోవడం కేవలం విషాదకరమైన సంఘటన కాదు. గతం చెరిగిపోయినప్పుడు మనిషిలో మరో వ్యక్తి బయటకు రావచ్చనే ఆలోచన కూడా ఇందులో ఉంది. అదే ఈ సినిమాని నిలబెట్టింది.
సాబు ప్రత్యేకత ఏమిటి?
సాబు సినిమాల కథనం సాధారణంగా స్ట్రైయిట్ గా సాగదు. ఒక సంఘటన మరో సంఘటనకు దారి తీస్తుంది. చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారుతుంది. పాత్రలు ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుంటాయి.
‘Dangan Runner’, ‘Postman Blues’, ‘Monday’ వంటి ఆయన చిత్రాల్లో కనిపించిన వేగం, అపార్థాలు, కోఇన్సిడెన్స్ సంఘటనలు ఇప్పుడు ‘Arrested Memory’ లో మళ్లీ కనిపిస్తున్నాయి. అందుకే ఈ చిత్రం సాబు అభిమానులకు ఒక రకంగా ఆయన పాత స్టైల్ కి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది.
కానీ ఇది కేవలం యాక్షన్ కామెడీ కాదు. కథలోని గందరగోళం వెనుక ఒక వ్యక్తి తన గతం నుంచి బయటపడే ప్రయత్నం కూడా ఉంది.
20 ఏళ్ల తర్వాత ఈ కథ ఎందుకు ఆసక్తికరంగా మారింది?
2007లో రాసిన ఈ కథ ఇప్పుడు 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కానీ మనిషి జీవితంలో ఒత్తిళ్లు మాత్రం తగ్గలేదు. ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు.ఎక్సపెక్టేషన్స్. ఈ అన్నింటి మధ్య చాలామందికి ఒక సందేహం ఎదురవుతూనే ఉంటుంది.నేను నిజంగా నా కోసం జీవిస్తున్నానా? అని. ఈ సినిమా కూడా ఇదే చూపిస్తుంది.
జ్ఞాపకాలను కోల్పోయిన వ్యక్తి కథను ఉపయోగించి, మనం మన జీవితంలో మోస్తున్న గతం ఎంతవరకు మనల్ని నిర్వచిస్తుందనే ప్రశ్నను వేస్తుంది. అందుకే ‘Arrested Memory’ అంత స్పెషల్.
మనం ఎప్పుడూ చూడచ్చు
ప్రస్తుతం వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ పొందుతోంది. ఆ తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF).
థియేటర్లలోకి ఎప్పుడు వస్తుంది?
జపాన్ విడుదల మాత్రం 2027లో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. పంపిణీదారు Tokyo Theatres ద్వారా జపాన్లో విడుదల చేయాలని ప్లానింగ్ ఉంది. ఆ తర్వాత ఓటిటిలోకి వస్తుంది.
ఫైనల్ గా…
ఏదైమైనా కొన్ని కథలు రాసిన వెంటనే తెరకెక్కవు. వాటికి కూడా సరైన సమయం రావాలి. 20 ఏళ్లుగా ఎదురుచూసిన ఈ కథ చివరకు తైవాన్లో రూపుదిద్దుకోవడం కూడా దానికి మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. కొన్ని సినిమాలు ఆలస్యంగా రావచ్చు. కానీ వాటి ఆలోచనకు గడువు ఉండదు. ‘Arrested Memory’ విషయంలో అదే జరిగింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








