సేవాపరుడు…కృష్ణ ప్రసాద్ సోంపల్లికి మసాచుసెట్స్ స్టేట్ హౌస్ సత్కారం
సమాజ సేవే లక్ష్యంగా, నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తూ అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకుడు, కమ్యూనిటీ లో ప్రముఖులుగా గుర్తింపు పొందిన కృష్ణ ప్రసాద్ సోంపల్లిని మసాచుసెట్స్ రాష్ట్ర స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక ప్రశంసా పత్రంతో ఇటీవల ఘనంగా సత్కరించారు. మసాచుసెట్స్ రాష్ట్రంలో అరుదైన గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు. కమ్యూనిటీకి ఆయన చేస్తున్నసేవ, అంకితభావం, సేవా తత్పరత మరియు వలంటీర్‌గా ఆయన చేస్తున్న ఇతర కార్యక్రమాలను గుర్తిస్తూ ఆయనకు ఈ ప్రశంసా పత్రాన్ని మసాచుసెట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ రొనాల్డ్మరియానో తరఫున అందించారు. సెప్టెంబర్ 3, 2026న మసాచుసెట్స్ స్టేట్ హౌస్‌లో స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ ఈ ప్రశంసాపత్రాన్ని సోంపల్లికి అందజేశారు. ప్రశంసా పత్రంలో కృష్ణ ప్రసాద్ సోంపల్లిExceptional Commitment to Community Service ను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేక మంది వ్యక్తులు మరియు కుటుంబాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలు కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారు ఎన్నో సంవత్సరాలుగా వివిధ సామాజిక, సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందిస్తున్నారు. విద్యార్థులకు మరియు పాఠశాలలకు సహాయం చేయడం, అవసరమైన వారికి నిత్యావసర వస్తువులు అందించడం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, యువత కోసం కార్యక్రమాలు చేపట్టడం, చారిటీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరించడం వంటి అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. “మనకు ఉన్నదానిలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. ఈ గుర్తింపు నాకు మరింత సేవ చేయాలనే బాధ్యతను పెంచింది,” అని కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో…
అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. 12కు పైగా సిపిఆర్ ఈవెంట్లు, చలివేంద్రాల ఏర్పాటు, అన్నదానాలతోపాటు అవసరమైనవారికి తనవంతుగా ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించడంలో కూడా కృష్ణ ప్రసాద్ సోంపల్లి ఎల్లప్పుడూ ముందుంటారు. తెలుగురాష్ట్రాల్లో తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూనే, మరోవైపు దేశానికి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను అభినందించడంతోపాటు వారికి తానా తరపున మెమోంటోను అందిస్తున్నారు.
కళా ప్రతిభ
అమెరికాలో పౌరాణిక నాటకాలు వేయడంలోనూ ముఖ్యంగా సుయోధనుని పాత్రలో మెప్పించడం కె.పి సోంపల్లికి సాధ్యమని అంటారు. తన కళా ప్రతిభతో ఎంతోమందిని మంత్రముగ్దులను చేశారు. ఆయన భావోద్వేగం, భాషాపటిమ ఆ పాత్రకు జీవం పోస్తాయని అభిమానులు అంటారు. అటు కళా ప్రతిభతోనూ, ఇటు సేవా కార్యక్రమాలతోనూ కెపి సోంపల్లి అందరికీ చేరవవుతున్నారు.
ఈ సందర్భంగా తన సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వాలంటీర్లు, మిత్రులు, కమ్యూనిటీ నాయకులు, తానా సంస్థ మరియు కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించిన స్పీకర్ రొనాల్డ్ మరియానో గారికి మరియు స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ గారికి కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ గౌరవం కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారి వ్యక్తిగత సేవలకు మాత్రమే కాకుండా, సమాజం కోసం తమ సమయాన్ని, శక్తిని, వనరులను అందిస్తూ నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లందరికీ లభించిన గుర్తింపుగా పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజా సేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ, మరెందరో జీవితాల్లో వెలుగులు నింపాలని కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారిని కమ్యూనిటీ సభ్యులు అభినందించారు.








