ప్రవాస భారతీయుల స్ఫూర్తిని కొనియాడిన మంత్రి సీతక్క..
చార్లెట్ వేదికగా జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్లో రెండో రోజు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రవాస భారతీయులను, టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని, కన్వెన్షన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి సీతక్క ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, అమెరికాలో స్థిరపడిన తెలుగువారందరూ తమ భారతీయ మూలాలను మర్చిపోకుండా, ఎంతో బాధ్యతతో సంస్కృతిని కాపాడుతున్నారని మంత్రి సీతక్క ప్రశంసించారు. ఇక్కడి అనేక కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న తీరు అభినందనీయమని కొనియాడారు.
తెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంచేందుకు, సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీటీఏ సంస్థను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. టీటీఏ ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా కన్వెన్షన్, తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీఏ కమిటీ సభ్యులు మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. సమాజ అభివృద్ధిలో మరియు సంస్కృతిని ప్రోత్సహించడంలో టీటీఏ చేస్తున్న విశేష కృషిని మెచ్చుకుంటూ, అందరికీ తన ధన్యవాదాలు తెలియజేశారు.








