భారత్‌లో నోలన్ మళ్లీ గెలిచాడా..? ‘ది ఒడిస్సీ’ వర్కవుట్ అయ్యిందా?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రిలీజ్‌కు ముందు ‘ది ఒడిస్సీ’పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ‘ఒప్పెన్‌హైమర్’ తర్వాత క్రిస్టఫర్ నోలన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే కనిపించాయి.అయితే… ప్రతి సినిమాకు అసలు పరీక్ష మాత్రం బాక్సాఫీస్ దగ్గరే ఉంటుంది. మరి… భారత్‌లో ‘ది ఒడిస్సీ’ నిజంగా వర్కవుట్ అయ్యిందా? తొలి రెండు రోజుల కలెక్షన్లు ఏం చెబుతున్నాయి, తెలుగులో ఆదరణ ఎలా ఉందో చూద్దాం.
తొలి రెండు రోజులు ఎలా ఉన్నాయి?
భారత్‌లో తొలి రోజు ‘ది ఒడిస్సీ’ సుమారు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రివ్యూలు బాగా రావటం, సోషల్ మీడియాలో బజ్ ఉండటంతో రెండో రోజు కూడా మంచి హోల్డ్ కనిపించింది. ముఖ్యంగా IMAX, ప్రీమియం స్క్రీన్లలో ఆక్యుపెన్సీ బలంగా కొనసాగుతోంది.
వీకెండ్ ముగిసే సమయానికి సినిమా రూ.60 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ సినిమాకు ఇది మంచి ఆరంభమే అని చెప్పాలి.
నోలన్ బ్రాండ్ మరోసారి పనిచేసిందా?
మనం ఇక్కడ గమనించాల్సిన అసలు విషయంలో భారత్‌లో క్రిస్టఫర్ నోలన్‌కు చాలా కాలంగా ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.ఆయనకు ఇక్కడ వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురుచూస్తూంటారు.
The Dark Knight నుంచి మొదలైన ప్రయాణం…
Inceptionతో మరింత పెరిగింది.
Interstellar భారతీయ ప్రేక్షకుల్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది.
Oppenheimer అయితే నోలన్ మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.అయితే ఈ సినిమా కొందరకి నచ్చలేదు. దాంతో ఈ సారి నోలన్ క్రేజ్ రిపీట్ అవుతుందా అనే సందేహం వచ్చింది. దానికి తోడు అసలు ఇక్కడ పబ్లిసిటీనే లేదు. మీడియాలోనూ బజ్ లేదు. రీజనల్ మార్కెట్ లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రమోషన్స్ లేవు. కానీ ఇలాంటి సిట్యువేషన్స్ లో ..
ఇప్పుడు ‘ది ఒడిస్సీ’ ఓపెనింగ్స్ చూస్తుంటే… ఆ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదనే విషయం స్పష్టమవుతోంది. చాలామంది ప్రేక్షకులు సినిమా కథ కంటే… “నోలన్ సినిమా” అనుకుంటూ థియేటర్లకు వెళ్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది?
ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో కూడా పోటీ తక్కువేమీ కాదు.ఇప్పటికే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా థియేటర్స్ లో ఉంది. ఇక ఈ వారం ‘ఓ..! సుకుమారి’, ‘రాజా ది రాజా’, ‘వదలా’, ‘మిస్టర్ మిడిల్ క్లాస్’, ‘వెంకట్రామయ్య గారి తాలూకా’, ‘ఆపరేషన్ అరుణ రెడ్డి’ వంటి కొత్త తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.
అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ కూడా రీ-రిలీజ్ అయింది.
ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో ‘ది ఒడిస్సీ’కే ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది.
ఇది తెలుగు సినిమాలు వెనుకబడ్డాయనే విషయం కాదు.
ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒక సినిమాను థియేటర్లో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపించిందనే చెప్పాలి.
ఫైనల్‌గా…
తొలి రెండు రోజుల ట్రెండ్‌ను బట్టి చూస్తే ‘ది ఒడిస్సీ’ భారత్‌లో మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. ఇది కేవలం ఒక హాలీవుడ్ సినిమా విజయమే కాదు. భారత్‌లో క్రిస్టఫర్ నోలన్‌కు ఉన్న బ్రాండ్ విలువ, ప్రపంచ సినిమాలను ఆదరించే కొత్త తరం ప్రేక్షకుల సంఖ్య రెండూ ఇంకా బలంగానే ఉన్నాయని ఈ సినిమా మరోసారి నిరూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం కూడా ఇదే జోరు కనపడేలా ఉందని ట్రెండ్స్ చెప్తున్నాయి.
అయితే వీకెండ్ తర్వాత కలెక్షన్లు తగ్గుతాయా? అన్నది వేచి చూడాల్సిన విషయం.








