శ్రీలంకలో ఫిక్సింగ్ కలకలం.. ఇండియా క్రికెటర్ అరెస్ట్..!
లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 సీజన్ ప్రారంభమైన తొలిరోజే అంతర్జాతీయ క్రికెట్లో ఒక సంచలనం వెలుగుచూసింది. భారత అండర్-19 క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, లంక లీగ్ ఫ్రాంచైజీ ‘జాఫ్నా కింగ్స్’ సహ యజమాని మంజోత్ కల్రా లంకలో అరెస్ట్ అయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ మరియు స్పాట్ ఫిక్సింగ్ కోసం లీగ్‌లో ఆడుతున్న ఒక క్రికెటర్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడనే భయంకరమైన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ అవినీతి వ్యవహారంపై లంక పోలీసుల ప్రత్యేక విచారణ సంస్థ రంగంలోకి దిగి శుక్రవారం మంజోత్ కల్రాను అదుపులోకి తీసుకుంది.
ఆ తర్వాత కొలంబో కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు జులై 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఈ కేసులో యువరాజ్ పుష్ప అనే మరో భారతీయ పౌరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. 27 ఏళ్ల మంజోత్ కల్రా గతంలో భారత క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన స్టార్ కావడం విశేషం. 2018 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ బాది భారత్‌కు వరల్డ్ కప్ అందించిన ఘనత కల్రా సొంతం.
ఆ తర్వాత క్రికెట్ నుంచి స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేసి, ఈ ఏడాది ప్రారంభంలో లంక ప్రీమియర్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. కానీ అంతలోనే ఇలా బుకీల అవతారమెత్తి ప్లేయర్లను బుట్టలో వేసుకోవడానికి ట్రై చేయడంపై భారత క్రికెట్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ అరెస్ట్ వల్ల లంక లీగ్‌కు ఎలాంటి ఆటంకం కలగదని, అవినీతిపై బోర్డు జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.








