రూ. 9.5 లక్షల కోట్ల హాలీవుడ్ డీల్‌కు బ్రేక్..! అమెరికా కోర్టులో మొదలైన మహా యుద్ధం!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“Geetha Arts, Mythri Movie Makers, DVV Entertainment, Haarika & Hassine, Sithara Entertainments అన్నీ కలిసి ఒకే సంస్థగా మారబోతున్నాయి.”
హాలీవుడ్ రేపో..ఎప్పుడో … ఒకరోజు ఓ టీవీ ఛానెల్ లో ఇలాంటి సంచలన వార్త బ్రేకింగ్ న్యూస్ గా వస్తే…
అప్పుడు మీకు వచ్చే మొదట వచ్చే డౌట్ ఏమిటి?
ఇకపై అంతా ఏక పక్ష నిర్ణయాలే ఉంటాయా? కొందరికే అవకాశాలు వస్తాయా? ఏ హీరోతో సినిమా తీయాలి… ఏ దర్శకుడికి అవకాశం ఇవ్వాలి… ఏ కథను నిర్మించాలి… ఏ సినిమాను విడుదల చేయాలి… అనే నిర్ణయాలు అన్నీ ఒకే సంస్థ చేతిలోకి వెళ్లిపోతాయా?
అసలు చిన్న నిర్మాతలకు స్థానం ఉంటుందా? కొత్త దర్శకులకు అవకాశాలు దొరుకుతాయా? పోటీ తగ్గిపోతే ప్రేక్షకుడే నష్టపోతాడా? అని. చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది.
అయితే ఇది కేవలం ఒక ఊహ మాత్రమే.కానీ …
ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ అయిన హాలీవుడ్లో దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద రాజకీయ, న్యాయ పోరాటం ప్రారంభమైంది.
ఇవి కూడా చదవండి
బతకడానికి హాలీవుడ్ దిగ్గజాల ‘మహాయుద్ధం’
ఇది కేవలం రెండు కంపెనీల హాలీవుడ్ విలీనం (Merger) గురించిన విషయం కాదు కాదు… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాల ధాటికి తట్టుకోలేక హాలీవుడ్ పాత తరం స్టూడియోలు చేస్తున్న ‘సర్వైవల్ స్టోరీ’.
ఒకవైపు థియేటర్ కలెక్షన్లు తగ్గిపోవడం, మరోవైపు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ఇండస్ట్రీని కమ్మేస్తుండటంతో… పారామౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు కలిసి ఒకే గొడుగు కిందకు రావాలని నిర్ణయించుకున్నాయి. ఈ డీల్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 110 బిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹9.5 లక్షల కోట్ల మహా డీల్!
ఒకప్పుడు మన దేశంలో Disney+ Hotstar, JioCinema ఎలా కలిసాయో… హాలీవుడ్లో అంతకంటే వంద రెట్లు పెద్ద విలీనం ఇది. ఒకవేళ ఇది పూర్తయితే పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీవో (HBO) అన్నీ కలిసి ‘పారామౌంట్ స్కైడాన్స్’ అనే ఒకే ఒక్క మోనోపలి (ఆధిపత్య) సంస్థగా మారుతాయి.
అంత పెద్ద డీల్‌కు ప్రభుత్వాలు ఎందుకు బ్రేక్ వేస్తున్నాయి?
ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. అమెరికా కేంద్ర ప్రభుత్వం (ఫెడరల్) ఇప్పటికే ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ, ఇప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ నేతృత్వంలో పలు రాష్ట్రాలు ఈ డీల్‌ను ఆపడానికి కోర్టుకు వెళ్తున్నాయి. దీనికి కారణం ‘యాంటీట్రస్ట్ (Antitrust)’ చట్టాలు.
యాంటీట్రస్ట్ అంటే ఏమిటి?
ఈజీగా అర్దం అయ్యేటట్లు చెప్పాలంటే… మార్కెట్లో ఏ ఒక్క కంపెనీ కూడా తనే సర్వాధికారి కాకూడదు. పోటీ లేకపోతే ఆ ఒక్క కంపెనీ చెప్పిందే రేటు అవుతుంది. వినియోగదారులు నష్టపోతారు. వ్యాపారంలో ఇలాంటి ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునే చట్టాలనే ‘యాంటీట్రస్ట్’ అంటారు.
మన దగ్గర నిన్న కాక మొన్న Zee – Sony విలీనం ఎందుకు ఆగిపోయిందో గుర్తుందా? మార్కెట్లో హెల్తీ కాంపిటీషన్ దెబ్బతింటుందనే కారణంతోనే మన దేశంలో కూడా ఇలాంటి పెద్ద డీల్స్ ఆగిపోతుంటాయి. ఇప్పుడు అమెరికా రాష్ట్రాలు కూడా అదే అంటున్నాయి.
అసలు సమస్య ఏమిటి?
ఈ విలీనం పూర్తయితే Superman, Batman, Harry Potter వంటి Warner ఫ్రాంచైజీలతో పాటు Mission: Impossible, Top Gun, Transformers వంటి Paramount చిత్రాల వ్యాపార బలం ఒకే సంస్థ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఎంటర్ట్నెంట్ ఇండస్ట్రీలో ఇది బాగా ఇంపాక్ట్ చూపే కార్పొరేట్ విలీనాల్లో ఒకటిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకే అమెరికాలోని పలు రాష్ట్రాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాలిఫోర్నియా నేతృత్వంలోని అటార్నీ జనరల్స్ ఈ విలీనం మార్కెట్లో పోటీని దెబ్బతీస్తుందని, ఒకే సంస్థకు అసాధారణ స్థాయిలో మార్కెట్ శక్తి లభిస్తుందని వాదిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
హాలీవుడ్‌ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు?
పదేళ్ల క్రితం వరకు హాలీవుడ్ స్టూడియోలకు పోటీ మరో హాలీవుడ్ స్టూడియో నుంచే ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Netflix, Amazon, Apple, YouTube, TikTok, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, AI ఆధారిత కంటెంట్… ప్రేక్షకుడి సమయాన్ని పంచుకుంటున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, స్ట్రీమింగ్ వ్యాపారంలో లాభాలు ఒత్తిడికి గురికావడం, నిర్మాణ వ్యయాలు పెరగడం వంటి పరిణామాలు పెద్ద స్టూడియోలను కూడా విలీనాల వైపు నెట్టుతున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.
అంటే ఇది విస్తరణ కోసం చేస్తున్న విలీనం కాదు. పోటీ ప్రపంచంలో నిలబడేందుకు చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నం.
కళాకారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
ఈ విలీనాన్ని హాలీవుడ్ నటులు, రచయితలు, సృజనాత్మక రంగంలోని సంఘాలు అనుమానంతో చూస్తున్నాయి. రెండు పెద్ద స్టూడియోలు ఒకటైతే కంటెంట్ కొనుగోలు చేసే సంస్థలు తగ్గిపోతాయని, కొత్త కథలకు అవకాశాలు తగ్గవచ్చని, ఉద్యోగాలపై కూడా ప్రభావం పడవచ్చని వారు భావిస్తున్నారు.
థియేటర్ యజమానుల ఆందోళన కూడా దాదాపు ఇదే. పోటీ తగ్గితే విడుదలయ్యే సినిమాల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు అంటున్నారు.
పారామౌంట్ వాదన ఏమిటి?
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్, టెక్నాలజీ కంపెనీల నుండి వస్తున్న విపరీతమైన పోటీని తట్టుకోవాలంటే ఈ విలీనం తప్పనిసరి అని పారామౌంట్ అంటోంది. థియేటర్లను ఆదుకోవడానికి ఈ ఉమ్మడి స్టూడియో ఏడాదికి దాదాపు 30 సినిమాలు విడుదల చేస్తుందని డేవిడ్ ఎల్లిసన్ హామీ ఇచ్చారు.
భారత ప్రేక్షకుడిపై ప్రభావం ఉంటుందా?
ఈ విలీనం అమెరికాలో జరుగుతున్నా దాని ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై పడే అవకాశం ఉంది. భారతదేశంలో విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాలు, ప్రాంతీయ భాషల డబ్బింగ్ వ్యూహాలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ పంపిణీ వంటి అంశాలపై భవిష్యత్తులో ప్రభావం ఉండొచ్చని కొందరు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి ప్రస్తుతం చర్చలో ఉన్న ఉన్న అంశాలు మాత్రమే.
కథలో మరో మలుపు
ఈ విలీనానికి అమెరికా ఫెడరల్ స్థాయిలో ఇప్పటికే అనుమతి లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో కొత్త న్యాయపోరాటం ప్రారంభమైంది. మరోవైపు విలీనం పూర్తయిన తర్వాత కొత్త సంస్థపై దాదాపు 80 బిలియన్ డాలర్ల అప్పు ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఆలస్యం జరిగితే అదనపు ఆర్థిక భారం కూడా పెరగనుంది.
ఈ డీల్ ఆగితే లాభపడేది ఎవరు?
ఒకవేళ అమెరికా రాష్ట్రాలు కోర్టులో గెలిచి ఈ విలీనం ఆగిపోతే… నెట్‌ఫ్లిక్స్ (Netflix), డిస్నీ (Disney), అమెజాన్ (Amazon) పండగ చేసుకుంటాయి. ఎందుకంటే తమకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఒక భారీ శత్రువు పుట్టకముందే అంతమైపోతాడు.
చివరికి…
గత పదేళ్లలో హాలీవుడ్లో Disney–Fox, Warner–Discovery లాంటి ఎన్నో విలీనాలు జరిగాయి. కానీ ఈసారి జరగబోయేది ఇండస్ట్రీ మనుగడకు సంబంధించిన యుద్ధం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినోదాన్ని శాసించే ఈ డీల్‌కు కోర్టులు బ్రేక్ వేస్తాయా లేదా అనేది చూడాలి!
ఇవి కూడా చదవండి








