ఉత్సాహంగా తానా న్యూజెర్సీ ‘హైకింగ్-26’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. “చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం” (Better Tomorrow Begins with a Step) అనే నినాదంతో జూలై 11న శనివారం ఉదయం 8 గంటలకు హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వనవిహారంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రకృతి అందాల మధ్య ఉత్సాహంగా అడుగులు వేశారు.
ఆహ్లాదకరంగా సాగిన ట్రయిల్..
స్వాగత పరిచయ కార్యక్రమముల తదనంతరం నిర్వాహకులు ముందుగా హైకింగ్ మార్గం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో పాటించాల్సిన భద్రతా సూచనలను వివరించారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగి ట్రయిల్‌పై నడక ప్రారంభించారు. న్యూజెర్సీలోని పచ్చని ప్రకృతి ప్రదేశాల్లో ఒకటైన సౌర్లాండ్ మౌంటెన్ ప్రిజర్వ్.. దట్టమైన చెట్లు, బండరాళ్లు, పక్షుల కిలకిలారావాలతో పాల్గొన్న వారికి సరికొత్త అనుభూతిని పంచింది. కుటుంబ సమేతంగా వచ్చినవారు చిన్నారులతో కలిసి నడుస్తూ, కొత్త పరిచయాలతో , ప్రకృతి దృశ్యాలను ఫొటోల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. తొలిసారి హైకింగ్‌కు వచ్చినవారు సైతం అనుభవజ్ఞుల ప్రోత్సాహంతో ట్రయిల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
పకడ్బందీ ఏర్పాట్లు.. భద్రతకు పెద్దపీట
ఈ కార్యక్రమం కోసం తానా న్యూజెర్సీ బృందం పలు వారాల పాటు శ్రమించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే అధిక స్పందనకు 200 కు పైగా సభ్యులు రావడంతో పార్కింగ్, ట్రయిల్ మార్గదర్శనం, వాటర్ స్టేషన్లు, వలంటీర్ల సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించారు. నడక ప్రారంభానికి ముందు వార్మప్ వ్యాయామాలు చేయించడంతో పాటు, ట్రయిల్ పొడవునా వాటర్ స్టేషన్లు, ప్రథమ చికిత్సా సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన వలంటీర్లు బృందాలుగా విడిపోయి, ఎవరూ వెనుకబడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆకట్టుకున్న యువత భాగస్వామ్యం
‘మన యువత – మన వారసత్వం’ అనే తానా భావనకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో యువ వలంటీర్లు చురుకైన పాత్ర పోషించారు. ట్రయిల్ గైడెన్స్, వాటర్ స్టేషన్ల నిర్వహణ వంటి బాధ్యతలను యువత క్రమశిక్షణతో నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో డిజిటల్ స్క్రీన్లకు, ఒత్తిడికి దూరంగా ప్రకృతి మధ్య గడపడం శారీరక ఆరోగ్యానికే కాక మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని, తెలుగు కుటుంబాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పలువురు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


నిర్వాహకుల కృతజ్ఞతలు..
ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హైకింగ్ కోఆర్డినేటర్ దశరథ తలపనేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఓరుగంటి ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నారెపాలెపు, కోశాధికారి రాజా కసుకుర్తి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, శ్యామ్ ప్రసాద్ అంబటిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
• సమన్వయ బృందం: తానా న్యూజెర్సీ టీమ్ సభ్యులు వెంకట్ ఏట్రింతల, భగత్ మారెళ్ల, డా.పద్మ చావా , చంద్ర తమ్మినీడి ,సమత కోగంటి, హరిబాబు గంగవరపు, ప్రవీణ్ కల్వకొల్లు, రవి మాచెర్ల, భాను నల్లమోతు, రామకృష్ణ చెరుకూరి, ప్రశాంత్ తుంగం, మధు పరిటాల, శరత్ తాటిపాముల, రవి మోసమ్, రాజేష్ కళ్లెంపూడి, శ్రీనివాస్ కురువిళ్ల , ప్రణతి కురువిళ్ల, త్రివేణి బోడెంపూడి, కోమలి మందలపు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా సమన్వయపరిచారు.
• యువ వలంటీర్లు: ఆకాంక్ష తలపనేని, బవేష్ కళ్లెంపూడి, నిత్యా చెరుకూరి, ఆరాధ్య చెరుకూరి, వంశీచంద్ నారెపాలెపు, వర్షాచంద్ నారెపాలెపు, సాయి పుసులూరి, హాసిని పుసులూరి, నవిత్ బాసన, విధిత బాసన, మేఘ చెరుకూరి, గీతిక మారెళ్ల ముందుండి సేవలందించారు.
• హైకింగ్ అనంతరం పాల్గొన్నవారికి రుచికరమైన అల్పాహారం అందించారు. ఎడిసన్‌లోని శ్రీ సాయి దత్త పీఠం- శివ విష్ణు ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి గారు, నాగేంద్ర సహాయ సహకారానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తానా నాయకత్వం అభినందనలు
కుటుంబ సమేతంగా ప్రకృతికి దగ్గరగా ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన న్యూజెర్సీ తానా బృందాన్ని, వలంటీర్లను మరియు పాల్గొన్న ప్రవాసులను తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద నల్లూరి,తానా బోర్డు చైర్మన్ డా. శ్రీనివాస్ నాగేంద్ర కొడాలి ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాలో తెలుగు వారసత్వం, సాంస్కృతిక విలువలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, రాబోయే రోజుల్లో న్యూజెర్సీ వ్యాప్తంగా మరిన్ని విజ్ఞానదాయక, ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తానా స్థానిక నాయకత్వం ప్రకటించింది.









