సిరాజ్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సెటైర్లు..!
న్యూజిలాండ్‌తో శుక్రవారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను(Mohmmadh Siraj) తుది జట్టు నుంచి మరోసారి తప్పించడంపై భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. తొలి టెస్టులో సిరాజ్‌ను పక్కన పెట్టడంపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ రెండో టెస్టులోనూ అదే నిర్ణయానికి కట్టుబడి సిరాజ్‌కు నిరాశ మిగిల్చింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ భారత జట్టు యాజమాన్యంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే ఎక్స్ వేదికగా అశ్విన్ రెండు ఆసక్తికర పోస్టులు చేశారు. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసిస్తూనే, సిరాజ్ తన బౌలింగ్ లయను కోల్పోయినట్లు కనిపిస్తోందని, రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయానికైనా కష్టపడి ప్రాక్టీస్ చేసి తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నట్లు అశ్విన్ సెటైర్ వేశారు.
ఇవి కూడా చదవండి
మరో పోస్టులో, 60 నుంచి 80 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేయడం చాలా సులభమని, ఇలాంటి సమయంలో సిరాజ్ వేగంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తాడని ఆశిస్తున్నానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరోవైపు, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం సిరాజ్‌పై వేటు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భారత అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన సిరాజ్‌ను మరోసారి పక్కన పెట్టడం నమ్మశక్యంగా లేదని కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రాతో పాటు భారత పేస్ విభాగంలో మొదటి ఎంపికగా సిరాజ్ ఉండాలని, స్వయంగా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సైతం సిరాజ్‌ను వరల్డ్ క్లాస్ బౌలర్ అని ప్రశంసించి, ఇప్పుడు తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం ఏంటని కైఫ్ ప్రశ్నించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ను 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులకు కట్టడి చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుని కీలక వికెట్లు పడగొట్టాడు.







