తెలంగాణ ఖజానాకు ‘మియాపూర్’ ఆక్సిజన్!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. దాదాపు రెండున్నర దశాబ్దాల న్యాయపోరాటం తర్వాత ప్రభుత్వానికి దక్కిన మియాపూర్ భూములను భారీ ఆదాయ వనరుగా మార్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ప్రణాళికలను వేగవంతం చేసింది. అక్టోబర్ 29న జస్టిస్ సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ఈ 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పడంతో, ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మెగా లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది.
శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో ఉన్న ఈ 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సుమారు 150 ఎకరాల మేర పేదల నివాసాలు, ఆక్రమణలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పేదలను ఖాళీ చేయిస్తే ప్రజాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆక్రమణల జోలికి వెళ్లకుండా.. వివాదరహితంగా ఉన్న 386.44 ఎకరాల్లో మాత్రమే వెంచర్ వేయాలని నిర్ణయించింది. ఇందులో విశాలమైన రహదారులు, పార్కులు, పచ్చదనం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సుమారు 156.88 ఎకరాలు కేటాయించగా, నికరంగా 229.56 ఎకరాల్లో 228 ప్లాట్లను అభివృద్ధి చేసేలా డ్రాఫ్ట్ రూపొందించారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్ఎండీఏ రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు వెచ్చించనుంది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, మియాపూర్ భూముల ఈ వేలంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే ప్రభుత్వ భూములకు ఉన్న డిమాండ్ స్పష్టమవుతోంది. 2023 ఆగస్టులో బుద్వేల్ లో 100.01 ఎకరాల వేలంలో కనీస ధర రూ.20 కోట్లు కాగా, సగటున ఎకరం రూ.36.5 కోట్లు, గరిష్ఠంగా రూ.41.75 కోట్లు పలికి ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్లు తెచ్చిపెట్టింది. కోకాపేట నియోపోలీస్ లో 500 ఎకరాల లేఅవుట్ వేలంలో ఇప్పటివరకు రూ.9,700 కోట్లకు పైగా ఆదాయం రాగా, గతేడాది అక్టోబర్లో ఎకరం గరిష్ఠంగా రూ.151 కోట్లకు అమ్ముడైంది. 2026 ఆగస్టులో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గంలో ఎకరం రూ.264 కోట్లు, నాలెడ్జ్ సిటీలో ఏకంగా రూ.269 కోట్ల రికార్డు ధరను నమోదు చేశాయి.
మొత్తం 550 ఎకరాల మార్కెట్ విలువ రూ.50 వేల కోట్లుగా అంచనా వేస్తుండగా, 386.44 ఎకరాల్లో వేసే లేఅవుట్ ద్వారా కనీసం రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. అయితే.. ఒకవైపు ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంటే, మరోవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మివేయడం సరికాదని విపక్షాలు వాదిస్తున్నాయి. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థలంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా మైదానాల వంటి ప్రజాప్రయోజన ప్రాజెక్టులను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు 228 ప్లాట్లను ఒకేసారి వేలం వేస్తే మార్కెట్లో సరఫరా పెరిగి ఆశించిన ధర రాకపోవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకే దశలవారీగా వేలం నిర్వహించే అంశాన్ని హెచ్ఎండీఏ పరిశీలిస్తోంది. ఏదేమైనా.. మియాపూర్ భూముల విక్రయం ద్వారా వచ్చే భారీ నిధులను రాష్ట్ర రుణభారం తగ్గించుకోవడానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఏ మేరకు పారదర్శకంగా వినియోగిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.







