మార్క్ జుకర్‌బర్గ్‌ని RSS కార్యకర్త చేసేసారే.. అసలేం జరుగుతోంది?
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను నడిపించే మార్క్ జుకర్‌బర్గ్ మనకు తెలుసు. కానీ ఆయనకు RSS కార్యకర్తల వేషధారణ వేసి, వీధుల్లో భారీ పోస్టర్లు పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు భారత్‌లో సరిగ్గా ఇదే జరుగుతోంది! జుకర్‌బర్గ్ తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్, నల్ల టోపీతో కనిపిస్తున్న పోస్టర్లు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, ఆయన పేరును కూడా మార్చి మరీ వ్యంగ్యంగా నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్‌కు మెటాపై ఎందుకింత కోపం వచ్చింది? జుకర్‌బర్గ్‌ను ఈ వివాదంలోకి ఎందుకు లాగారు? దీని వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం.
మెటాపై కాంగ్రెస్ ఆగ్రహం.. సోషల్ మీడియా ఖాతాలే అసలు సమస్య!
ఈ వివాదానికి ప్రధాన కారణం మెటా కంటెంట్ నియంత్రణ విధానాలే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారని, తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా అధికార బీజేపీకి అనుకూలంగా మెటా వ్యవహరిస్తోందన్నది ఆ పార్టీ ప్రధాన అభ్యంతరం.
ఈ ఆరోపణలతో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నవంబర్ 20 నుంచి నిరసనలకు దిగారు. హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్‌లలో మెటా కార్యాలయాల దగ్గర ఆందోళనలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులతో ఘర్షణలు కూడా జరిగాయి. తమ పార్టీకి చెందిన నాయకుల ఖాతాలపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు, సోషల్ మీడియాలో పోస్టులు ఎలా నియంత్రించబడుతున్నాయో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
జుకర్‌బర్గ్‌కు RSS గెటప్.. ‘Mark BJPberg’ అంటూ సెటైర్లు!
నిరసనలు జరుగుతున్నా వివాదం తగ్గకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మరో అడుగు ముందుకేశారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చిత్రాలను RSS కార్యకర్తల వేషధారణలో రూపొందించి భారీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెల్ల చొక్కా, ఖాకీ నిక్కర్, నల్ల టోపీతో ఉన్న జుకర్‌బర్గ్ చిత్రాలు ఢిల్లీ, కోల్‌కతా, పాట్నా, ముంబై, బెంగళూరు నగరాల్లో కనిపించాయి.
ఇక బెంగళూరులో ఏర్పాటు చేసిన హోర్డింగులు మరింత ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 24న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ రోడ్డుపై కర్ణాటక యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘Meta BJP Ka Beta’ అనే నినాదంతో బ్యానర్లు పెట్టారు. అంతటితో ఆగకుండా జుకర్‌బర్గ్ పేరును ‘Mark BJPberg’గా మార్చి వ్యంగ్యంగా ప్రదర్శించారు.
ఈ పోస్టర్ల ద్వారా మెటా సంస్థ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందన్న తమ ఆరోపణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
నిరసనలతో దిగొచ్చిన మెటా.. కాంగ్రెస్‌తో రహస్య చర్చలు!
వీధుల్లో నిరసనలు, కార్యాలయాల ఎదుట ఆందోళనలు, జుకర్‌బర్గ్‌పై వ్యంగ్య పోస్టర్లు.. ఇలా పరిస్థితి వేడెక్కుతుండటంతో మెటా ప్రతినిధులు చివరకు కాంగ్రెస్ నేతలతో చర్చలకు సిద్ధమయ్యారు. నవంబర్ 24న న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అమన్ జైన్, నటాషా జోగ్ అనే మెటా ఉన్నతాధికారులు కాంగ్రెస్ నేతలతో 40 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నాయకుల ఖాతాలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించడంతో పాటు, బీజేపీకి అనుకూలంగా ఉన్న పోస్టులు మాత్రం ఎందుకు కొనసాగుతున్నాయని నిలదీశారు. ముఖ్యంగా AI సాయంతో రూపొందించిన కొన్ని బీజేపీ అనుకూల పోస్టులు తొలగించకుండా, కాంగ్రెస్‌కు సంబంధించిన పోస్టులపై మాత్రం వేగంగా చర్యలు తీసుకుంటున్నారంటూ ఉదాహరణలు చూపించారని సమాచారం.
దీనికి మెటా ప్రతినిధులు స్పందిస్తూ, కొన్ని పోస్టులను తమ AI కంటెంట్ విధానాల ప్రకారం తొలగించామని, భారత చట్టాలను కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వివరించారు. అంతేకాదు, తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌కు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే సమావేశం ముగిసింది.
ఇవి కూడా చదవండి
లక్షల్లో కంటెంట్ తొలగింపులు.. వివాదానికి ఆజ్యం పోసింది ఇదే!
ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైన అంశం ఉంది. మెటా వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 మొదటి ఆరు నెలల్లో భారత చట్టాల ప్రకారం 54 లక్షలకు పైగా పోస్టులు లేదా ఖాతాలపై ఆంక్షలు విధించారు. అదే 2025 మొత్తం సంవత్సరంలో ఈ సంఖ్య సుమారు 70 వేలుగా ఉంది. ఇంత భారీగా ఆంక్షలు పెరగడంతో సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛపై చర్చ మొదలైంది.
దీనికి కారణం భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో తీసుకొచ్చిన ఐటీ నిబంధనల మార్పులేనని మెటా చెబుతోంది. గతంలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి 36 గంటల సమయం ఉండగా, ఇప్పుడు ఆ గడువు మూడు గంటలకు తగ్గింది. అలాగే AIతో రూపొందించిన కంటెంట్‌పైనా మరింత పర్యవేక్షణ, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పెరిగింది.
బీజేపీ కూడా రంగంలోకి.. కాంగ్రెస్‌పై విమర్శలు!
మరోవైపు కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రైవేట్ కంపెనీల కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయడం, వాటిని ధ్వంసం చేయడం కాంగ్రెస్ రాజకీయ విధానమంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ X వేదికగా విమర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మెటా కార్యాలయం వద్ద జరిగిన ఘటనను బీజేపీ తప్పుబట్టింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







