కరోనా టైమ్‌లో వెంటిలేటర్ల కోసం.. ఇప్పుడు Nvidia కోసం! ట్రంప్ మళ్లీ తెరపైకి తెచ్చిన చట్టం ఏంటి?
ఒకప్పుడు కరోనా మహమ్మారి సమయంలో వెంటిలేటర్ల తయారీ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపయోగించిన చట్టం.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి లక్ష్యం వెంటిలేటర్లు కాదు.. ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలకమైన Nvidia సంస్థ, దాని CEO జెన్సన్ హువాంగ్! ఆయన్ను తిరిగి CEOగా తీసుకురావడానికి ఏకంగా యుద్ధకాలం నాటి చట్టాన్ని ఉపయోగించాలనే ఆలోచన అమెరికా రక్షణ శాఖలో చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అసలు ఈ చట్టం ఏంటి? ఒక కంపెనీ CEO విషయంలో ప్రభుత్వం దీన్ని ఎందుకు ప్రస్తావించింది? దీని వెనుక ఉన్న కథేంటి?
కరోనా సమయంలో ఉపయోగించిన చట్టం.. ఇప్పుడు Nvidia కోసం ఎందుకు?
అమెరికాలో 1950లో అమల్లోకి వచ్చిన డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (Defense Production Act – DPA) మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించిన ఈ చట్టం.. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీల ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు కల్పిస్తుంది.
కరోనా మహమ్మారి సమయంలో వెంటిలేటర్ల కొరత ఏర్పడినప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించింది. జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు వెంటిలేటర్ల తయారీ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అయితే ఇప్పుడు అదే చట్టం మరో భిన్నమైన కారణంతో వార్తల్లోకి వచ్చింది. ఈసారి అమెరికా AI రంగంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం, Nvidia ప్రాధాన్యతను కాపాడుకోవడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.
Nvidia CEO కోసం పెంటగాన్‌లో కీలక చర్చలు?
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన డిప్యూటీ స్టీవ్ ఫెయిన్‌బెర్గ్ సహా పెంటగాన్ ఉన్నతాధికారులు Nvidia వ్యవహారంపై చర్చించినట్లు ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి.
జెన్సన్ హువాంగ్ను తిరిగి CEOగా నియమించేలా Nvidia బోర్డుపై ఒత్తిడి తీసుకురావడానికి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ను ఒక సాధనంగా ఉపయోగించవచ్చా అనే అంశాన్ని అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
అయితే ఈ చట్టం ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీకి CEOను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదు. కానీ Nvidia వంటి కీలక సంస్థపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఉపయోగించి ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉదాహరణకు, అమెరికా సైనిక అవసరాల కోసం మరిన్ని చిప్‌లను ఉత్పత్తి చేయాలని Nvidiaపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కంపెనీ వ్యాపారం ను ప్రభావితం చేయవచ్చనే వాదన వినిపించింది.
ట్రంప్, జేడీ వాన్స్ కూడా రంగంలోకి!
ఈ వ్యవహారం కేవలం పెంటగాన్ చర్చలకే పరిమితం కాలేదు. Nvidia చుట్టూ నెలకొన్న వివాదం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
జెన్సన్ హువాంగ్ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకురావడానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ట్రంప్ స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరినట్లు కథనం పేర్కొంది.
వారాంతంలో పలువురు క్యాబినెట్ అధికారులు కలిసి హువాంగ్ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. చివరకు సోమవారం ఉదయం ఆయన తిరిగి Nvidia బాధ్యతలు చేపట్టినట్లు కథనం వెల్లడించింది.
అయితే, ఈ పరిణామంలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రస్తావన ఎంతవరకు ప్రభావం చూపిందనే దానిపై స్పష్టత లేదు.
అసలు అమెరికాకు Nvidia ఎందుకంత ముఖ్యం?
ప్రపంచవ్యాప్తంగా AI అభివృద్ధిలో Nvidia తయారు చేసే చిప్‌లకు కీలకమైన స్థానం ఉంది. అత్యాధునిక AI మోడళ్లకు అవసరమైన కంప్యూటింగ్ శక్తిని అందించడంలో ఈ సంస్థ చిప్‌లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
అమెరికా, చైనా మధ్య AI సాంకేతిక పోటీ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో Nvidia ప్రాధాన్యత మరింత పెరిగింది.
అమెరికా రక్షణ శాఖ కూడా AIని తన సైనిక వ్యూహంలో కీలక భాగంగా మార్చుకుంటోంది. భవిష్యత్తులో యుద్ధాలు, నిఘా వ్యవస్థలు, సైనిక నిర్ణయాలు, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో AI కీలకంగా మారుతుందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో Nvidia వంటి సంస్థలు కేవలం వ్యాపార కంపెనీలుగా కాకుండా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సంస్థలుగా కూడా పరిగణించబడుతున్నాయి.
సిలికాన్ వ్యాలీలోనూ ఇదే ఆలోచనకు మద్దతు
జెన్సన్ హువాంగ్ తిరిగి CEOగా రావాలనే ఆలోచనకు సిలికాన్ వ్యాలీలోని కొందరు ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారుల నుంచి కూడా మద్దతు లభించినట్లు తెలుస్తోంది.
క్రిప్టో పెట్టుబడిదారుడు, Andreessen Horowitz మాజీ భాగస్వామి బాలాజీ శ్రీనివాసన్.. Nvidia బోర్డు హువాంగ్ను తిరిగి నియమించకపోతే అమెరికా రక్షణ శాఖ జోక్యం చేసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
మరో టెక్ పెట్టుబడిదారుడు షెర్విన్ పిషెవర్ కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అమెరికా పారిశ్రామిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
Nvidia, AI రంగంలో అమెరికా ఆధిపత్యం కేవలం కంపెనీ లాభాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదని.. జాతీయ భద్రత, ఆర్థిక పోటీతత్వం, అంతర్జాతీయ రాజకీయ శక్తితో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
పెంటగాన్ ఏమంటోంది?
ఈ వార్తలపై పెంటగాన్ స్పందిస్తూ, రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య ఇలాంటి చర్చలు జరగలేదని ఖండించింది.
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, డిప్యూటీ సెక్రటరీ స్టీవ్ ఫెయిన్‌బెర్గ్ లేదా అండర్ సెక్రటరీ ఎవరూ అలాంటి ప్రతిపాదన చేయలేదని ఒక అధికారి స్పష్టం చేశారు.
Nvidia ప్రతినిధి పాట్రిక్ రూథర్‌ఫోర్డ్ మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







