రివ్యూ : ‘ఆకాశంలో ఒక తార’ మన కోసం వచ్చింది ఈ వేళా…
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థలు : గీతా ఆర్ట్స్, లైట్‌బాక్స్ మీడియా, స్వప్న సినిమా,
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్, రుహానీ శర్మ,
స్వాసిక, గౌతమ్ మీనన్, కోట జయరామ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం : జి.వి.ప్రకాశ్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబుసిరిల్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్, రచయిత: గంగరాజు గుణ్ణం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ : 20.11.2026
నిడివి : 2 ఘంటల 39 నిముషాలు
“సీతారామం”, “లక్కీ భాస్కర్” వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్, (Dulquer Salmaan) అల్లు అరవింద్,(Allu Aravind) సి.అశ్వనీదత్,(Aswani Dutt) గంగరాజు గుణ్ణం (Gunnam Ganga Raju) వంటి దిగ్గజ నిర్మాతల కాంబినేషన్లో వచ్చిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara) ఈ రోజు థియేటర్ లలో విడుదలైంది. ఈ సినిమాతో తెలుగులో దుల్కర్ సల్మాన్‌కు మరో హిట్టు దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే సమీక్ష చదవాల్సిందే…
కథ:
కల్పన (సాత్విక వీరవల్లి) అలియాస్ అమ్ములు వుండే ప్లేస్ పాలలంక అనే చిన్నపల్లెటూరు. చదువులో టాపర్. చిన్నతనం నుంచి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. కానీ కూతురిని చదివించడం ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. పదో తరగతి పరీక్షలు పూర్తవ్వగానే కృష్ణ (దుల్కర్ సల్మాన్)అనే అబ్బాయితో కల్పన పెళ్లి జరిపిస్తాడు. కల్పన పదో తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్ వచ్చిందని తెలుసుకున్న కృష్ణ…ఆస్ట్రోనాట్ కావాలనే భార్య కలను ఎలాగైనా నిజం చేయాలని అనుకుంటాడు. ఈ ప్రయత్నంలో కృష్ణ ఎలాంటి కష్టాలు పడ్డాడు? కల్పనను లక్ష్యం దిశగా ఏ విధంగా నడిపించాడు? తక్కువ ఖర్చుతో రాకెట్ చేయాలనే అమ్ములు ప్రయత్నం ఎందుకు విఫలమైంది? కల్పన టాలెంట్‌ను నమ్మిన రోహిణి (శృతి హాసన్) ఎవరు? కృష్ణ నమ్మకాన్ని నిలబెడుతూ కల్పన ఆస్ట్రోనాట్ అయ్యిందా? అంతరిక్షంలో అడుగుపెట్టిందా? లేదా? అన్నదే ఈ మిగతా కథ.
నటీ నటుల హావభావాలు :
హీరోయిజం, ఫైట్స్, డ్యాన్స్‌లు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి పాత్రను ఎంపిక చేసుకుని, కొత్తదనం కోసం పరితపించే నటుడు దుల్కర్ సల్మాన్. అతని ఆలోచించే విధానం ఎంత విభిన్నంగా ఉంటుందో చెప్పడానికి ఆకాశంలో ఒక తార బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. ఎలాంటి పాత్ర చేయడానికి చాలా గట్స్ ఉండాలి. దర్శకుడి విజన్, కథను నమ్మి దుల్కర్ ఈ సినిమా చేశారు. కృష్ణ పాత్రలో జీవించాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో దుల్కర్ నటన కదిలిస్తుంది. సాత్విక వీరవల్లికి హీరోయిన్గా ఇదే మొదటి సినిమా అయినా కెమెరా ముందు ఎక్కడ తడబడకుండా అనుభవం వున్న నటిగా, ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. మహా నటి సావిత్రి వంటి పాత తరం హీరోయిన్ ల చాలా చోట్ల కళ్లతోనే నటించి ఆకట్టుకుంది. దుల్కర్, సాత్విక జంట చక్కగా వుంది. వీరిద్దరి పాత్రల చుట్టే కథ ఎక్కువగా సాగుతుంది. డేరింగ్ అండ్ డాషింగ్‌గా కనిపించే మోడ్రన్ అమ్మాయిగా శృతి హాసన్ రోల్ సెకండాఫ్‌కు కీలకంగా నిలిచింది. రుహానీ శర్మ, స్వాసికలవి చిన్న పాత్రలే అయినా డీ గ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్నారు. మురళీశర్మ, గౌతమ్ మీనన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ప్రవీణ్, కోట జయరామ్ తమ అనుభవంతో మెప్పించారు. డైరెక్టర్ పవన్ సాదినేని ఓ గెస్ట్ రోల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు దాదాపు సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు.అగ్ర నిర్మాణ సంస్థలైనా కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావడం బాధాకరం. వంద శాతం ఈ సినిమాకి కావలసిన బడ్జెట్ ఇచ్చి ఉంటే విజువల్ గా సినిమా మరింత గ్రాండియూర్ గా ఉండేది. దర్శకుడు పవన్ సాదినేని మాత్రం కమర్షియల్ లెక్కలు, ట్రెండ్ గురించి ఆలోచించకుండా చాలా నిజాయితీతో ఈ కథను రాసుకున్నాడు. రాతలోనే కాదు తీతలో కూడా ఆ జెన్యూనిటీ కనిపించింది. గుణ్ణం గంగరాజు, వసంత్ జుర్రుల స్క్రీన్ ప్లే తోడై ఒక భావోద్వేగపూరిత రైడ్ ని అందించే ప్రయత్నం చేశారు. కావాలని అనుకుంటే క్రియేటివ్ లిబర్టీ తీసుకొని డ్యూయెట్లు పెట్టవచ్చు. రొమాంటిక్ సీన్లు ఇరికించవచ్చు. కానీ వాటి గురించి దర్శకుడు అస్సలు ఆలోచించలేదు. ఎక్కడ పక్కదారి పట్టకుండా తాను ఏదైనా రాసుకున్నాడో అదే స్క్రీన్‌పై చూపించాడు.
దర్శకుడికి సాంకేతిక నిపుణుల నుంచి మంచి సపోర్ట్ దొరికింది ఓవరాల్ తన వర్క్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.. కథలోని ఎమోషన్‌ను చివరి వరకు క్యారీ చేయడానికి జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్, పాటలు ఉపయోగపడ్డాయి. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అంతరిక్షం ఎపిసోడ్స్ తాలూకు వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్స్ నాచురల్‌గా ఉన్నాయి. బాక్సాఫీస్ పారామీటర్స్ గురించి ఆలోచించకుండా ఇలాంటి కథలతో సినిమా నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రావడం అభినందనీయమే. ఆ విషయంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్‌తో పాటు సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణంలను మెచ్చకోకతప్పదు.
విశ్లేషణ :
ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అంటుంటారు. అలాంటి వాళ్ల కథలు ఎప్పటినుండో వింటున్నాం. కానీ ఆడవాళ్ల విజయాల వెనుక ఉండే మగాళ్ల కథలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఆకాశంలో ఒక తార రెండవ తరహా కథ. తన భార్య కలను నిజం చేయడానికి ఓ భర్త సాగించే నిస్వార్థమైన ప్రయాణం, అతడు చేసే త్యాగాలు, పడే కష్టాలతో ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఈ సినిమా సాగుతుంది. ఇక మొత్తంగా చూస్తే ఈ ‘ఆకాశంలో ఒక తార’ కదిలించే అద్భుతమైన భావోద్వేగాలతో చూసే ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసే మంచి రైడ్ గా నిలిచింది. దర్శకుడు బలంగా అనుకొని ప్లాన్ చేసుకున్న తన సిన్సియర్ అటెంప్ట్ కి దుల్కర్, సాత్వికలు తమ హానెస్ట్ పెర్ఫామెన్స్ లతో జీవం పోసి రక్తి కట్టించారు. వీరితో పాటుగా శృతి హాసన్ అదనపు బలాన్ని అందించింది. ముఖ్యంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథ, కథనాలు ప్రభావం చూపించే డైలాగులు చూసే ఆడియెన్స్ ని మరింత కదిలిస్తాయి, చప్పట్లు కొట్టిస్తాయి. ఆకాశంలో ఒక తార నిజాయితీతో కూడిన విభిన్నమైన ప్రయత్నం. తెలుగులో మంచి సినిమాలు రావడం లేదని విమర్శలకు సమాధానంగా ఈ సినిమా నిలుస్తుంది. వివిధ అవార్డులు రావడం గ్యారెంటీ కానీ కమర్షియల్‌గా ఎంత వరకు హిట్టవుతుందన్నదే అనుమానం. సినిమా చూడటం మిస్ కాకండి!







