మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ చుట్టూ ఈడీ ఉచ్చు.. అరెస్ట్ తప్పదా..?
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ చుట్టూ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ఉదయం ఖానాపూర్లోని ఆమె నివాసంతో పాటు హైదరాబాద్‌లోని నివాసంలోనూ ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీఎంఆర్ ధాన్యం మళ్లింపు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి దిగడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి బియ్యంగా పౌరసరఫరాల సంస్థకు అప్పగించేందుకు ప్రైవేట్ రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు ప్రభుత్వం భారీ ఎత్తున ధాన్యాన్ని కేటాయించింది. అయితే, 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత, నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని సదరు మిల్లు యాజమాన్యం అప్పగించలేదు. భారీ మొత్తంలో బియ్యాన్ని అక్రమంగా బహిరంగ మార్కెట్‌కు తరలించి, పక్కదారి పట్టించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఇలా మాయమైన ధాన్యం, బియ్యం విలువ మార్కెట్లో సుమారు రూ. 40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి
గత ఆగస్టు నెలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏఆర్ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. దీనిపై నిర్మల్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. రూ. 40.96 కోట్ల ప్రజాధనం ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో, స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అక్రమంగా విక్రయించిన బియ్యం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను ఎక్కడికి తరలించారు? బినామీ ఖాతాల్లోకి మళ్లించారా? లేక ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ సోదాల్లో భాగంగా బ్యాంక్ స్టేట్మెంట్లు, మిల్లుకు సంబంధించిన కొనుగోలు, విక్రయ రికార్డులు, డిజిటల్ ఆధారాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖానాపూర్లోని రేఖానాయక్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజిలెన్స్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలను భారీగా మోహరించారు. సోదాలు, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో గత కొంతకాలంగా సీఎంఆర్ బకాయిలు, ధాన్యం మళ్లింపు వ్యవహారాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టిన ఘటనలపై విజిలెన్స్ విచారణలు కొనసాగుతున్న తరుణంలో, ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన మిల్లుపై నేరుగా ఈడీ దాడులు జరగడం మిల్లర్ల వర్గాల్లో గుబులు రేపుతోంది. ఈ కేసులో ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, విచారణలో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







