పుతిన్, జిన్‌పింగ్‌లతో ట్రంప్ స్నేహం వెనుక అసలు కథ ఇదేనా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అంటే ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం. రష్యా, చైనా వంటి దేశాలతో పోటీ పడటంలోనూ, అంతర్జాతీయ వ్యవహారాల్లో తన మాట నెగ్గించుకోవడంలోనూ అమెరికా అధ్యక్షుడి పాత్ర కీలకం. అలాంటిది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన దేశానికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ, ఒకే వేదికపై కనిపిస్తున్నారు. పైగా ఈ ముగ్గురి భేటీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ స్నేహం వెనుక ఉన్నది దౌత్య వ్యూహమా? వ్యక్తిగత ప్రయోజనమా? లేక ట్రంప్‌కు ప్రస్తుతం అత్యవసరంగా మారిన మరో అవసరమా? ట్రంప్‌కు సుదీర్ఘకాలంగా పరిచయమున్న జీవిత చరిత్రకారుడు మైఖేల్ వోల్ఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లాయి. ఆయన విశ్లేషణ ప్రకారం.. ఈ స్నేహం వెనుక కనిపిస్తున్నదంతా ఒకటైతే, అసలు కథ మాత్రం మరొకటి! ఆ కథేంటి
అమెరికాలో తగ్గుతున్న ఆదరణ.. నియంతల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం!
ట్రంప్ ఇప్పుడు అమెరికాలో రాజకీయంగా ఎదురుగాలి ఎదుర్కొంటున్నారని మైఖేల్ వోల్ఫ్ చెబుతున్నారు. ఆయన ప్రజాదరణ రేటింగ్ 30 శాతం దిగువకు పడిపోయింది. ఒకప్పుడు మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే సంకేతాలు ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఆ అంశంపై అంతగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే పుతిన్, జిన్‌పింగ్‌లతో ఆయన సాన్నిహిత్యం పెరగడం ఆసక్తికరంగా మారింది.
వోల్ఫ్ అభిప్రాయం ప్రకారం.. అమెరికాలో తన రాజకీయ ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో ట్రంప్‌కు ఇప్పుడు ప్రపంచ వేదికపై తనను తాను శక్తివంతమైన నాయకుడిగా చూపించుకోవాలనే తపన పెరిగింది. అందుకే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా గుర్తింపు పొందిన పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆయన విశ్లేషించారు. వారి నుంచి లభించే గుర్తింపు ద్వారా తనకూ అదే స్థాయి గౌరవం దక్కుతుందని ట్రంప్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని వోల్ఫ్ అంటున్నారు.
ట్రంప్‌కు గుర్తింపు కావాలా? ప్రత్యర్థులకు గౌరవం పెంచుతున్నారా?
ఇక్కడే అసలు మెలిక ఉంది. ట్రంప్ పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి కనిపించడం ద్వారా తన ఇమేజ్ను పెంచుకోవాలని చూస్తున్నారనుకుందాం. కానీ అదే సమయంలో అమెరికాకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు కూడా అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తోంది. అంటే తన ప్రతిష్ఠను పెంచుకోవాలనే ప్రయత్నంలో ట్రంప్ తన ప్రత్యర్థులకే పెద్ద వేదిక కల్పిస్తున్నారా? అన్నది వోల్ఫ్ లేవనెత్తుతున్న ప్రశ్న.
ఇన్సైడ్ ట్రంప్స్ హెడ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన వోల్ఫ్.. ట్రంప్ తనకంటే ఎక్కువ అధికారాన్ని కలిగి ఉన్న నాయకుల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వారిని కూడా అంతర్జాతీయంగా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారని అన్నారు.
పుతిన్, జిన్‌పింగ్‌లతో ట్రంప్ సాన్నిహిత్యం కేవలం ముగ్గురు నేతలు కలుసుకోవడం, మాట్లాడుకోవడంతో ముగిసిపోయే వ్యవహారం కాదని ఆయన అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి భిన్నమైన పాలనా విధానాలను అనుసరిస్తున్న నేతలతో అమెరికా అధ్యక్షుడు ఇంత బహిరంగంగా స్నేహపూర్వకంగా వ్యవహరించడం పాశ్చాత్య దేశాల్లోనూ చర్చకు దారితీసే పరిణామమని వోల్ఫ్ పేర్కొన్నారు.
షెన్జెన్ భేటీ.. ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది?
నవంబర్ 19న చైనాలోని షెన్జెన్లో జరిగిన ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ల త్రైపాక్షిక సమావేశం ఈ చర్చకు కేంద్రంగా నిలిచింది. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. అమెరికా, రష్యా, చైనా.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ఈ మూడు దేశాల అధినేతలు ఒకే చోట సమావేశం కావడం సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ భేటీని వోల్ఫ్ మరో కోణంలో చూస్తున్నారు. ట్రంప్ పాలనలో అమెరికా విదేశాంగ వైఖరి క్రమంగా మారుతున్నప్పటికీ, ఇప్పుడు పుతిన్, జిన్‌పింగ్‌లతో ఆయన ఇంత బహిరంగంగా సాన్నిహిత్యం ప్రదర్శించడం గతంలో ఎన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ ఇద్దరు నేతలను ప్రజాస్వామ్యానికి ప్రత్యర్థులుగా ఆయన అభివర్ణించారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాశ్చాత్య దేశాల దృష్టిలో అమెరికా ప్రతిష్ఠకు తాను చేస్తున్న నష్టం ట్రంప్‌కు అర్థమవుతోందా? అని పాడ్‌కాస్ట్ సహ-నిర్వాహకురాలు జొవానా కోల్స్ ప్రశ్నించారు. దీనికి వోల్ఫ్ పెద్దగా ఆశాభావం వ్యక్తం చేయలేదు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల సరసన తాను కనిపించాలన్నదే ట్రంప్‌కు ప్రస్తుతం ప్రధాన లక్ష్యంగా ఉందని, ఈ వ్యవహారం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక పరిణామాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని తాను భావించడం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి
పుతిన్, జిన్‌పింగ్‌లు ట్రంప్ బలహీనత కోసం ఎదురుచూస్తున్నారా?
ఇక ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణాన్ని కూడా వోల్ఫ్ ప్రస్తావించారు. ట్రంప్ పుతిన్, జిన్‌పింగ్‌ల నుంచి గుర్తింపు పొందాలని చూస్తుంటే.. ఆ ఇద్దరు నేతలు మాత్రం ట్రంప్ రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కోసం చూస్తుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన చెప్పే మాటలను బట్టి…అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపే విషయంలో పుతిన్, జిన్పింగ్లకు ఇప్పుడు ఎంత ఆసక్తి ఉంటుంది? ముఖ్యంగా ట్రంప్ రాజకీయంగా బలహీనపడుతున్నారని భావిస్తున్న సమయంలో వారు ఎందుకు తొందరపడాలి? ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మరింత రాజకీయ ఒత్తిడికి గురైతే అమెరికా తరఫున చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇలాంటి అంశాలను వారు గమనిస్తూ ఉండవచ్చని వోల్ఫ్ విశ్లేషించారు.
ట్రంప్ ఎంతగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తే, అంతగా ఆయన పరిస్థితిని ఇతర నేతలు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే పుతిన్, జిన్‌పింగ్‌లతో జరిగిన ఈ భేటీని ట్రంప్ బలప్రదర్శనగా కాకుండా, ఆయన రాజకీయ నిరాశను బయటపెట్టే ప్రయత్నంగా వోల్ఫ్ అభివర్ణించారు.
ట్రంప్ ప్రదర్శిస్తున్నది బలమా? లేక గుర్తింపు కోసం ఆరాటమా?
మొత్తానికి ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన ఈ సమావేశం వెనుక ఉన్న రాజకీయ అర్థాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రంప్ తనను తాను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేతల సరసన నిలబెట్టుకోవాలని చూస్తున్నారా? లేక అమెరికా ప్రయోజనాల కోసం కొత్త దౌత్య సంబంధాలకు తెరతీస్తున్నారా? అనేది వేరే విషయం. కానీ మైఖేల్ వోల్ఫ్ మాత్రం ఈ సాన్నిహిత్యం వెనుక ట్రంప్‌కు అవసరమైన వ్యక్తిగత గుర్తింపు, రాజకీయ ప్రతిష్ఠ కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని చూస్తున్నారు. ఏదైమైనా ఈ ముగ్గురి భేటీ ఫొటోల వెనుక ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పెద్ద కథే దాగి ఉందన్నది మాత్రం స్పష్టం.







