అసమ్మతి నేతలపై ఇక ఎదురుదాడే..!?
అధికార పార్టీ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ మాటల యుద్ధానికి దారితీశాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం గాంధీ భవన్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో అసమానతలు ఉన్నాయంటూ ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గళం విప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి పనితీరును ప్రశ్నించారు. కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా భూముల వ్యవహారాలు, కాంట్రాక్టుల అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు విడుదలవుతున్నాయని ఆరోపిస్తూ, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించడం పార్టీలో కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి
ఇన్నాళ్లూ సొంత పార్టీ నేతల విమర్శలపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురువారం సిద్దిపేట సభలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎవరి పేర్లనూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, అసమ్మతి నేతలను ఉద్దేశించి ఆయన తీవ్ర పదజాలం వాడారు. “మా వాళ్లలో కొందరికి పిచ్చికుక్క కరిచినట్లుంది.. ఏదేదో మాట్లాడుతున్నారు. మంచిని ఇంటికొచ్చి చెవిలో చెప్తూ, చెడును మైకుల్లో ప్రచారం చేస్తున్నారు” అంటూ సీఎం ఎద్దేవా చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగ విమర్శలు చేసే వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తారని ఆయన హెచ్చరించడం సంచలనంగా మారింది.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న బహిరంగ విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణా కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు, గతంలో కొండా సురేఖ విషయంలో వ్యవహరించిన తరహాలోనే అందరికీ ఒకే నిబంధన వర్తింపజేయాలని పార్టీలోని బీసీ నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం టీపీసీసీ పంపిన నివేదిక ఆధారంగా ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల వ్యాఖ్యలను సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వేళ, ఈ అంతర్గత కుమ్ములాటలకు అధిష్టానం షోకాజ్ నోటీసులతో ముగింపు పలుకుతుందా లేక సస్పెన్షన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.







