హరీశ్ రావు టార్గెట్‌గా రేవంత్ ‘పొలిటికల్ బాంబ్’!
తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలడం కొత్తేమీ కాదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సొంత ఇలాకా సిద్దిపేట వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉండరని, ఆయన ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ సమాజంలో దైవభక్తికి, ప్రమాణాలకు ఉన్న విలువను రేవంత్ రెడ్డి తన రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు. సిద్దిపేట ప్రజలకు ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి సాక్షిగా, తాను బీజేపీ నేతలతో టచ్‌లో లేనని ప్రమాణం చేయగలరా అంటూ హరీశ్ రావుకు నేరుగా సవాల్ విసిరారు. ఒకవేళ అబద్ధపు ప్రమాణం చేస్తే సర్వనాశనం అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, మామ కేసీఆర్‌కు హరీశ్ వెన్నుపోటు పొడవబోతున్నారని వ్యాఖ్యానించడం ద్వారా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.
దీని వెనుక రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత పార్టీలో అత్యంత క్రియాశీలకంగా, ప్రభుత్వాన్ని నిత్యం ఇరుకున పెట్టే నేతగా హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన విశ్వసనీయతపై దెబ్బకొట్టడం ద్వారా, బీఆర్ఎస్ అధిష్టానానికి, హరీశ్ రావుకు మధ్య అనుమాన బీజాలు నాటాలన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీలో హరీశ్ రావును ఒంటరి చేయడం ద్వారా ప్రతిపక్షం పోరాట పటిమను బలహీనపరచవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సిద్దిపేట హరీశ్ రావుకు కంచుకోట. అలాంటి చోట నిలబడి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా స్థానిక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు రేవంత్. హరీశ్ రావు మళ్లీ మంత్రి కావాలనుకుంటున్నది కేవలం తన స్వార్థం కోసమేనని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్‌లతో కలిసి నడిచిన సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి వంటి నేతల కుటుంబాలు నేడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, బీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం కోట్లు కూడబెట్టుకున్నారని రేవంత్ ఆరోపించారు. తద్వారా ఉద్యమకారుల సెంటిమెంట్‌ను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సీనియర్ ప్రతిపక్ష నేతపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం వెనుక బలమైన సమాచారం ఉందా లేక ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో కేసీఆర్ తన రాజకీయ గురువు మదన్మోహన్ రావును, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను మోసం చేశారని, కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడని రేవంత్ చేసిన వ్యాఖ్యలు చరిత్రను గుర్తుచేసే ప్రయత్నంగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే సిద్దిపేట సభ ద్వారా రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వ్యవహరించారు. ఒకవైపు బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోస్తూనే, మరోవైపు రాబోయే ఎన్నికల కోసం సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ఇప్పటి నుంచే బలమైన పునాది వేసే ప్రయత్నం చేశారు. రేవంత్ విసిరిన ఈ సవాల్‌పై హరీశ్ రావు ఏ విధంగా స్పందిస్తారనే దానిపైనే తెలంగాణ తదుపరి రాజకీయ సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి.







