రోజా పొలిటికల్ రీ ఎంట్రీ.. సొంత పార్టీ నేతలతోనే తలనొప్పి..
రాజకీయాల్లో ఒకసారి రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం ఏ నాయకుడికైనా అంత సులభం కాదు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించిన నేతలకు ఓటమి తర్వాత కూడా అదే స్థాయిలో కొనసాగాలనే ఆశ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ (YSRCP) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) రాజకీయ ప్రయాణంలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా రాజకీయంగా మళ్లీ బలపడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే సొంత పార్టీలోనే కొందరు నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం ఆమెకు కొత్త సవాలుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు నగరి (Nagari) నియోజకవర్గం నుంచి రాజకీయంగా ఎదిగిన రోజా, వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ టెలివిజన్ రియాలిటీ షోలపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల నగరిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఆమెను మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చాయి. చిత్తూరు జిల్లా (Chittoor District) విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినప్పటికీ, అధికారులు ఫలితాన్ని తారుమారు చేసి టీడీపీ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని రోజా ఆరోపించారు. దీనిని నిరసిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె కారులో ఉండి నినాదాలు చేయడం, భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ నిరసన సమయంలో తన వ్యక్తిగత సిబ్బందితో రోజా వ్యవహరించిన తీరు మరో వివాదానికి కారణమైంది. సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని నీళ్లు పొరపాటున ఆమెపై పడటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. బాటిల్‌తో సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం పోలీసులు ఆమెను ఎస్కార్ట్‌తో ఇంటికి చేర్చారు.
ఇదిలా ఉంటే రోజా రాజకీయంగా చిత్తూరు జిల్లాపై మరింత పట్టు సాధించాలని చూస్తున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాలో కీలకంగా ఉన్న కొందరు నాయకులు ప్రస్తుతం రాజకీయంగా బలహీనపడటం, వివిధ కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఆ ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
కానీ ఇక్కడే ఆమెకు సొంత పార్టీ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. రోజా ఎదుగుదలను ఇష్టపడని కొందరు వైసీపీ నేతలు ఆమెకు రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని, అంతర్గతంగా వ్యతిరేక వర్గం పనిచేస్తోందని చర్చ జరుగుతోంది. తనను సొంత పార్టీ నాయకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోజా కూడా అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనను అణచివేస్తున్నారంటూ ఆమె విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.
మొత్తానికి రోజా ముందు ఇప్పుడు రెండు సవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఓటమి తర్వాత తిరిగి రాజకీయంగా బలపడటం, మరోవైపు పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఎదుర్కోవడం. చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేయాలనే ఆమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది.







