అమెరికా డ్రీమ్స్‌కు వీసా బ్రేక్! మన స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా?
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఒకప్పుడు అమెరికా, బ్రిటన్ అంటేనే మొదటి గుర్తొచ్చే దేశాలు. మంచి యూనివర్సిటీలు, నాణ్యమైన విద్య, చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు.. ఇలా ఎన్నో ఆశలతో లక్షలాది మంది ఈ దేశాల బాట పట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. అమెరికా, బ్రిటన్లలో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, అక్కడి వీసా నిబంధనలు, ఆంక్షలు చూస్తుంటే చాలామంది విద్యార్థులు వెనక్కి తగ్గుతున్నారు. ‘ఇన్ని కష్టాలు పడి అక్కడికే వెళ్లాలా? మరో దేశాన్ని ఎంచుకుంటే బాగుంటుంది కదా!’ అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఏ దేశాలను ఎంచుకుంటున్నారో చూద్దాం.
అమెరికా, బ్రిటన్లకు తగ్గుతున్న క్రేజ్!
ఈ మార్పు ఏదో చిన్న స్థాయిలో జరుగుతున్నది కాదు. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లోని 437 యూనివర్సిటీలను పరిశీలించి నిర్వహించిన తాజా సర్వేలోనూ ఇదే విషయం బయటపడింది. 2026 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కొత్తగా చేరిన విదేశీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్యను గత ఏడాదితో పోల్చి చూస్తే.. బ్రిటన్‌లో ఏకంగా 19 శాతం, అమెరికాలో 13 శాతం తగ్గింది. అంటే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఈ రెండు దేశాలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయన్నమాట. కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ కూడా విద్యార్థుల నుంచి గతంలో ఉన్నంత ఆసక్తి కనిపించడం లేదు. ముఖ్యంగా అమెరికాలోని యూనివర్సిటీలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాయి. మూడింట ఒక వంతు కంటే ఎక్కువ విద్యాసంస్థలు రాబోయే రోజుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
ఆసియా, యూరప్ వైపు ఎందుకు చూస్తున్నారు?
అమెరికా, బ్రిటన్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే.. ఆసియా, యూరప్ దేశాల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అక్కడి యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పీజీ చదవాలనుకునే విద్యార్థుల విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి నాలుగు ప్రధాన దేశాల్లో 62 శాతం యూనివర్సిటీలు విదేశీ పీజీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని చెబుతున్నాయి.
అదే మిగతా దేశాల్లో ఈ పరిస్థితి 27 శాతానికే పరిమితమైంది. ఆసియా, యూరప్‌లోని యూనివర్సిటీల్లో సగం సంస్థలు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల చేరికలు పెరిగాయని తెలిపాయి. పీజీ విద్యార్థుల చేరికల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసియాలో 59 శాతం విద్యాసంస్థలు విదేశీ పీజీ విద్యార్థుల సంఖ్య పెరిగిందని వెల్లడించాయి. ఇక్కడ సగటు వృద్ధి 7 శాతంగా ఉండటం గమనార్హం. అంటే ఒకప్పుడు అమెరికా, బ్రిటన్లకే ప్రాధాన్యత ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి అవకాశాలను వెతుక్కుంటున్నారన్నమాట.
చదువుకోవాలనే ఆసక్తి ఉంది.. కానీ వీసా చిక్కులేంటి?
విదేశీ విద్యకు వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది వీసా ప్రక్రియే. యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా, ఫీజులు కట్టినా వీసా వస్తుందో లేదో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. తాజా సర్వేలో పాల్గొన్న విద్యాసంస్థల్లో 73 శాతం సంస్థలు ప్రభుత్వ విధానాలు, వీసా నిబంధనలే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ప్రధాన అడ్డంకులుగా మారాయని చెప్పాయి.
వీసా రావడానికి ఎక్కువ సమయం పట్టడం, అదనపు తనిఖీలు, కఠినమైన ఇంటర్వ్యూలు, చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశాలపై ఆంక్షలు.. ఇవన్నీ విద్యార్థుల ప్రణాళికలను దెబ్బతీస్తున్నాయి. కొందరు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటుంటే, మరికొందరు అసలు విదేశాలకు వెళ్లాలన్న ఆలోచననే పక్కన పెడుతున్నారు. ఇక విదేశీ చదువుల ఖర్చులు కూడా తక్కువేమీ కాదు కదా! ఫీజులు, వసతి, రోజువారీ ఖర్చులు అన్నీ కలిపి చూస్తే ఆర్థిక భారం పెరిగిపోతోంది. అందుకే సర్వేలో పాల్గొన్న 46 శాతం విద్యాసంస్థలు ఖర్చులను కూడా మరో ప్రధాన సమస్యగా పేర్కొన్నాయి.
అమెరికాలో మరింత కఠినంగా మారుతున్న పరిస్థితులు!
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, వీసాలపై అదనపు తనిఖీలు నిర్వహించడం, వేల సంఖ్యలో వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు, విద్యార్థులు అమెరికాలో ఎంతకాలం ఉండవచ్చనే నిబంధనలను కూడా కఠినతరం చేసింది. దీంతో అక్కడ చదువుకోవాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్రిటన్‌లోనూ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు!
బ్రిటన్ పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను డిపెండెంట్లుగా తీసుకెళ్లే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం చాలావరకు పరిమితం చేసింది. అంతేకాదు, చదువు పూర్తయిన తర్వాత బ్రిటన్‌లో ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే గ్రాడ్యుయేట్ వీసా గడువును తగ్గించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. దీంతో చదువుతో పాటు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకుని స్థిరపడాలనుకునే విద్యార్థులు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు.
విదేశీ విద్యకు కొత్త గమ్యస్థానాలు సిద్ధమవుతున్నాయా?
ఇప్పటివరకు విదేశీ విద్య అనగానే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు విద్యార్థులు తమ ఎంపికలను విస్తరిస్తున్నారు. వీసా సులభంగా వస్తుందా? చదువుకు ఎంత ఖర్చవుతుంది? చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసే అవకాశం ఉందా? అక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నింటినీ బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఆసియా, యూరప్ దేశాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







