నమ్ముతారా? ఈ పుస్తకం ఖరీదు 13 కోట్లు… ఏముంది ఇందులో ?
ఒక పుస్తకం ఖరీదు ఎంతుంటుంది? వందో, వెయ్యో, మహా అయితే లక్ష రూపాయలో అనుకుంటాం. కానీ ఓ పుస్తకం ధర మాత్రం ఏకంగా రూ.13 కోట్లు! అదీ కొత్తగా ప్రచురించిన పుస్తకమో, ప్రముఖ రచయిత రాసిన బెస్ట్ సెల్లరో కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం చేతితో చిత్రాలతో రూపొందించిన ఓ అరుదైన పుస్తకం. అందులో ఉన్నది ఏమిటంటే.. ఆకాశంలో ఐదు సూర్యులు కనిపించడం, రక్తంలా ఎర్రగా మారిన చంద్రుడు, వింత జీవులు, ప్రకృతి విపత్తులు వంటి ఆశ్చర్యకరమైన దృశ్యాలు. ఇంతకీ ఈ పుస్తకంలో అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకింత భారీ ధర పలకబోతోంది?
500 ఏళ్ల నాటి అద్భుత చిత్రాల పుస్తకం!
ఈ అరుదైన పుస్తకం పేరు ‘బుక్ ఆఫ్ మిరాకిల్స్’ (Book of Miracles). జర్మనీలోని ఆగ్స్‌బర్గ్ నగరంలో సుమారు 1552లో దీనిని రూపొందించారు. ‘ఆగ్స్బర్గర్ వుండర్జైకెన్బుచ్’ (Augsburger Wunderzeichenbuch) అని కూడా పిలిచే ఈ పుస్తకంలో మొత్తం 167 రంగుల చిత్రాలు ఉన్నాయి.
సృష్టి ఆరంభం నుంచి బైబిల్ కథలు, ప్రాచీన చరిత్ర, మధ్యయుగ ఘటనల వరకు ఎన్నో అంశాలను ఇందులో చిత్రీకరించారు. చివరగా ప్రపంచ అంతానికి సంబంధించిన అపోకలిప్స్ దృశ్యాలతో పుస్తకం ముగుస్తుంది.
ఆకాశంలో ఐదు సూర్యులు.. రోమ్‌లో రక్తపు వర్షం!
ఈ పుస్తకంలోని కొన్ని చిత్రాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1551లో జర్మనీలోని లైప్జిగ్ నగరంపై ఒకేసారి ఐదు సూర్యులు కనిపించినట్లు ఇందులో చిత్రీకరించారు. అయితే, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అది నిజంగా ఐదు సూర్యులు కనిపించడం కాదు. సూర్యుడి చుట్టూ కాంతి ప్రతిబింబాల వల్ల ఏర్పడే ‘సన్ డాగ్’ (Sun Dog) అనే వాతావరణ కు చెందిన విషయం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
అలాగే 1456లో రోమ్ నగరంలో రక్తంలా కనిపించే వర్షం కురిసినట్లు, 1552లో నెదర్లాండ్స్‌లోని డోర్డ్రెక్ట్ ప్రాంతంలో భారీ వడగళ్ల వర్షం పడినట్లు చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు భూకంపాలు, మిడతల దండయాత్రలు, డ్రాగన్లు, అసాధారణ ఆకారాలతో జన్మించిన జీవుల చిత్రాలు కూడా ఉన్నాయి.
అప్పటి కాలానికి ఇదొక సోషల్ మీడియా!
ఈ పుస్తకంపై క్రిస్టీస్ సంస్థకు చెందిన మధ్యయుగ, పునరుజ్జీవన కాలపు మాన్యుస్క్రిప్ట్ నిపుణుడు యుజెనియో డొనడోనీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇలాంటి వింతల పుస్తకాలు ప్రజల్లో సంచలనం సృష్టించే సమాచార మాధ్యమాలుగా పనిచేసేవని చెప్పారు.
నేటి కాలంలో సోషల్ మీడియాలో వింతలు, ఆశ్చర్యకరమైన వార్తలను వరుసగా చూస్తూ స్క్రోల్ చేస్తుంటాం కదా.. సరిగ్గా అలాంటి అనుభూతినే 16వ శతాబ్దంలో ఈ పుస్తకం కలిగించేదని ఆయన అభివర్ణించారు. నిజంగా జరిగిన సంఘటనలను నమోదు చేయడంతో పాటు, వాటి వెనుక ఉన్న కారణాలను అప్పటి ప్రజలు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారో ఈ పుస్తకం తెలియజేస్తుందని వివరించారు.
ఇవి కూడా చదవండి
కోట లైబ్రరీ నుంచి కోట్ల రూపాయల వేలం వరకు!
దాదాపు ఐదు శతాబ్దాల పాటు ఈ పుస్తకం ఉనికి గురించి పరిశోధకులకు కూడా తెలియదు. చివరకు దక్షిణ జర్మనీలోని ఓ చిన్న బరోక్ కోట లైబ్రరీలో ఇది వెలుగులోకి వచ్చింది.
2008లో ఆ కోటలోని వస్తువులతో పాటు ఈ పుస్తకాన్ని కూడా మ్యూనిచ్‌లో వేలం వేశారు. అప్పట్లో దీనికి 1,27,500 యూరోల ధర లభించింది. అనంతరం 2010లో లండన్‌కు చెందిన పుస్తకాల వ్యాపారి జేమ్స్ ఫేబర్ దీనిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన కలెక్టర్ మిక్కీ కార్టిన్ సేకరణలోకి చేరింది.
2013లో టాస్చెన్ (Taschen) సంస్థ ఈ పుస్తకానికి ప్రతిరూప ఎడిషన్‌ను ప్రచురించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది.
ధర అక్షరాలా రూ.13 కోట్లు!
ఇప్పుడు ఈ అరుదైన పుస్తకమే అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ దీనిని డిసెంబర్ 10న లండన్‌లో వేలం వేయనుంది. దీని ధర 7 లక్షల నుంచి 10 లక్షల పౌండ్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.8.6 కోట్ల నుంచి రూ.12.3 కోట్ల వరకు! గరిష్ఠ అంచనా ప్రకారం దాదాపు రూ.13 కోట్లు పలకనుందన్నమాట.
మిక్కీ కార్టిన్ సేకరణ నుంచి వస్తున్న ‘యాన్ ఆల్కెమీ ఆఫ్ ఐడియాస్’ (An Alchemy of Ideas) పేరుతో ఈ పుస్తకాన్ని వేలానికి తీసుకొస్తున్నారు. డిసెంబర్ 4 నుంచి 10 వరకు లండన్‌లోని క్రిస్టీస్ ప్రదర్శనశాలలో సందర్శకులు దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ వేలంలో మరికొన్ని అరుదైన పుస్తకాలు, కళాఖండాలు కూడా ఉన్నాయి. 1940లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రాసిన ఫీల్డ్ థియరీకి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్, గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన భౌగోళిక పటాల పుస్తకం ఒక్కొక్కటి 3 లక్షల నుంచి 4 లక్షల పౌండ్ల వరకు ధర పలకవచ్చని అంచనా. 1583లో జార్జ్ బార్టిష్ రాసిన కంటి శస్త్రచికిత్సకు సంబంధించిన పుస్తకానికి 70 వేల నుంచి లక్ష పౌండ్ల వరకు ధర రావచ్చని భావిస్తున్నారు.
మిక్కీ కార్టిన్ సేకరణలోని మొత్తం 80కి పైగా కళాఖండాలను లండన్, పారిస్, న్యూయార్క్ నగరాల్లో 10కి పైగా వేలాల ద్వారా 2027 జులై వరకు విక్రయించనున్నారు. వీటి ద్వారా సుమారు 80 లక్షల డాలర్ల విలువైన అమ్మకాలు జరగవచ్చని క్రిస్టీస్ అంచనా వేస్తోంది.
అంచనాలకు మించి ధర పలుకుతుందా?
ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసిన ఆచెన్‌లోని సుర్మోంట్-లుడ్విగ్ మ్యూజియం డైరెక్టర్ టిల్-హోల్గర్ బోర్చెర్ట్ మాత్రం దీని విలువ మరింత ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. క్రిస్టీస్ నిర్ణయించిన 10 లక్షల పౌండ్ల గరిష్ఠ అంచనా కూడా చాలా తక్కువేనని, వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇది మనతో, మన తరంతో మాట్లాడుతుంది’ అంటూ ఈ పుస్తక ప్రాధాన్యతను వివరించారు.
ఏదైమైనా…
ఓ పుస్తకం విలువ దాని పేజీల సంఖ్యలోనో, అక్షరాల్లోనో ఉండదని ఈ ‘బుక్ ఆఫ్ మిరాకిల్స్’ మరోసారి నిరూపిస్తోంది. ఐదు శతాబ్దాల క్రితం ప్రపంచాన్ని చూసిన తీరు, అప్పటి ప్రజల నమ్మకాలు, ప్రకృతిపై వారి పరిశీలనలు.. ఇవన్నీ 167 చిత్రాల రూపంలో ఇందులో భద్రంగా ఉన్నాయి. అందుకే ఇది కేవలం పుస్తకం కాదు.. చరిత్రను కళ్లముందు నిలిపే ఓ అరుదైన కళాఖండం. మరి వేలంలో నిజంగానే రూ.13 కోట్లు దాటుతుందా? లేక అంచనాలను మించి మరింత భారీ ధర పలుకుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







