తక్కువగా మాట్లాడేవారి మనస్తత్వం వెనుక.. సైకాలజీ చెప్పే ఆసక్తికర విషయాలివే!
కొందరు ఎక్కడికి వెళ్లినా అందరితో కలిసిపోతూ సరదాగా మాట్లాడుతుంటారు. మరికొందరు మాత్రం ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. పార్టీలకు (Parties) వెళ్లినా, స్నేహితుల మధ్య ఉన్నా ఎక్కువగా మాట్లాడకుండా ఒక మూలన కూర్చుని పరిసరాలను గమనిస్తుంటారు. అలాంటి వారిని చాలామంది బిడియస్తులుగా, కలుపుగోలుతనం లేనివారిగా భావిస్తారు. కానీ మౌనంగా ఉండే ప్రతి ఒక్కరూ ఒకే రకమైన మనస్తత్వం కలిగి ఉండరు. వారి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం (Personality), భావాలను వ్యక్తపరిచే తీరు భిన్నంగా ఉంటాయి. అసలు తక్కువగా మాట్లాడే వ్యక్తుల ప్రవర్తన వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాం.
మౌనంగా ఉండేవారి ఆలోచనలు, వ్యక్తిత్వ లక్షణాలు ఇవే!

మౌనంగా ఉండేవారు ఎక్కువగా విషయాలను గమనించడానికి ఇష్టపడతారు. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? చుట్టూ ఏం జరుగుతోంది? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. వెంటనే స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే తమ అభిప్రాయాన్ని చెబుతారు. అందుకే కొన్నిసార్లు వీరు మాట్లాడే మాటలు ఆలోచనాత్మకంగా ఉంటాయి.
మరికొందరు తమ వ్యక్తిగత విషయాలను (Personal Matters) అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. సంతోషం, బాధ, కోపం వంటి భావాలను బయటపెట్టకుండా తమలోనే ఉంచుకుంటారు. ప్రతి ఒక్కరితో త్వరగా స్నేహం చేయడం కంటే కొద్దిమందితోనే బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇవి కూడా చదవండి
తక్కువగా మాట్లాడే వ్యక్తులకు ఒంటరిగా గడిపే సమయం కూడా ఇష్టంగా ఉండవచ్చు. పుస్తకాలు (Books) చదవడం, సంగీతం (Music) వినడం, ప్రకృతిని ఆస్వాదించడం, తమకు నచ్చిన పనులు చేసుకోవడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. ఎక్కువ మంది మధ్య గడిపిన తర్వాత కొంత సమయం ఒంటరిగా ఉండాలని కోరుకోవచ్చు. దీనిని ఇతరులకు దూరంగా ఉండాలనే భావనగా చూడకూడదు. కొందరికి ఇది మానసికంగా తిరిగి ఉత్సాహం పొందే మార్గం.
మౌనంగా ఉండేవారిని అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి!

ఇలాంటి వ్యక్తులు మాట్లాడే ముందు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉండవచ్చు. ఎదుటివారిని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదని భావిస్తారు. అందుకే అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తుంటారు. అయితే ప్రతి విషయాన్ని మనసులోనే దాచుకోవడం వల్ల కొన్నిసార్లు తమ భావాలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోవచ్చు.
మౌనంగా ఉండేవారిని తక్కువ అంచనా వేయడం కూడా సరైంది కాదు. కొందరు సహజంగానే ప్రశాంతంగా ఉంటే, మరికొందరు గత అనుభవాలు, ఆత్మవిశ్వాసం లోపం, సామాజిక ఒత్తిడి (Social Pressure) లేదా మానసిక అలసట కారణంగా తక్కువగా మాట్లాడవచ్చు. కాబట్టి మౌనం ఒక్కటే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నిర్ణయించదు.
ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలకు సమయం ఇవ్వాలి. బలవంతంగా మాట్లాడించకుండా, వారు సౌకర్యంగా భావించే వాతావరణాన్ని కల్పించాలి. ప్రతి ఒక్కరూ తమ భావాలను ఒకే విధంగా వ్యక్తపరచలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మాట్లాడేవారే తెలివైనవారు కాదు.. తక్కువగా మాట్లాడేవారే అంతర్ముఖులు (Introverts) అని కూడా చెప్పలేం. ఒక వ్యక్తి అసలు స్వభావాన్ని తెలుసుకోవాలంటే వారి మాటల కంటే ప్రవర్తన, ఆలోచనలు, ఇతరులతో వ్యవహరించే తీరును గమనించడం ముఖ్యం.







