ట్రంప్‌కు అసలు సినిమా ఇప్పుడే మొదలు! కొడుకులు, అల్లుడు, జేడీ వాన్స్.. అందరికీ డెమోక్రాట్ల నోటీసులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లూ తన రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. తనను విమర్శించినవాళ్లపై ఎదురుదాడి చేయడం, విచారణలకు ఆదేశించడం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం.. ఇలా తనదైన శైలిలో దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ట్రంప్‌కు అండగా నిలిచినవాళ్లే ఇప్పుడు విచారణల ఉచ్చులో చిక్కుకునే పరిస్థితి వస్తోంది. ఆయన కొడుకులు, అల్లుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రభుత్వంలోని అత్యంత కీలక వ్యక్తులపై కూడా డెమోక్రాట్లు గురిపెట్టారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ట్రంప్‌ను నేరుగా టార్గెట్ చేయడం కంటే, ఆయన చుట్టూ ఉన్నవాళ్ల వ్యాపారాలు, పెట్టుబడులు, ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న సంబంధాలను బయటకు లాగాలని డెమోక్రాట్లు చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 12 నోటీసులు పంపించారు. వచ్చే ఏడాది నుంచి అమెరికా ప్రతినిధుల సభలో తమకు వచ్చే మెజారిటీని ఉపయోగించుకుని ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు భారీ వ్యూహమే సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ట్రంప్ కుటుంబ వ్యాపారాలే మొదటి టార్గెట్!
ఈ మొత్తం వ్యవహారానికి తెరతీసింది కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ఎంపీ రాబర్ట్ గార్సియా. ప్రస్తుతం హౌస్ ఓవర్‌సైట్ కమిటీలో డెమోక్రాట్ల తరఫున కీలక స్థానంలో ఉన్న ఆయన, వచ్చే ఏడాది కొత్త కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ కమిటీకి అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వంలో అవినీతి, అధికార దుర్వినియోగం, అనుమానాస్పద నిర్ణయాలపై విచారణ జరిపే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. అందుకే ఆయన ఇప్పటి నుంచే ఎవరెవరిని విచారించాలి? ఏయే అంశాలను బయటకు తీయాలి? అనే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
ముందుగా ఆయన దృష్టి పడింది ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లపై. వీరిద్దరికీ సంబంధించిన క్రిప్టో వ్యాపారం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఇప్పుడు డెమోక్రాట్ల విచారణలో కీలక అంశం కాబోతోంది. ముఖ్యంగా 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దికాలం ముందే ఈ సంస్థలో భారీ వాటాను యూఏఈ పెట్టుబడిదారులకు విక్రయించడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ డీల్ వెనుక అసలు కథ ఏమిటి? ట్రంప్ అధ్యక్ష పదవికి, ఆయన కుటుంబ వ్యాపారాలకు మధ్య ఏమైనా సంబంధాలున్నాయా? అన్నది పరిశీలించాలని గార్సియా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ కొడుకులకు పంపిన లేఖల్లో ఆయన చేసిన ఆరోపణలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. తండ్రి అధ్యక్ష పదవిని ఉపయోగించుకుని వ్యక్తిగతంగా భారీ స్థాయిలో లాభాలు పొందేందుకు వ్యాపారాలు చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ట్రంప్ ప్రభుత్వంతో కాంట్రాక్టులు లేదా ప్రత్యేక ప్రయోజనాలు పొందాలని చూసే సంస్థలు ఆయన కుటుంబంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుంటున్నాయా? అన్న కోణంలోనూ విచారణ జరగవచ్చని సంకేతాలిచ్చారు.
అయితే ట్రంప్ జూనియర్ మాత్రం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో తమ కుటుంబం ఉందని వ్యాపారాలు మానేసి, ఎనిమిదేళ్లు లేదా పన్నెండేళ్లు ఒక మూలన కూర్చోవాలా? అంటూ ఇటీవల ఆక్సియోస్ నిర్వహించిన కార్యక్రమంలో ఎదురు ప్రశ్నించారు. కానీ డెమోక్రాట్లు అడుగుతున్న ప్రశ్న వేరు. వ్యాపారాలు చేసుకోవడంపై తమకు అభ్యంతరం లేదని, అధ్యక్షుడి కుటుంబానికి ఉండే రాజకీయ పలుకుబడి ఆ వ్యాపారాలకు అదనపు ప్రయోజనంగా మారుతోందా? అన్నదే తేల్చాలనుకుంటున్నారు.
అల్లుడు కుష్నర్ పెట్టుబడులపైనా ఆరా!
ట్రంప్ కుటుంబంలో మరో కీలక వ్యక్తి జారెడ్ కుష్నర్. ట్రంప్ అల్లుడిగా మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత నమ్మకమైన సలహాదారుగా కూడా కుష్నర్కు గుర్తింపు ఉంది. మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌కు సంబంధించిన శాంతి చర్చల్లో ట్రంప్ ప్రభుత్వం తరఫున ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే ప్రైవేట్ ఈక్విటీ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
ఇక్కడే డెమోక్రాట్లకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవైపు అమెరికా ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి.. మరోవైపు అదే దేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రయోజనాల సంఘర్షణ తలెత్తదా? ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఆయన వ్యక్తిగత పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం లేదా? అన్నది గార్సియా పరిశీలించాలనుకుంటున్నారు.
అయితే గతంలో ఈ విమర్శలపై స్పందించిన కుష్నర్, ఇతరులు ప్రయోజనాల సంఘర్షణగా చూసే విషయాలను తాను ప్రపంచవ్యాప్తంగా ఏర్పరచుకున్న అనుభవం, నమ్మకమైన సంబంధాలుగా భావిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ వివరణతో డెమోక్రాట్లు సంతృప్తి చెందుతారా? లేక ఆయన పెట్టుబడులపై మరింత లోతుగా ఆరా తీస్తారా? అనేది చూడాలి.
వలసదారుల విషయంలోనూ ట్రంప్ టీమ్‌కు ఇబ్బందులు తప్పవా?
ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న డెమోక్రాట్లకు కుటుంబ వ్యాపారాలే ఏకైక అంశం కాదు. ఆయన చేపట్టిన అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమం కూడా విచారణల జాబితాలో ఉంది. ముఖ్యంగా ఈ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ మిల్లర్‌కు గార్సియా నోటీసులు పంపించారు. ఇటీవలే వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన మిల్లర్, ట్రంప్ వలస విధానానికి ప్రధాన రూపకర్తగా గుర్తింపు పొందారు.
అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని భారీ సంఖ్యలో దేశం నుంచి పంపించాలన్న ట్రంప్ నిర్ణయం అమలులో హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ చర్యలు చట్టపరమైన పరిధిలోనే జరుగుతున్నాయా? వలసదారుల హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయా? అన్నది డెమోక్రాట్లు పరిశీలించాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, పర్యవేక్షించడం, సమర్థించడం వంటి అంశాలకు సంబంధించిన తన సమాచారాన్ని భద్రపరచాలని మిల్లర్‌ను గార్సియా కోరారు.
జేడీ వాన్స్కూ తప్పని ఎప్స్టీన్ ఫైల్స్ సెగ!
ఇక ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతున్న అంశం జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. అమెరికాలో ఇప్పటికే పెద్ద వివాదంగా మారిన ఈ ఫైల్స్ విడుదల విషయంలో ట్రంప్ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరింత లోతుగా తవ్వాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా వదల్లేదు.
గత ఏడాది వైట్‌హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో జరిగిన కొన్ని సమావేశాల్లో వాన్స్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశాలు ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారానికి సంబంధించినవేనని గార్సియా ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఆ ఫైల్స్ విడుదల కాకుండా చూడటానికి, ట్రంప్‌పై వచ్చే విమర్శలను తప్పించడానికి ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయా? అన్నది ఆయన లేవనెత్తుతున్న ప్రశ్న. అందుకే ఈ సమావేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలను డిసెంబర్ 2లోగా అందించాలని వాన్స్‌కు లేఖ రాశారు.
అంతేకాదు, అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్‌ను కూడా గార్సియా ప్రశ్నిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్‌ను ప్రజలకు విడుదల చేసే క్రమంలో జరిగిన పొరపాట్లు, వాటిని సరిదిద్దిన విధానం, ఎప్స్టీన్కు సన్నిహితురాలైన గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తక్కువ భద్రత కలిగిన జైలుకు ఎందుకు తరలించారనే అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్ సమాచారం కోరింది. అయితే న్యాయశాఖ ఆ సమాచారాన్ని పూర్తిగా అందించలేదని గార్సియా ఆరోపిస్తున్నారు. గతంలో తన విచారణ సందర్భంగా బ్లాంచ్ మాత్రం ఫైల్స్ విడుదలలో జరిగిన తప్పులు ఉద్దేశపూర్వకమైనవి కావని, వాటిని గుర్తించిన వెంటనే సరిచేశామని సమర్థించుకున్నారు.
డెమోక్రాట్లపై ఎదురుదాడికి దిగిన ట్రంప్ టీమ్!
అయితే డెమోక్రాట్లు ఈ విచారణలకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్ టీమ్ కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అసలు విచారణలు మొదలుకాకముందే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. గత వారం వైట్‌హౌస్ న్యాయ సలహాదారు విల్ షార్ఫ్, కాంగ్రెస్ డెమోక్రాట్లకు గట్టి హెచ్చరిక పంపించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ విచారణలను ఉపయోగించుకుంటే, చట్టవిరుద్ధమైన సమన్లు జారీ చేస్తే వాటిపైనా చర్యలు తీసుకోవాల్సి రావచ్చని హెచ్చరించారు.
మరోవైపు టెక్సాస్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కు చెందిన అమెరికా అటార్నీ ఆరోన్ రీట్జ్ కూడా రాబర్ట్ గార్సియాకు లేఖ రాశారు. ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి కాంగ్రెస్ విచారణలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో, గార్సియాపై క్రిమినల్ విచారణ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి గార్సియా కూడా గట్టిగానే బదులిచ్చారు. ఇవన్నీ రాజకీయ బెదిరింపులేనని, తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఇక్కడే అసలు రాజకీయ పోరు మొదలవుతోంది. ఒకవైపు ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించుకుని డెమోక్రాట్ల విచారణలను అడ్డుకోవాలని చూస్తుంటే, మరోవైపు ప్రతినిధుల సభలో మెజారిటీ రాబోతున్న డెమోక్రాట్లు అదే అధికారాలను ఉపయోగించుకుని ట్రంప్ టీమ్‌ను ప్రశ్నించాలని చూస్తున్నారు.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







