చెత్త రికార్డు మూటగట్టుకున్న విరాట్ కోహ్లీ..!
న్యూజిలాండ్ పర్యటనలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరుగుతున్న ఐదో, చివరి వన్డేలోనూ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ వైఫల్యంతో విరాట్ కోహ్లీ(Virat Kohli) తన కెరీర్లోనే ఒక చెత్త రికార్డును సమం చేసి అవాంఛిత జాబితాలో చేరాడు. ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ లేదా టోర్నీలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయిన తన పాత రికార్డును కోహ్లీ మళ్లీ పునరావృతం చేశాడు.
ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఇది మూడోసారి. గతంలో 2011 ప్రపంచకప్‌లో 3 సార్లు, 2012-13లో పాకిస్తాన్ పర్యటనలో 3 సార్లు, చివరిగా 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 3 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యాడు. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు కివీస్ గడ్డపై అదే తరహాలో విఫలమవడం అభిమానులను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇవి కూడా చదవండి
ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit sharma) ఏడు పరుగులు.., రుతురాజ్ గైక్వాడ్ (18) త్వరగానే వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (5) కూడా స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్ 22 పరుగులకే పరిమితమయ్యాడు. కష్టాల్లో పడిన జట్టును అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో నమన్ ధీర్ 14 పరుగులు జోడించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ తలో మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ వెన్నెముక విరిచారు. మాథ్యూ ఫిషర్ రెండు వికెట్లు తీయగా, బ్లెయిర్ టిక్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.







