డల్లాస్లోని మహాత్మా గాంధీ స్మారకస్థలిని సందర్శించిన ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి!
ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ పరిసర ప్రాంతమైన అర్వింగ్లోని మహాత్మా గాంధీ స్మారకస్థలిని సందర్శించి గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఫ్రిస్కో నగరంలో ఇటీవలే నూతన ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 18 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో అమెరికాలోనే అతిపెద్ద మహాత్ముని స్మారకస్థలిని ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కమిటీ సభ్యులను శ్రీనివాసులు శెట్టి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ స్మారకస్థలి 12 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్మారకస్థలి కమిటీ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర, వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వల, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అధ్యక్షుడు మహేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జోగులాంబ గద్వాల జిల్లా పెదపోతులపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు శెట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఎస్బీఐలో ఒక సాధారణ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నతమైన ఛైర్మన్ స్థాయికి చేరుకున్నారు. 2024లో భారత ప్రభుత్వంచే నియమితులైన ఆయన, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.







