IRCTC బుకింగ్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు ఖాళీ.. తెరవెనుక పెద్ద మాఫియానే?
ఇంట్లో ఏదైనా పండగ ఉందనుకోండి. అమ్మానాన్నలు సొంతూరిలో ఎదురుచూస్తుంటారు. ఎలాగైనా ఈసారి పండగకు ఇంటికి వెళ్లాలని మీరు డిసైడ్ అవుతారు. రెండు నెలల ముందే టికెట్ బుకింగ్ కోసం అలారం పెట్టుకుంటారు. బుకింగ్ టైమ్ రాగానే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటారు. అంతా రెడీ.. ఒక్క క్లిక్ చేస్తే టికెట్ మీ చేతిలో పడుతుందనుకుంటారు. కానీ స్క్రీన్‌పై మాత్రం వెయిటింగ్ లిస్ట్! తత్కాల్ కోసం ప్రయత్నిస్తే రెండు నిమిషాల్లోనే సీట్లు ఖాళీ. మళ్లీ ప్రయత్నిస్తారు.. మళ్లీ అదే రిజల్ట్. చివరికి ఒక చిన్న ప్రశ్న మీ మెదడులో తిరుగుతుంది.. మనకంటే ముందు అసలు ఎవరు టికెట్లన్నీ బుక్ చేసుకుంటున్నారు?
ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ ఈ టికెట్ గేమ్ వెనుక మనకు కనిపించని మరో ప్రపంచం ఉంది. మనం CAPTCHA నింపుతూ, OTP కోసం ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లు కొన్ని సెకన్లలోనే వందల బుకింగ్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్రమ ఏజెంట్లు, ఫేక్ అకౌంట్లు, ఇతరుల గుర్తింపు వివరాలతో నడిచే నెట్‌వర్క్‌లు.. ఇదంతా ఒక సైలెంట్ ఆపరేషన్లా సాగుతోంది. పార్లమెంటులో బయటపడ్డ గణాంకాలు చూస్తే ఈ వ్యవహారం ఎంత పెద్దదో అర్థమవుతుంది. అసలు మనం టికెట్ కోసం పోటీపడుతున్నది మరో ప్రయాణికుడితోనా? లేక మనకు కనిపించని ఒక డిజిటల్ మాఫియాతోనా?
58 శాతం బుకింగ్ రిక్వెస్టులు మనుషులవి కావు.. బాట్లదే హవా!
IRCTC లో టికెట్ బుక్ చేయడానికి మనం చేసే ప్రయత్నాల కంటే ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లు పంపే రిక్వెస్టులే ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. 2026 జనవరి నుంచి జూన్ మధ్య ఇదే పరిస్థితి కనిపించింది. పార్లమెంటులో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ ఆరు నెలల్లో IRCTC బుకింగ్ వ్యవస్థకు ఏకంగా 15.38 బిలియన్ రిక్వెస్టులు వచ్చాయి. వీటిలో 8.88 బిలియన్ రిక్వెస్టులు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా వచ్చినవే. అంటే మొత్తం ప్రయత్నాల్లో 57.74 శాతం బాట్ల నుంచే వచ్చాయి. జూన్ నెలలో ఈ సంఖ్య 66 శాతాన్ని కూడా దాటింది.
అయితే ఈ రిక్వెస్టులన్నీ టికెట్లుగా మారిపోయాయని కాదు. రైల్వే శాఖ తన ఈ-టికెటింగ్ వ్యవస్థ ద్వారా చాలా ఆటోమేటెడ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు చెబుతోంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. లక్షల సంఖ్యలో బాట్లు ఒకేసారి సర్వర్లపై దాడి చేస్తే, వాటిని అడ్డుకునే ప్రయత్నంలో నిజమైన ప్రయాణికుల బుకింగ్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
మీరు వివరాలు నింపేలోపు.. సాఫ్ట్వేర్ మొత్తం పని ఫినిష్!
ఈ అక్రమ బుకింగ్ సాఫ్ట్వేర్ల అసలు బలం వాటి వేగం. ప్రయాణికుల పేర్లు, వయసు, రైలు నంబర్లు, పేమెంట్ వివరాలను ముందుగానే అందులో సేవ్ చేస్తారు. బుకింగ్ విండో ఓపెన్ కాగానే సాఫ్ట్వేర్ రంగంలోకి దిగి వరుసగా రిక్వెస్టులు పంపిస్తుంది. సాధారణంగా మనం లాగిన్ అవ్వడం, ప్రయాణ వివరాలు నింపడం, CAPTCHA పూర్తి చేయడం, పేమెంట్ చేయడం వంటి పనులకు రెండు నిమిషాల వరకు సమయం తీసుకుంటాం. కానీ ఈ సాఫ్ట్వేర్ కొన్ని సెకన్లలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయగలదు. CAPTCHAను దాటుకునే టెక్నాలజీ కూడా వీటికి ఉంటుంది.
అంటే మనం ఇంకా ప్రయాణికుడి వివరాలు సరిచూసుకుంటున్న సమయంలోనే ఈ సాఫ్ట్వేర్లు సీట్ల కోసం పోటీ పడుతుంటాయి. గతంలో Nexus, Red Mirchi, Super Tatkal వంటి సాఫ్ట్వేర్లను అక్రమ ఏజెంట్లు ఉపయోగించేవారు. 2020లో రైల్వే శాఖ, RPF చర్యలతో వాటిని నిలిపివేశారు. కానీ అదే తరహా టెక్నాలజీ కొత్త పేర్లతో, కొత్త పద్ధతుల్లో తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు నివేదిక చెబుతోంది.
సాఫ్ట్‌వేర్‌తో కుదరకపోతే.. మనుషులనే రంగంలోకి దించుతున్నారు!
రైల్వే శాఖ ఆటోమేటెడ్ బుకింగ్‌లను గుర్తించి బ్లాక్ చేయడానికి ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఒక మనిషి కీబోర్డుపై టైప్ చేసే వేగం, మౌస్ కదిలించే విధానం సహజంగా ఉంటాయి. బాట్ మాత్రం మిల్లీసెకన్లలోనే ఫారమ్ నింపేస్తుంది. ఒకే ఇంటర్నెట్ నెట్వర్క్ నుంచి డజన్ల కొద్దీ అకౌంట్లు ఒకేసారి ప్రయత్నించినా సిస్టమ్ అనుమానిస్తుంది. పేమెంట్ దశకు అసాధారణ వేగంతో చేరుకున్న అకౌంట్లను కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది.
అయితే అక్రమ ఏజెంట్లు కూడా అంత ఈజీగా వెనక్కి తగ్గడం లేదు. ఆధార్ వెరిఫికేషన్, IRCTC అకౌంట్ నిబంధనలు కఠినతరం కావడంతో మరో మార్గాన్ని ఎంచుకున్నారని నివేదిక వెల్లడిస్తోంది. గ్రామాలు, చిన్న పట్టణాల్లోని వందలాది మంది వ్యక్తుల ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్లు సేకరించి వారి పేర్లతో అకౌంట్లు సృష్టిస్తున్నారని చెబుతోంది. ఆ తర్వాత 20 నుంచి 30 మంది యువకులను కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి వేగంగా టికెట్లు బుక్ చేయిస్తున్నారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాఫ్ట్వేర్ ద్వారా బుకింగ్ చేస్తే రైల్వే సిస్టమ్‌కు అనుమానం రావచ్చు. కానీ ఒక వ్యక్తి స్వయంగా కంప్యూటర్ ముందు కూర్చుని వివరాలు నమోదు చేస్తే అది సాధారణ ప్రయాణికుడి బుకింగ్లాగే కనిపిస్తుంది. టెక్నాలజీని అడ్డుకునేందుకు రైల్వే శాఖ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, దాన్ని తప్పించుకునేందుకు అక్రమ ఏజెంట్లు మరోవైపు కొత్త మార్గాలు వెతుకుతున్నారు.
బాట్లు లేకపోయినా టికెట్ దొరకడం కష్టమే.. కారణం ఈ కోటాల గోల!
అయితే IRCTCలో టికెట్లు దొరకకపోవడానికి బాట్లే కారణమని అనుకుంటే పొరబడినట్లే. రైల్వేలో ఉన్న కోటా విధానం కూడా ఈ సమస్యలో కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 22 నుంచి 24 కోచ్‌లు ఉంటాయి. మొత్తం సీట్లు సుమారు 1,400 నుంచి 1,700 వరకు ఉంటాయి. కానీ ఈ సీట్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైనప్పుడు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండవు.
ప్రయాణానికి 60 రోజుల ముందు బుకింగ్ ప్రారంభమైనప్పుడు ఉదయం 8 గంటలకు కొంతమేర సీట్లను జనరల్ కోటాలో ఉంచుతారు. మిగిలిన వాటిలో తత్కాల్, మహిళలు, సీనియర్ సిటిజన్లు, మార్గమధ్యంలోని ఇతర స్టేషన్ల నుంచి ప్రయాణించేవారికి వేర్వేరు కోటాలు ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు లక్నో మీదుగా వెళ్తుందనుకుందాం. ఢిల్లీ నుంచి లక్నో వరకు ప్రయాణించే వాళ్లకే ఎక్కువ సీట్లు కేటాయిస్తే, లక్నో దాటిన తర్వాత గోరఖ్‌పూర్ వరకు అవి ఖాళీగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల గమ్యస్థానాలను బట్టి సీట్లను విభజిస్తుంది.
దీనికి తోడు ప్రతి క్లాస్‌లో సుమారు 10 నుంచి 30 శాతం సీట్లను తత్కాల్ కోటాలో ఉంచుతారు. మహిళలు, గర్భిణులు, సీనియర్ సిటిజన్లకు కొన్ని లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితులు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, రైల్వే ఉద్యోగుల కోసం సుమారు 2 నుంచి 5 శాతం సీట్లను ఎమర్జెన్సీ లేదా వీఐపీ కోటాలో ఉంచుతారు.
ఇన్ని కోటాలు పోను సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సీట్లు పరిమితంగానే ఉంటాయి. పండగలు, సెలవుల సమయంలో లక్షలాది మంది ఒకేసారి బుకింగ్ కోసం ప్రయత్నిస్తారు. ఒక IRCTC అకౌంట్ ద్వారా ఒకేసారి ఆరు టికెట్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో పోటీ మరింత పెరుగుతుంది. తత్కాల్లో అయితే పరిస్థితి ఇంకా ఘోరం. కేవలం 100 నుంచి 150 సీట్ల కోసం లక్షల మంది పోటీపడే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు బాట్లు లేకపోయినా టికెట్లు క్షణాల్లో అయిపోవచ్చు.
వెయిటింగ్ లిస్ట్ వచ్చిందా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందని వెంటనే ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆన్లైన్ టికెట్, రైల్వే కౌంటర్ టికెట్ విషయంలో నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. రిజర్వేషన్ కౌంటర్లో తీసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో జనరల్ కోచ్‌లో ప్రయాణించవచ్చు. కానీ స్లీపర్ లేదా ఏసీ రిజర్వ్డ్ కోచ్‌లోకి వెళ్లడానికి అనుమతి ఉండదు. టీటీఈ తనిఖీ సమయంలో ఖాళీ బెర్త్ ఉంటే సంబంధిత ఛార్జీలు లేదా జరిమానా వసూలు చేసి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్ మాత్రం చార్ట్ తయారయ్యే సమయానికి కన్ఫర్మ్ కాకపోయినా, RAC స్థాయికి చేరుకోకపోయినా ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. డబ్బులు తిరిగి వస్తాయి. అలాంటి టికెట్‌తో జనరల్ కోచ్‌లో ప్రయాణించినా టికెట్ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు. జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.
ఇక వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ టికెట్ వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవాలంటే చార్ట్ తయారయ్యే వరకు వేచి చూడాలి. మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు తయారవుతుంది. చివరి చార్ట్ సుమారు 30 నిమిషాల ముందు సిద్ధమవుతుంది. ఇతర కోటాల్లో మిగిలిపోయిన సీట్లను వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇంకా సీట్లు ఖాళీగా ఉంటే ‘Current Availability’ కింద బుక్ చేసుకోవచ్చు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల నుంచి 30 నిమిషాల ముందు వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడు VIKALP ఆప్షన్ ఎంచుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ రైల్లో టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడు కన్ఫర్మ్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. మరో చిన్న ట్రిక్ ఏంటంటే.. మీ ఊరి నుంచి టికెట్ బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ వస్తున్నప్పుడు, మీ నగరానికి 50 నుంచి 100 కిలోమీటర్ల ముందు ఉన్న ప్రధాన స్టేషన్ నుంచి సీట్ల లభ్యతను చెక్ చేయండి. అక్కడ కన్ఫర్మ్ సీటు ఉంటే ఆ స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకుని, తర్వాత ‘Change Boarding Point’ ఆప్షన్ ద్వారా మీ సొంత స్టేషన్‌ను బోర్డింగ్ పాయింట్‌గా మార్చుకోవచ్చు.
6.68 కోట్ల అకౌంట్లు డీయాక్టివేట్.. అయినా అక్రమ బుకింగ్‌లకు బ్రేక్ పడిందా?
టికెట్ బుకింగ్ మోసాలను అడ్డుకోవడానికి రైల్వే శాఖ కూడా తన టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తోంది. రైల్వే ఐటీ విభాగమైన CRIS సర్వర్ సామర్థ్యాన్ని, బ్యాండ్‌విడ్త్‌ను పెంచుతోంది. ప్రస్తుతం నిమిషానికి 30 వేలకుపైగా టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉందని రైల్వే శాఖ చెబుతోంది. ఒకే రోజులో 16 లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసిన రికార్డు కూడా ఉంది.
2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు అనుమానాస్పద మొబైల్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, IP అడ్రస్‌లతో సంబంధం ఉన్న 6.68 కోట్లకు పైగా యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేశారు. నకిలీ అకౌంట్ల కోసం ఉపయోగించిన 13 వేలకుపైగా ఈమెయిల్ అడ్రస్‌లను బ్లాక్ చేశారు. అనుమానాస్పద రిక్వెస్టులను గుర్తించేందుకు అధునాతన ఫైర్‌వాల్స్, AI ఆధారిత యాంటీ-బాట్ టూల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి
ఇక ప్రయాణికుల కోసం RailOne అనే సూపర్ యాప్‌ను తీసుకొచ్చారు. రిజర్వేషన్ టికెట్లు, జనరల్ టికెట్లు, ఫిర్యాదులకు సంబంధించిన సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను కూడా ఆధునిక టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. బుకింగ్ వేగం పెంచడంతో పాటు వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ అంచనాలను మరింత కచ్చితంగా చూపించాలనేది మరో ఉద్దేశం.
అసలు సమస్య బాట్లేనా? లేక సీట్ల కంటే ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారా?
రైల్వే శాఖ బాట్లను అడ్డుకోవడానికి ఎన్ని టెక్నాలజీలు తీసుకొచ్చినా, ఒకేసారి లక్షలాది రిక్వెస్టులు సర్వర్లపై పడితే నిజమైన ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారు. ఒకవైపు అక్రమ ఏజెంట్ల ఆట.. మరోవైపు పరిమిత సీట్ల కోసం లక్షల మంది ప్రయాణికుల పోటీ. ఈ రెండింటి మధ్య సామాన్యుడి టికెట్ కల నెరవేరడం కష్టంగా మారుతోంది.
రైల్వే శాఖ గణాంకాల ప్రకారం 89 శాతం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. అంటే ఆన్లైన్ బుకింగ్‌పై ఆధారపడే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. బాట్ల సమస్య పూర్తిగా తొలగిపోయినా పండగ సీజన్లో టికెట్ల కోసం పోటీ తగ్గిపోతుందని చెప్పలేం. ఎందుకంటే సీట్ల సంఖ్య పరిమితం.. వాటి కోసం ప్రయత్నించే వాళ్లు లక్షల్లో ఉన్నారు.
కాబట్టి సర్వర్ల సామర్థ్యం పెంచడం ఒక్కటే సరిపోదు. అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతరుల ఆధార్ వివరాలతో నడుస్తున్న అకౌంట్లను గుర్తించాలి. పండగల సమయంలో అదనపు రైళ్లు నడపాలి. నిజమైన ప్రయాణికులకు బుకింగ్‌లో సమాన అవకాశం కల్పించే విధానాలు తీసుకురావాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







