నవంబర్ 22న ‘నాట్స్’ కొలరాడో సంబరాలు.. అలరించనున్న సింగర్ కోటి లైవ్ కాన్సర్ట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) కొలరాడో చాప్టర్ ఆధ్వర్యంలో మన తెలుగు భాష, సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించే ఉద్దేశంతో ‘కొలరాడో సంబరాలు 2026’ అత్యంత ఘనంగా జరగనున్నాయి. నవంబర్ 22, 2026, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు(MST) Douglas County Fairgrounds, 500 Fairgrounds Road, Castle Rock, CO 80104 వేదికగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సామూహిక తెలుగు సంబరంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకులు కోటి 50 వసంతాల సంగీత ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయన నేతృత్వంలో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఇది సంగీతాభిమానులకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచనుంది. అలాగే, ఈ సంబరాలు ఒక చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలవనున్నాయి. ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ సాధనలో భాగంగా 500 మందికి పైగా సింగర్లతో ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని సామూహికంగా ఆలపించనున్నారు. “ఒకే కుటుంబం, ఒకే గొంతు, ఒక చారిత్రక ఘట్టం” అనే నినాదంతో ఈ రికార్డ్ ప్రయత్నం జరగనుంది.
కార్యక్రమంలో పాల్గొనడానికి సాధారణ ప్రవేశ రుసుము 15 డాలర్లుగా నిర్ణయించగా, 10 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించారు. అయితే, ఎలైట్ వరల్డ్ రికార్డ్స్‌లో పాల్గొనడానికి, ఈవెంట్ జనరల్ అడ్మిషన్ కోసం వేర్వేరుగా రెండు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, అలాగే కొలరాడో చాప్టర్ కమిటీ సభ్యులు, ప్రవాస తెలుగువారంతా కుటుంబ సమేతంగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.







