ట్రంప్ చుట్టూ ఇంత పెద్ద కథ నడుస్తోందా? వైట్‌హౌస్‌లో ‘లేడీస్ గ్యాంగ్’ కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రత్యర్థులతో గొడవలు, రాజకీయ విమర్శలు, సంచలన నిర్ణయాలు ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు వైట్‌హౌస్ లోపలే మరో కథ నడుస్తోందట. ట్రంప్‌కు అత్యంత దగ్గరగా ఉండే మహిళలు, ఆయనపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండాలనే విషయంలో ఆధిపత్య పోరుకు దిగుతున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. బయటకు చూస్తే అంతా సాధారణంగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఎవరు అధ్యక్షుడికి దగ్గరగా ఉన్నారు? ఎవరి మాటకు ఎక్కువ విలువ ఉంది? అనే లెక్కలు నడుస్తున్నాయని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ వ్యవహారంపై ది డైలీ బీస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలిగా మారిన 35 ఏళ్ల నటాలీ హార్ప్ పేరు ఈ వివాదంలో పదేపదే వినిపిస్తోంది. ట్రంప్ చుట్టూ ఉండే మహిళల బృందం ఒక రాజకీయ సలహాదారుల టీమ్‌లా కాకుండా, తమలో తామే ఆధిపత్యం కోసం పోటీపడే గ్రూప్‌లా మారిపోయిందని కొందరు వైట్‌హౌస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కథనం వెల్లడించింది.
ట్రంప్‌కు నచ్చిన వార్తలే అందిస్తున్న ‘హ్యూమన్ ప్రింటర్’!
నటాలీ హార్ప్ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరగడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆమె ట్రంప్‌కు కేవలం వ్యక్తిగత సహాయకురాలిగా మాత్రమే ఉండటం లేదని, ఆయన రోజువారీ వ్యవహారాల్లోనూ కీలకంగా మారిపోయారని కథనం చెబుతోంది. ఏడాదికి 1.5 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.3 కోట్ల జీతం తీసుకుంటున్న ఆమెకు ట్రంప్ దగ్గర ప్రత్యేక స్థానం ఉందట. ఓవల్ ఆఫీస్ పక్కనే ఉన్న ఆయన ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో ఆమెకు పనిచేసేందుకు ప్రత్యేక స్థలం కూడా కల్పించారని సమాచారం.
ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. ట్రంప్‌కు నచ్చే వార్తలు, ఆయనను ప్రశంసించే కథనాలు, సానుకూల నివేదికలను ప్రింట్ చేసి అందించడం నటాలీకి అలవాటుగా మారిందట. అధ్యక్షుడికి ఇలాంటి వార్తలను అందిస్తూ ఉండటంతో వైట్‌హౌస్‌లోని కొందరు సిబ్బంది ఆమెకు ‘హ్యూమన్ ప్రింటర్’ అనే పేరు కూడా పెట్టారట. అంటే ట్రంప్ ఏం చదవాలి, ఎలాంటి వార్తలు చూడాలి అనే విషయంలో కూడా ఆమెకు ప్రత్యేక పాత్ర ఉందనే అభిప్రాయం అక్కడి వర్గాల్లో వ్యక్తమవుతోందన్నమాట.
అయితే ఈ సాన్నిహిత్యమే ఇప్పుడు మిగతా సిబ్బందికి ఇబ్బందిగా మారిందని కథనం చెబుతోంది. ఒకప్పుడు ట్రంప్‌కు దగ్గరగా ఉన్నవారికి కూడా ఇప్పుడు అదే స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి పెరుగుతోందట.
సుసీ వైల్స్ వెళ్లిపోయారు.. నటాలీ హార్ప్ మాత్రం అక్కడే!
ఈ వ్యవహారంలో మరో కీలకమైన పేరు సుసీ వైల్స్. ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన రాజకీయ సలహాదారుల్లో ఒకరిగా ఆమెకు గుర్తింపు ఉంది. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఎదుర్కొన్న ఎదురుదెబ్బల నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నట్లు కథనం పేర్కొంది.
ఇక్కడే మౌరీన్ కలహాన్ రాసిన అభిప్రాయ కథనం మరో కోణాన్ని బయటపెట్టింది. ట్రంప్ చుట్టూ ఉన్న మహిళల్లో సుసీ వైల్స్ మిగతావారికి భిన్నమైన వ్యక్తిత్వం కలిగినవారని ఆమె వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు దగ్గరగా ఉండే మహిళల ఎంపిక, వారికి లభిస్తున్న ప్రాధాన్యం గురించి కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఒకప్పుడు ట్రంప్ నిర్ణయాలపై ప్రభావం చూపగలిగిన సుసీ వైల్స్ ఇప్పుడు ఆ స్థానంలో లేరు. కానీ నటాలీ హార్ప్ మాత్రం అధ్యక్షుడికి మరింత దగ్గరగా కొనసాగుతున్నారు. ఈ వ్యత్యాసమే వైట్‌హౌస్‌లో అసంతృప్తికి కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ, ట్రంప్ చుట్టూ ఉన్న కొందరు మహిళలు వైట్‌హౌస్‌ను ఒక స్కూల్లోని లంచ్ టేబుల్లా మార్చేశారని విమర్శించినట్లు కథనం పేర్కొంది. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానికంటే, ఎవరు ఎక్కడ కూర్చోవాలి? ఎవరికి ఎంత ప్రాధాన్యం దక్కాలి? అనే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఆ అధికారి విమర్శలోని సారాంశం.
నటాలీకి ముందు లారా లూమర్.. ఇప్పుడు ఆమె స్థానాన్ని ఎవరు తీసుకున్నారు?
ట్రంప్ చుట్టూ ఇలాంటి వ్యక్తుల ప్రభావం గురించి చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లారా లూమర్ అనే కుడిపక్ష కార్యకర్త కూడా ట్రంప్‌కు అత్యంత దగ్గరగా ఉండేవారని కథనం గుర్తుచేసింది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో ఆమె ట్రంప్‌తో కలిసి ఆయన ప్రైవేట్ విమానంలో ప్రయాణించేవారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు నచ్చని అధికారులు, ప్రభుత్వ విభాగాల్లోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు లారా లూమర్ స్థానంలో నటాలీ హార్ప్ ఎక్కువ ప్రాధాన్యం సంపాదించారనే అభిప్రాయాన్ని మౌరీన్ కలహాన్ వ్యక్తం చేశారు. అయితే వీరిద్దరి పాత్రలు పూర్తిగా ఒకటేనని చెప్పలేం. కానీ ట్రంప్‌కు ఎవరు దగ్గరగా ఉన్నారు? ఆయన వ్యక్తిగత నమ్మకాన్ని ఎవరు సంపాదిస్తున్నారు? అనే అంశాలు అమెరికా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నటాలీ హార్ప్‌పై గతంలోనూ కొన్ని ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. ట్రంప్‌పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆమె వ్యక్తిగతంగా ప్రశంసాపూర్వక లేఖలు రాసేవారని, ఆయనకు కనిపించేలా వాటిని వదిలిపెట్టేవారని డైలీ బీస్ట్ గత కథనాల్లో వెల్లడించింది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో ఆమె ప్రవర్తనపై సీక్రెట్ సర్వీస్ కూడా భద్రతాపరమైన కోణంలో దృష్టి పెట్టిందని తాజా కథనం పేర్కొంది.
ఐదు రోజులకే ముగిసిన కేటీ జకారియా వైట్‌హౌస్ ప్రయాణం!
ట్రంప్ చుట్టూ మహిళా సిబ్బంది మార్పులు కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చాయి. ప్రస్తుత ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్థానంలో కేటీ జకారియాను తీసుకురావడానికి ట్రంప్ ప్రయత్నించినట్లు డైలీ బీస్ట్ కథనం పేర్కొంది. అయితే ఆమె వైట్‌హౌస్‌లో కొనసాగింది కేవలం ఐదు రోజులే. అవసరమైన అర్హతలు, అనుభవం లేవనే విమర్శలు రావడంతో ఆమెను తొలగించినట్లు కథనం వెల్లడించింది.
ఇలాంటి పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే ట్రంప్ చుట్టూ ఉన్న అధికార వర్గాల్లో తరచూ మార్పులు జరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఒకప్పుడు అధ్యక్షుడికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు కొంతకాలానికి దూరమవుతున్నారు. కొత్తవాళ్లు ఆ స్థానంలోకి వస్తున్నారు. అయితే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలపై మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ వైట్‌హౌస్‌లో రాజకీయాల కంటే వ్యక్తిగత విధేయతే ముఖ్యమవుతోందా?
మౌరీన్ కలహాన్ తన అభిప్రాయ కథనంలో ట్రంప్‌ను ఇంగ్లండ్ చరిత్రలోని రాజు హెన్రీ VIIIతో పోల్చారు. ఆ రాజు తనకు నచ్చినవారిని దగ్గరగా ఉంచుకుని, నచ్చకపోతే దూరం చేసేవాడనే చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ కూడా తన చుట్టూ ఉన్న మహిళల విషయంలో అలాంటి ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు. అయితే ఇది ఆమె వ్యక్తిగత రాజకీయ వ్యాఖ్య మాత్రమే.
మొత్తానికి ఈ వ్యవహారం ఒక సహాయకురాలికి అధ్యక్షుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అంశంతోనే ఆగిపోవడం లేదు. అమెరికా అధ్యక్షుడికి అందే సమాచారం, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తులు, కీలక నిర్ణయాల వెనుక ఉండే ప్రభావశక్తులు.. ఇవన్నీ పాలనలో చాలా ముఖ్యమైనవి. అలాంటి స్థానాల్లో ఉన్నవారి మధ్య వ్యక్తిగత ఆధిపత్య పోరు మొదలైతే దాని ప్రభావం వైట్‌హౌస్ పనితీరుపై కూడా పడే అవకాశం ఉంటుంది.
అధ్యక్షుడి చుట్టూ వందల మంది అధికారులు ఉండొచ్చు. కానీ ఆయన చెవిలో ఏం చెబుతున్నారు? ఆయనకు ఏ వార్త చూపిస్తున్నారు? ఆయన నమ్మకాన్ని ఎవరు గెలుచుకుంటున్నారు? అనేవే అసలు కీలకమైన ప్రశ్నలు. ఇప్పుడు ట్రంప్ వైట్‌హౌస్ గురించి బయటకు వస్తున్న కథనాలు కూడా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







