సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు…రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
పెట్టుబడుల రక్షణకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ – పారిశ్రామిక సంస్కరణల్లో ఎస్క్రో ఖాతా ట్రెండ్ సెట్టర్
వన్ ఫ్యామిలీ వన్ ఏఐ లక్ష్యం…పీ4తో పేదల జీవన ప్రమాణాలు పెంచుతాం
గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలకు పరిష్కారం
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై ఉపరాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నిర్దేశిత గడువులోగా వాటిని కార్యరూపంలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మొత్తం 303 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు, తద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించారు. స్వచ్ఛ షహర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖ నిలవడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించుకున్నామని తెలిపారు.
‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ థీమ్‌తో ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్, థాట్ లీడర్షిప్ అంశాలపై రెండు రోజుల పాటు సదస్సు జరిగిందన్నారు. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి పెట్టుబడులను తీసుకురావడం, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే తమ సంకల్పమన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు ఆరు సన్నాహక సమావేశాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. చేనేత క్లస్టర్ల నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కియా సంస్థ ఏడాదికి అదనంగా రెండు లక్షల కార్ల తయారీ కోసం రూ.18,878 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిందని, రిలయన్స్ సంస్థ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. 2024 నుంచి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో 522 ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చుతున్నాయని తెలిపారు.
13 లైసెన్సుల ద్వారా ఐదు రోజుల్లోనే అనుమతులు
పారిశ్రామిక అనుమతుల విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. నాలా చట్టాన్ని రద్దు చేశామని, కేవలం 13 లైసెన్సుల ద్వారా ఐదు రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఆటోమేటిక్ అప్రూవల్స్, సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాలను అమల్లోకి తెచ్చామని, ప్రతి ప్రాజెక్టుకు నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రారంభించామని, పారిశ్రామిక సంస్కరణల్లో ఇది ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్టును కూడా అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలైతే పెద్దఎత్తున పెట్టుబడుల ప్రవాహం వస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాటిని సంరక్షించడం, కార్యరూపంలోకి తీసుకురావడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఏఐ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కొత్త లక్ష్యాలు
గతంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని తెలుగువారిని ప్రపంచస్థాయి నిపుణులుగా నిలిపామని, ఇప్పుడు ‘వన్ ఫ్యామిలీ వన్ ఏఐ’ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన వారిని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రతి ఇంటిపైనా సౌర ఫలకాలను ఏర్పాటు చేసి అధిక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. కేంద్రం సహకరిస్తే ఈ లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డ్వాక్రా మహిళలకు చేయూత అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు కూడా సాకారమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు పీ4 కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే లక్ష మంది మార్గదర్శులు 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని వారికి మద్దతుగా నిలిచారని వెల్లడించారు.
కేవలం డబ్బు మాత్రమే జీవన ప్రమాణాలను పెంచలేదని, వారికి అందించే చేయూత, సాధికారతతోనే మెరుగైన జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనే సంకల్పంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నీటి భద్రత కీలక అంశంగా మారిందని, గోదావరి-కావేరి నదుల అనుసంధానం దక్షిణాది రాష్ట్రాలకు పరిష్కారం చూపుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని, గోదావరి-కావేరి అనుసంధానంతో ఈ విభేదాలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. తమిళనాడు-కర్ణాటక, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకుని ముందుకు సాగాలని సూచించారు. మనమంతా ముందుగా భారతీయులమని, ఆ తర్వాతే రాష్ట్రాలు, ప్రాంతాలని పేర్కొంటూ సామరస్యపూర్వకంగా నీటి పంపకాలు జరగాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందుందని తెలిపారు. ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళ్తోంది: ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి ఒప్పందాలతో పాటు కీలక అంశాలపై మేధోమథనం జరిగిందన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే సదస్సుకు కూడా పారిశ్రామికవేత్తలను ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన ఇబ్బందులను అధిగమించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అసాధారణమని ప్రశంసించారు. పోర్టులు, విమానాశ్రయాలు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, పర్యాటక రంగాల్లో రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో టెక్నాలజీ కీలకమైన అభివృద్ధి చోదక శక్తిగా నిలుస్తుందని, ఏఐ వంటి అధునాతన సాంకేతికతను పాలన, పౌరసేవల్లో వినియోగించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యారంగం, ఆవిష్కర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో భారత్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 100 దేశాలకు అందించడం ద్వారా దేశం తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. ఒప్పందాలకే పరిమితం కాకుండా అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, ‘వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్, షేర్ ప్రాస్పెరిటీ’ విధానంతో ముందుకు సాగాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి: గవర్నర్, కేంద్ర మంత్రి
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, విశాఖలో తొమ్మిదోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సదస్సు విజయవంతమైందని పేర్కొన్నారు. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసం వెల్లడైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, తూర్పు కోస్తా రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో సంస్కరణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఏపీలో యువత నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ‘వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఛాంపియన్’ విధానం ద్వారా టెక్నాలజీ నైపుణ్యాలను ప్రోత్సహించనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉందని, ఈ నేపథ్యంలో ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ అందించడం కీలకమన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో 114 గిగావాట్ల ఉత్పత్తి కోసం ఏపీ ఒప్పందాలు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కేటాయించిన రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను ఏపీ గరిష్టంగా వినియోగించుకుంటోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఏపీకి ఇప్పటికే 7.8 లక్షల యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు దేశంలోనే సమర్థంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల్లో ఒకరని ప్రశంసించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రెండు రోజుల సదస్సులో 65 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనగా, బిజినెస్ టు బిజినెస్, గవర్నమెంట్ టు బిజినెస్ సమావేశాల ద్వారా పెద్దఎత్తున ఒప్పందాలు కుదిరాయి. ముగింపు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ సుచిత్రా ఎల్లా పాల్గొన్నారు.







