ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్పోర్ట్
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది
ఔత్సాహికుల ఆలోచనలను ఆచరణలో తేవడమే బ్రాండ్ ఆంధ్ర ప్రత్యేకత
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం
నటుడు రానా దగ్గుబాటితో పాడ్‌కాస్ట్‌లో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం: విశాఖ నగరం రాష్ట్రానికి ప్రవేశ ద్వారం అయితే, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే లాంటిదని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో 31వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో ‘ది పవర్ ఆఫ్ పాసిబిలిటీ: బిల్డింగ్ పార్ట్నర్షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రముఖ సినీనటుడు రానా దగ్గబాటి నిర్వహించిన పాడ్ కాస్ట్ కు మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భోగాపురం ఎయిర్ పోర్టు హైదరాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదిగా ఎదిగిన రోజే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇలాంటి పెద్ద లక్ష్యాలు కీలకమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, బ్రాండ్ ఆంధ్ర, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక అభివృద్ధి, సినిమా పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీ, యువతకు ఉపాధి–వ్యాపార అవకాశాలు తదితర అంశాలపై రానా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు.
రాష్ట్రాభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్
రాబోయే రెండు దశాబ్ధాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. విశాఖను దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న నమ్మకంతో పనిచేస్తున్నాం. క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్టును ఉదాహరణగా వివరిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చి, నిపుణులు, ప్రపంచ స్థాయి సంస్థలను ఒకచోట చేర్చి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతిలో భారతదేశంలోనే తొలి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతున్నాం.
పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు
విశాఖపట్నంలో ప్రస్తుతం సుమారు 17 స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లాంటి భారీ అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలంటే మరింత పెద్ద స్థాయిలో ఆతిథ్య రంగ మౌలిక సదుపాయాలు అవసరం. ఆలయ పర్యాటకం, బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు, అరకు వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాల్సి ఉంది. అరకు లోయలో మారథాన్ నిర్వహణకు మహీంద్రా సంస్థతో చర్చలు జరుపుతున్నాం. చంద్రబాబు నాయుడు అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన విధానం అద్భుతం. మన ప్రాంతీయ ప్రత్యేకతలపై మనకు నమ్మకం ఉండాలి, వాటికి తగిన గుర్తింపు తీసుకొచ్చేలా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి.
విశాఖలో క్రియేటర్ ఎకానమీకి పెద్దపీట
సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారి అక్కడ స్థిరపడినట్టే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్న రానా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. క్రియేటర్ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటి. సినిమాలు, యూట్యూబ్, గేమింగ్ అన్నీ ఇందులో భాగమే. నా కుమారుడు దేవాన్ష్‌కు కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. రాష్ట్రంలోని పిల్లలు, కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి సృజనాత్మకత ఉంది, చేతిలో ఉన్న ఫోన్‌తోనే వీడియోలు రూపొందించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో నిర్మాతలు, దర్శకులకు స్థలాలు కేటాయించి స్టూడియోలు నిర్మించుకునేలా ప్రోత్సహించడంతో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అవసరమైన సదుపాయాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి ప్రణాళికకు ప్రభుత్వం సిద్ధం
ప్రభుత్వం నుంచి సహకారం, పరిశ్రమ నుంచి చొరవ ఉంటే విశాఖలోనూ సినిమా పరిశ్రమకు మంచి అవకాశాలు సృష్టించవచ్చని రానా చెప్పారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. రానా ఇందుకు ఈ బాధ్యత తీసుకోవాలని, సినిమా, గేమింగ్ రంగాల్లో ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌లో క్రియేటర్లకు అవసరమైన సదుపాయాలపై ఉమ్మడి ప్రణాళిక రూపొందిద్దామని ప్రతిపాదించారు. ఇందుకు రానా స్పందిస్తూ…వైజాగ్‌లో సినిమా రంగంతో పాటు ఇతర క్రియేటివ్ రంగాల వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. దీనిపై బ్లూప్రింట్ ను సోమవారం ఉదయానికల్లా సిద్ధం చేస్తానని రానా చెప్పగా, అదే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అని లోకేష్ చమత్కరించారు.
ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త
విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 58కి పైగా దేశాల ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. రష్యా, జపాన్, యూరప్ తదితర ప్రాంతాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్లో ఒక సంస్థ భారీ యంత్ర పరికరాల తయారీతో పాటు క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన విడిభాగాలను కూడా తయారు చేస్తోంది. ఇది రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక ప్రతిభకు నిదర్శనం. పెట్టుబడుల ఒప్పందాలు, ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యమైతే.. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా ప్రధాన ధ్యేయం.
వైఫల్యాలను అవకాశాలుగా మలచుకోవాలి
ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ…ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతికూల అభిప్రాయాలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు సాగాలి. కొత్త ఆలోచనలను మొదట్లో సమాజం వ్యతిరేకించవచ్చు. అయితే మారేకొద్దీ సానుకూలత లభిస్తుంది. వైఫల్యాన్ని ఎదుగుదలలో భాగంగా స్వీకరించాలి. వైఫల్యం ఎదురైతే సమాజం ఏమనుకుంటుందోనన్న భయాన్ని అధిగమించాలి. FAIL అంటే ‘First Attempt In Learning’. ప్రతి ప్రయత్నం నుంచి నేర్చుకుంటూ మానసికంగా దృఢంగా ఎదగాలి. ఈ విషయంలో చంద్రబాబు గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. పాతికేళ్ల వయసులో ఎమ్మెల్యే కావాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నది సాధించారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభానికి ముందు ఆయన చేసిన మూడు వ్యాపార ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వెనక్కి తగ్గలేదు, స్వయంగా నిలదొక్కుకుని వ్యాపారాన్ని నిర్మించాలన్న లక్ష్యాన్ని వదులుకోలేదు. అదే పట్టుదలను రాజకీయాల్లోనూ కొనసాగించారు. లక్ష్యాన్ని సాధించాలనే తపన, కష్టాలను అధిగమించే పట్టుదల ఉండాలన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రస్తుతం రాజకీయాల్లో యవతకు మంచి అవకాశాలున్నాయి. విశాఖ మేయర్‌తో పాటు పలువురు యువ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు బాధ్యతలు ఇటీవల ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది యువకులే. విదేశాల నుంచి తిరిగొచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ ఇందుకు ఉదాహరణ. వ్యవస్థలో లోపాలున్నాయని విమర్శించడం కాదు, వాటికి పరిష్కారాలు చూపించే ప్రక్రియలో యువత భాగస్వాములు కావాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు, సంస్థలు, ప్రజాప్రతినిధులను కలుస్తూ పట్టుదలతో పనిచేయాలి. పెద్ద కలలు కనడంతోపాటు వాటిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించడం, ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.
వినోద రంగంలో యువతకు శిక్షణ
సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో యువతకు శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సంగీత దర్శకులు, సినిమా రంగంలోని అనుభవజ్ఞులతో కలిసి యువతకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తాం. సంగీత శిక్షణ కోసం థమన్‌తో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. తిరుపతిలోనూ ఇందుకోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దర్శకత్వం, సినిమాటోగ్రఫీ సహా వివిధ విభాగాల్లో నిపుణుల అనుభవాన్ని యువతకు అందించాలన్నది మా ఆలోచన. దీనికి కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతికతను జోడిస్తాం. తద్వారా వినోద రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తాం. యువతలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన తపన ఉండాలి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు.
ఏడాదిలో విశాఖలో సినీ నిర్మాణ కార్యకలాపాలు
రాబోయే ఏడాదిలో విశాఖపట్నంలో తమ సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషిచేస్తానని నటుడు రానా చెప్పారు. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని పేర్కొంటూ.. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలతో పాటు ప్రపంచానికి ఇంకా పూర్తిగా పరిచయం కాని ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. తెలుగు ప్రేక్షకులు ఇతర భాషలు, దేశాల సినిమాలను కూడా ఆదరిస్తారు. భారతీయ వినోద పరిశ్రమ ఆదాయంలో తెలుగు ప్రేక్షకుల వాటా దాదాపు 70 శాతంగా ఉందని, భారత జనాభాలో తెలుగు ప్రజలు దాదాపు పదో వంతు మాత్రమే ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఆదరణ ఉండటం మన ప్రత్యేకత. కొరియా, జపాన్ తదితర దేశాల సినిమాలు, సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల ద్వారా దాదాపు 100 కోట్ల మంది భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంది. బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా పరిచయం చేసినట్టే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని రానా పేర్కొన్నారు.







