అనకాపల్లిలో సెయింట్ గోబెన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ ప్లాంట్
సీఎం చంద్రబాబుతో సెంయింట్ గోబెన్ సీఈఓ శ్రీధర్ సమావేశం
విశాఖపట్నం, నవంబరు 13: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఫ్లోట్ గ్లాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రముఖ ప్రీమియం గ్లాస్ తయారీ సంస్థ సెంయింట్ గోబెన్ సిద్ధమైంది. రూ.1750 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఎన్.శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు. 400 మందికి ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్టు వివరించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు ఆయన ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం తమకు ఏపీలోని తడ, విశాఖపట్నం, కావలిలో తయారీ యూనిట్లు ఉన్నాయని సెయింట్ గోబెన్ సీఈఓ ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో ప్లాస్టర్ బోర్డ్, జిప్సమ్ సిస్టమ్స్, ఇన్సులేషన్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు ఉన్నట్టు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని.. సంస్థకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుపై ఆలోచన చేయాలని సీఎం సూచించారు. ఐఐటీ తిరుపతితో కలిసి నిర్మాణ రంగంలోని ఉత్పత్తులపై పరిశోధనలకు ఏపీని కేంద్రంగా ఎంచుకుని పనిచేయాలని సెయింట్ గోబెన్ సంస్థను ఆహ్వానించారు. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణంలోనూ సెయింట్ గోబెన్ సేవలు అందించేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించేలా చట్టం తీసుకువచ్చే అంశం పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం కల్పించిందని సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిపై విజన్ ప్రణాళికల ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని అన్నారు. తెనాలిలో ఓ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సెయింట్ గోబెన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.







